ట్రంప్ వైపు దూసుకెళితే ఉగ్రవాది అవుతాడా?

Update: 2016-03-13 10:24 GMT
ఒకప్పుడు రాజకీయ నాయకులంటే అమితమైన మర్యాద.. గౌరవం లాంటివి ఉండేవి. కొద్ది మంది వారిని వ్యతిరేకించినా.. శాంతియుతంగా నిరసనలు తెలపటమే కానీ.. భౌతిక దాడులకు ప్రయత్నించటం లాంటి ఘటనలు చాలా..చాలా తక్కువగా ఉండేవి. చెప్పలు విసరటం.. కోడిగుడ్లు విసరటం లాంటివి అరుదుగా చోటు చేసుకునేవి. మారిన కాలంతో పాటు.. ఈ మధ్యకాలంలో అటు నేతల్లోనూ.. ఇటు నిరసన తెలిపే వారిలోనూ అసహనం హద్దులు దాటుతున్న పరిస్థితి.

నేతలు వివాదాస్పదంగా వ్యవహరించటం వెనుకబడిన.. అభివృద్ధి చెందుతున్న దేశాల రాజకీయాల్లో కాస్త కనిపిస్తాయి. ఇక.. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో ఎన్నికలు చాలా హుందగా సాగుతాయన్న భావన ఉండేది. త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా దిగాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం రోజురోజుకీ శ్రుతిమించుతోంది. ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తూ.. తన మాటలతో నిత్యం వివాదాల తేనెతుట్టెను నిత్యం కదిపే ఆయన్ను బరిలోకి దిగకుండా ఉండేలా చేయటానికి సొంత పార్టీ నేతలే ఆయన్ను వ్యతిరేకిస్తున్న పరిస్థితి.

తీవ్ర అసహన వ్యాఖ్యలు చేస్తున్న ఆయనకు దగ్గరగా తాజాగా ఒక వ్యక్తి దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అతన్ని అదుపులోకి భద్రతా సిబ్బంది తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ నోరు పారేసుకున్న తీరు అందరికి షాకింగ్ గా మారింది. తమపై దాడి చేసే ప్రయత్నంచేసినా.. బహిరంగంగా అవమానించాలని ప్రయత్నించినా.. వారిపై చర్యలు తీసుకోవద్దని భద్రతా సిబ్బంది అగ్రనేతలు చెప్పటం కనిపిస్తుంది. కానీ.. ట్రంప్ వ్యవహారంలో అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకోవటం గమనార్హం.

తనకు దగ్గరగా వస్తున్న వ్యక్తిని ఉద్దేశించిన ట్రంప్.. తాను చాలా వయలెంట్ అని.. అందుకు ఉగ్రవాదం విషయంలో తాను చాలా కఠినంగా ఉన్నట్లుగా అభివర్ణించాడు. తన దగ్గరకు రావాలని ప్రయత్నించిన వ్యక్తి ఉగ్రవాది అయి ఉండొచ్చని.. లేదంటే ఐఎస్ తీవ్రవాద సంస్థకు మద్దతుదారు అయి ఉండొచ్చని ఆయన వ్యాఖ్యానించటం గమనార్హం. అతన్ని జైల్లో పెట్టాలని... కోర్టులు అతన్ని తేలిగ్గా వదలవనే అనుకుంటున్నట్లుగా ఏం చేయాలన్న విషయాన్ని ట్రంప్ చెప్పేయటం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. దూకుడుగా తనవైపుకు దూసుకొస్తున్న వ్యక్తిని ఉగ్రవాది అనేస్తున్న ట్రంప్ లాంటోడి చేతికి కానీ అమెరికా అధ్యక్ష పీఠం దక్కితే.. ఇంకేమైనా ఉంటుందా..?
Tags:    

Similar News