ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలెంజ్‌కు బాలినేని స‌మాధానం ఇదే!

Update: 2022-08-08 07:35 GMT
ఆగ‌స్టు 7 జాతీయ చేనేత దినోత్స‌వం సంద‌ర్బంగా ప‌లు ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతీయ చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా చేనేత దుస్తులు ధ‌రించి సోష‌ల్ మీడియాలో పోస్టు చేయాల‌ని.. త‌ద్వారా నేత‌న్న‌ల‌కు అండ‌గా ఉన్నామ‌నే సంకేతాన్ని ఇవ్వాల‌ని ట్విట్ట‌ర్ లో కోరిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఈ చాలెంజ్ ను టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ స‌హా ముగ్గురికి విసిరారు.

ఈ స‌వాల్ ను స్వీక‌రించిన కేటీఆర్ తాను చేనేత దుస్తుల‌ను ధ‌రించి ఉన్న ఫొటోల‌ను ట్విట్ట‌రులో పోస్టు చేసి ఈ చాలెంజ్ ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్, మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండ్కూల‌ర్, ఆనంద్ మ‌హీంద్రా త‌దిత‌రుల‌కు విసిరారు. కేటీఆర్ స‌వాల్ ను స్వీక‌రించిన ప‌వ‌న్ తాను గ‌తంలో ప‌లు సంద‌ర్బాల్లో చేనేత దుస్తులు ధ‌రించిన చిత్రాల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. నేత‌న్న‌ల‌కు అంద‌రూ అండ‌గా ఉండాల‌ని కోరారు. త‌న‌కీ స‌వాల్ విసిరినందుకు కేటీఆర్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

కాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ స‌వాల్ ను మ‌రో ముగ్గురికి విసిరారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, వైఎస్సార్సీపీ ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల కోఆర్డినేట‌ర్ బాలినేని శ్రీనివాస‌రెడ్డి, బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు ల‌క్ష్మ‌ణ్ ల‌కు విసిరారు. ప‌వ‌న్ చాలెంజ్‌కు స్పందించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌ర‌రెడ్డి తాను చేనేత దుస్తులు ధ‌రించిన చిత్రాల‌ను ట్విట్ట‌రులో షేరు చేశారు. ఈ స‌వాల్ ను త‌న‌కు విసిరినందుకు ప‌వ‌న్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

అంతేకాకుండా గ‌తంలో వైఎస్సార్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు నేత‌న్న‌ల‌ను ఆదుకున్నామ‌ని త‌న ట్వీట్ లో బాలినేని పేర్కొన్నారు. వైఎస్సార్ కేబినెట్ లో తాను చేనేత మంత్రిగా చిత్త‌శుద్ధితో ప‌నిచేశాన‌ని గుర్తు చేశారు. అంతేకాకుండా వైఎస్సార్ 300 కోట్ల రూపాయ‌లను చేనేత రుణ‌మాఫీకి వెచ్చించార‌ని కొనియాడారు.

ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ హ‌యాంలో నేత‌న్న‌ల‌ను ఆదుకోవ‌డానికి నేత‌న్న నేస్తం ప‌థ‌కాన్ని ప్రారంభించామ‌ని గుర్తు చేశారు. అంతేకాకుండా నేత‌న్న‌ల‌కు ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను అందిస్తున్నామ‌ని బాలినేని త‌న ట్వీట్ లో తెలిపారు. అప్పుడు, ఇప్పుడు చేనేత‌ల కోసం నిజాయితీగా ప‌నిచేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. అంద‌రూ చేనేత వ‌స్త్రాలు ధ‌రించాల‌ని బాలినేని కోరారు.

ఇలా మొత్తానికి జాతీయ చేనేత దినోత్స‌వం రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వివిధ పార్టీల నాయ‌కుల మ‌ధ్య ఆహ్లాద‌క‌ర వాతావర‌ణానికి దారి తీసింది. ఒక మంచి కార‌ణం కోసం అన్ని పార్టీల వారు స్పందించ‌డాన్నినెటిజ‌న్లు సైతం మెచ్చుకుంటున్నారు.
Tags:    

Similar News