అందుకే సున్నీబోర్డు వెనక్కి తగ్గిందా?

Update: 2019-10-18 11:55 GMT
ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న అయోధ్యలోని వివాదాస్పద కట్టడం పై తాజాగా సున్నీబోర్డు ఒక అడుగు వెనక్కి వేయటం.. రాజీకి రావటం..వివాదాస్పద స్థలంలో రామాలయాన్ని నిర్మించేందుకు వీలుగా తాను తప్పుకోవాలనుకుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముగ్గురు కక్షిదారుల మధ్య నడుస్తున్న ఈ వ్యాజ్యం లో కీలక కక్షిదారైన సున్నీబోర్డు రాజీకి సై అనటమే కాదు.. వేరే చోట మసీదును నిర్మించుకునేందుకు ఓకే చెప్పటం వెనుక లెక్కలు వేరే ఉన్నాయని చెబుతున్నారు.

కోర్టు బయట జరిగిన చర్చలతో పాటు.. మరికొన్ని అంశాలు కూడా సున్నీబోర్డు మీద ప్రభావాన్ని చూపించినట్లుగా చెబుతున్నారు. ఇస్లామిక్ ధర్మ శాస్త్రం ప్రకారం ఉన్న అంశాలు కూడా రాజీ చెప్పేందుకు కారణంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి గల్ప్ న్యూస్ మీడియా సంస్థ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇందులో సున్నీబోర్డు రాజీకి కారణమైన అంశాల్ని ప్రస్తావించింది.

ఇస్లామిక్‌ ధర్మశాస్త్రం ప్రకారం.. ఓ చోట ప్రార్థనలు చేయడం ఆపేసినపుడు దాన్ని.. ఆ భూహక్కుదారుకు అప్పగించాలి. అయోధ్యలోని వివాదాస్పద స్థలానికి సంబంధించిన భూహక్కుదారు బాబర్. ఇప్పుడు ఆయన లేరు. మరి.. ఆయన వారసులు ఇప్పుడు ఎవరంటే కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో 1992 డిసెంబరు ఆరు వరకూ ఉన్న మసీదు స్థలాన్ని కేంద్రానికి ఇచ్చేయటం తప్పు కాదు. ఇక.. మసీదుల్ని ఒక చోట నుంచి మరో చోటుకు మార్చటం కొత్తేం కాదు. దీన్ని మహమ్మద్ ప్రవక్తే అనుమతించారు.

ఆయన సంతకం చేసిన హుదయ్‌బియా ఒప్పందం దీనికి ఉదాహరణగా చెబుతారు. ఒక ప్రదేశంపై వివాదం, యుద్ధం తలెత్తినపుడు దానిని మార్చవచ్చని ఆయన గతంలోనే చెప్పారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద ప్రాంతంలోని కట్టడానికి బదులుగా వేరే చోట మసీదు కట్టాలన్న డిమాండ్ ఇందులో భాగమేనని చెప్పాలి. ఈ ఎపిసోడ్ ద్వారా సున్నీబోర్డు ఒక ముఖ్యమైన డిమాండ్ నుతన వైపు అట్టి పెట్టుకుందని చెప్పాలి. వివాదాస్పద స్థలంలో ఉన్న కట్టటం..దానికి సంబంధించిన వివాదం ఇప్పుడు ముగిసిన అధ్యాయం. దాన్నే పట్టుకొని ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

రాజీ చర్చల్లో భాగంగా తనకు అవసరమైన వాటిని పొందే సువర్ణఅవకాశాన్ని చేజార్చుకోకూడదు. ఇందులో భాగంగా ముసీదుల రక్షణ.. పునరుద్ధరణ చేపట్టేలా ప్రభుత్వం నుంచి హామీ పొందటం ద్వారా ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాదు.. గడిచిన ఇరవైఏళ్లలో ముస్లింల వైఖరిలో మార్పు వచ్చింది. మసీదు నేలమట్టం ఇష్యూ వారికి జీవన్మరణ సమస్య కాదు.. అంతకంటే పెండింగ్ లోని అంశాలు చాలానే ఉన్నాయి. అందుకే అయోధ్యలోని వివాదాస్పద భూమి విషయంలో పట్టువిడుపులతో వ్యవహరిస్తూ.. తమకు అవసరమైన అంశాల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయటం ద్వారా తన వారి ఆకాంక్షలకు తేడా రాకుండా ఉండేలా సున్నీబోర్డు జాగ్రత్త పడుతోంది.
Tags:    

Similar News