న‌ర‌మేధంపై అజంఖాన్ మాట‌ల మంట‌లు

Update: 2015-11-16 13:48 GMT
ప్యారిస్‌ లో చోటు చేసుకున్న ఉగ్ర‌ఘ‌ట‌న‌పై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీనియ‌ర్ మంత్రి అజంఖాన్ చేసిన విమ‌ర్శ‌లు ఇప్పుడు స‌రికొత్త వివాదానికి తెర తీసేలా ఉన్నాయి. ప్యారిస్ పేలుళ్ల‌పై ఆయ‌న త‌న‌దైన వాద‌న‌ల్ని తెర‌పైకి తీసుకొచ్చారు. సిరియా.. ఇరాక్ ల‌లో అమెరికా చ‌ర్య‌ల‌కు ప్ర‌తిచ‌ర్య‌గానే ప్యారిస్ పేలుళ్లు చోటు చేసుకున్నాయ‌ని ఆయ‌న విశ్లేషించారు.

ఓ ప‌క్క ప్యారిస్ పేలుళ్లు దుర‌దృష్ట‌క‌రం అంటూనే.. మ‌రోవైపు అగ్ర‌దేశాల వైఖ‌రిని తూర్పార‌ప‌ట్ట‌టం గ‌మ‌నార్హం. ఇరాక్‌.. సిరియా.. లిబియా.. ఇరాన్ లోని చ‌మురు బావుల‌ను అక్ర‌మంగా దోచుకొని.. ఆ డ‌బ్బుతో ప్యారిస్ వంటి న‌గ‌రాల‌ను మ‌ద్యం.. పార్టీల‌తో వైభవోపేతంగా మార్చుకోవాల‌ని అనుకుంటున్నారా? అని ప్ర‌శ్నించారు. ఇరాక్‌.. సిరియాలోని ఐసిస్ బ‌లం ఉన్న ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తూ అమాయ‌కుల ప్రాణాలు కోల్పోవ‌టం.. వేలాది మంది నిరాశ్ర‌యులు కావ‌టాన్ని ఎలా స‌మ‌ర్థించుకుంటారు? అని ఆజం ప్ర‌శ్నిస్తున్నారు.

మ‌ధ్య ప్రాచ్యంలో చ‌మురు సంప‌ద కోస‌మే అమెరికా.. ర‌ష్యాలు ప్ర‌స్తుత సంక్షోభాన్ని మ‌రింత‌గా రాజేస్తున్నాయంటూ మండిప‌డిన ఆజంఖాన్ వ్యాఖ్య‌లు ఇప్పుడు వివాదాస్ప‌ద మంట‌ల్ని రేపుతున్నాయి. నిజానికి ఆజంఖాన్ చేసిన వ్యాఖ్య‌ల్లో ప‌లు అంశాలు.. అగ్ర‌రాజ్యాల వైఖ‌రికి సంబంధించిన విమ‌ర్శ‌లుగా చెప్పొచ్చు. ప‌లువురు వామ‌ప‌క్ష భావ‌జాలంతో ఉన్న వారు ఇలాంటి వాద‌న‌ను వినిపిస్తుంటారు. అయితే.. ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్న వ్య‌క్తి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌టం ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది.
Tags:    

Similar News