తెలంగాణా బ్రాండ్ లేకపోతే కేసీయార్ కి బాండే...

Update: 2022-10-17 17:30 GMT
కేసీయార్ ఉద్యమ నేతగా అందరికీ తెలుసు. ఆ విధంగానే ఆయన అఖండ బలంతో రెండు దశాబ్దాలుగా తెలంగాణా రాజకీయాల్లో నెట్టుకు వచ్చారు. తెలంగాణా అన్నది ఒక పవర్ ఫుల్ వెపన్. అంతే కాదు అద్భుతమైన బ్రాండ్. దానితోనే కేసీయార్ ఇన్నాళ్ళూ తన రాజకీయాన్ని సజావుగా చేసుకున్నారు. రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు.

ఆ బ్రాండ్ ని కేసీయార్ వదిలేసి బీయారెస్ అంటూ కొత్త పేరుతో జనాల్లోకి వస్తే ఆయన్ని ఏకంగా తెలంగాణా ప్రజలే వదిలేస్తారు అని రాయలసీమకు చెందిన సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖరెడ్డి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఒక విధంగా చూస్తే కేసీయార్ కి బీయారెస్ ఆన్నది  అసలు అచ్చిరాదు అన్నట్లుగా ఆయన మాట్లాడారు, కేసీయార్ బీయారెస్ పేరిట జాతీయ పార్టీ కాదు, ఏకంగా ప్రపంచ పార్టీనే పెట్టుకోమనండి అని ఎద్దేవా చేశారు.

అయితే తెలంగాణా  బ్రాండ్ వదిలేస్తే మాత్రం నేల విడిచి సాము చేసినట్లే అని బైరెడ్డి హెచ్చరించారు. కేసీయార్ పార్టీ పేరులో తెలంగాణా అన్న బ్రాండ్ కనుక లేకపోతే తెలంగాణా ప్రజలు పూర్తిగా దూరమైపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేసీయార్ వి అన్నీఎపుడూ  వింత విచిత్ర ఆలోచనలు అని కూడా బైరెడ్డి సెటైర్లు వేశారు.

ఇదిలా ఉండగా రాయలసీమతో పాటు దక్షిణ తెలంగాణా జిల్లాలు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్న కరవు ప్రాంతాలు అని ఆయన అన్నారు. ఈ ప్రాంతాలు  ఎపుడూ  తాగు సాగు నీటి కోసం కటకటలాడుతూ ఉంటాయని అని పేర్కొన్నారు.  ఈ ప్రాంతాలకు కావాల్సింది ప్రాజెక్టులు, ఐకానికి బ్రిడ్జిలు కాదని, వీటికి తాగు నీరు సాగు నీరు అందించే రిజర్వాయర్లు అని ఆయన అన్నారు.

ఇక చూస్తే కేంద్ర మంత్రి గడ్కరీకి  ఎవరు తప్పుడు సలహా ఇచ్చారో తెలియదు కానీ కృష్ణా పెన్నూరు దగ్గర పిల్లర్ లెస్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తామని ఆయన తాజాగా  ట్వీట్ చేశారని బైరెడ్డి పేర్కొన్నారు. ఏకంగా 11 వందల కోట్ల రూపాయల వ్యయంతో  నిర్మాణం చేపట్టనున్న ఈ బ్రిడ్జి వల్ల రాయలసీమకు ఏ రకంగానూ మేలు జరిగేది లేదని ఆయన కొట్టి పారేశారు. అలాగే తెలంగాణాకు దీని వల్ల ఉపయోగం ఉండదని అన్నరు. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరచి నీటి వనరులు అందించే సదుపాయాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ విషయం ఎలా ఉన్నా కేసీయార్ మీద బైరెడ్డి పేల్చిన పంచులు సెటైర్లు మాత్రం చర్చనీయాంశం అవుతున్నాయి. కేసీయార్ నుంచి తెలంగాణా పక్కకు పోతే ఆయన రాజకీయం కూడా ఇబ్బందిలో పడుతుంది అని బైరెడ్డి చెప్పిన జోస్యంలో నిజమెంత ఉందో కాలమే నిర్ణయిస్తుంది మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News