కోదండరాం.. ఇప్పుడు కోదండరాం రెడ్డా?

Update: 2017-02-22 07:22 GMT
తెలంగాణ ప్రభుత్వంపై కోదండరాం దండెత్తుతుండడంతో టీఆరెస్ నేతలకు ఆయన ప్రధాన శత్రువుగా మారిపోయారు. దీంతో అన్ని రకాలుగా ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు. కోదండరాం ను డిఫెన్సులోకి నెట్టడానికి .. ఆయన పోరాటంపై బురద చల్లడానికి చివరి అస్ర్తంగా టీఆరెస్ నేతలు కులం రగడ మొదలుపెడుతున్నారు.  మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎంపీలు ఇలా  టోటల్ కేసీఆర్ వర్గమంతా కోదండరాం పోరాటం వెనుక కులం కోణాలను ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.  అయితే.. తెలంగాణ రాష్ట్రం కోసం భుజంభుజం కలిపి తిరిగినప్పుడు కోదండరాం కులం ఎందుకు చర్చకు రాలేదన్న ప్రశ్నకు టీఆరెస్ నుంచి సమాధానం లేదు.
    
కోదండరామ్ కు కుల ముద్ర వేసి.. కుల రాజకీయాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు చేయడం అంతటా ఆసక్తికరంగా మారింది. దీనిపై టీఆరెస్ పైనా విమర్శలొస్తున్నాయి.  సాధారణ రాజకీయ నేతలను విమర్శించినట్లుగా కోదండరాంపైనా ఇలా కుల రాజకీయాల ముద్ర వేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే... ఇది ఇంతకుముందే మొదలైనా ఇప్పుడు పీక్ స్టేజికి చేరింది. గతంలో  పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్...  కోదండరాంను కోదండరాం రెడ్డి అంటూ సంబోధించి విమర్శలు గుప్పించడం అందరినీ ఆశ్చర్యానికి లోనుచేసింది.   కోదండరాంరెడ్డి ఓ విషపు నాగు అంటూ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అప్పట్లో కలకలం రేపాయి.
    
నిజానికి కోదండరాం.. రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే అయినప్పటికీ చాలాకాలం కిందటే ఆయన ఆ తోకను కత్తిరించుకున్నారు.  గతంలో దళితులపై జరిగిన ఊచకోతలకు నిరసనగా తన పేరు చివరన ఉన్న రెడ్డి అనే పదాన్ని తొలగించుకున్న కోదండరాంపై ఇంతకాలం ఎవరూ రెడ్డి తోక తగిలించి విమర్శలు చేయలేదు. ఆయన స్వయంగా తొలగించిన కుల నామాన్ని టీఆరెస్ నేతలు పనిగట్టుకుని మళ్లీ తగిలించడంపై విమర్శలొస్తున్నాయి. కోదండరాంను ఎదుర్కోవడానికి వేరే అంశమేదీ దొరక్కపోవడంతోనే టీఆరెస్ ఇంతలా దిగజారిందన్న విమర్శలు వస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News