టీడీపీలో జోష్ నింపుతున్న బాబు వ్యూహం

Update: 2021-12-31 10:30 GMT
టీడీపీ తన అమ్ములపొదిలో ఉన్న బ్రహ్మస్త్రాన్ని బయటికి తీసుకొచ్చే సమయం ఆసన్నమైందనే టాక్ విన్పిస్తోంది. టీడీపీ ఆవిర్భవించి దాదాపు నాలుగు దశాబ్దాలు అవుతోంది. సీనియర్ ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు వరకు టీడీపీ ఎన్నో ఆటుపోట్లను చూసింది. అధికారంలో ఉండటం ప్రతిపక్షంలోకి వెళ్లడం ఆ పార్టీకి కొత్తమే కాదు. అయినా గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులను టీడీపీ ప్రస్తుతం ఎదుర్కొంటోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోతే ఆపార్టీ మ‌రింత ఇబ్బందుల‌కు గుర‌వ‌డం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో చంద్రబాబు ముందుస్తుగా అలర్ట్ అవుతున్నారు.

దీనిలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు ఆపార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అన్నిరకాల వ్యూహాలు రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ సింగిల్ గా వెళ్లే సాహసం చేసే పరిస్థితి లేదు. దీంతో రాబోయే ఎన్నికల్లో తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమనే సంకేతాలను ఆయన పంపుతున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తమతో కలుపుకొని వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. 2019లో మాత్రం ఈ పార్టీలు వేర్వురుగా పోటీ చేశారు. ఇదే తమను దెబ్బకొట్టిందని చంద్రబాబు భావిస్తున్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాల ముందు చంద్రబాబు బలం సరిపోవడం లేదు. ఈనేపథ్యంలో లోకేష్ ను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే గత ఎన్నికల్లో లోకేష్ స్వయంగా ఓటమి పాలవడంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ప్రస్తుతం టీడీపీలో గ్లామర్ కలిగిన నేతలు కరువయ్యారు. చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ పార్టీలో ఉన్నా ఆయన ప్రభావం పార్టీపై కన్పించడం లేదు. ఆయన ఎప్పుడో ఏం మాట్లాడుతారే ఎవరికీ అర్ధం కాదనే ఆపార్టీ నేతలే చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే టీడీపీకీ గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని టాక్ విన్పిస్తోంది.

టీడీపీ ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఈ అంశాన్ని జూనియర్ కు చంద్రబాబు వివరించే అవకాశం లేకపోలేదు. తన తాత స్థాపించిన టీడీపీ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జూనియర్ కు హితబోధ చేయనున్నారు. ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఈవిషయంపై జూనియర్ ఎన్టీఆర్ తో ఫోన్లో సంభాషించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సైతం టీడీపీకి ప్రచారం చేసేందుకు సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం పలు సినిమాలతో ఫుల్ బీజీగా ఉన్నారు. ఒకవేళ ఆయన టీడీపీకి ప్రచారం చేస్తే బాగుంటుంద‌నే అభిప్రాయం ఉంది. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం చేసేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నార‌ని అంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ టీడీపీ తరుఫున ప్రచారం చేస్తే వైసీపీ కొంతమేర ఢిపెన్స్ లో పడే అవకాశం ఉందని టాక్. దీంతో టీడీపీ శ్రేణుల్లో మళ్లీ జోష్ నింపేలా చంద్రబాబు జూనియర్ ను పార్టీలోని ఆహ్వానిస్తారనే టాక్ విన్పిస్తోంది. అయితే చంద్రబాబు ఆఫర్ ను జూనియర్ అంగీకరిస్తారా? లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.


Tags:    

Similar News