బండి నోట 'ఆర్ఆర్ఆర్' మాట.. కేసీఆర్ కు భారీ సవాలు

Update: 2021-10-03 23:30 GMT
తొలి విడత పాదయాత్రను పూర్తి చేసుకున్న బండి సంజయ్ మాంచి ఊపు మీద ఉన్నారు. పార్టీ అంచనా వేసినంతగా పాదయాత్ర సక్సెస్ కాకున్నా.. ప్లాప్ షో మాత్రం కాకపోవటం ఊరటను ఇచ్చిందన్న మాట బీజేపీ వర్గాల నోట వినిపిస్తోంది. పాదయాత్రను పూర్తి చేసుకున్న ఆయన యధావిధిగా ఆదివారం ఉదయం చార్మినార్ లోని అమ్మవారి గుడిని సందర్శించి.. దర్శనం చేసుకున్నారు. తానే పని మొదలు పెట్టినా చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి వెళ్లటం ఒక అలవాటుగా మార్చుకున్నారు బండి.

అనంతరం ఆయన హుజూరాబాద్ కు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన బీజేపీ ఎన్నికల శంఖారావ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారీ సవాలు విసిరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతల్లో హుషారు పుట్టించేలా.. అధికారపక్షం డిఫెన్సులో పడేలా ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ఉద్యమకారుడైన ఈటల రాజేందర్ ను గెలిపించాలన్నారు.

ఈటలతో లబ్థి పొందిన టీఆర్ఎస్ నేతలు చివరకు ఆయన్ను వదిలించుకున్నారని.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేసిందేమీ లేదన్న ఆయన.. ''ఒకవేళ ఉప ఎన్నికల్లో ఈటల గెలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేస్తారా?'' అని సూటి సవాలును సంధించారు. ఈటలను గెలిపించాలన్న బండి.. ఈ సందర్భంగా మరో ఆసక్తికర ప్రస్తావన తీసుకొచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో ''ఆర్ఆర్ఆర్'' (రాజాసింగ్.. రఘనందన్ రావు.. రాజేందర్) ప్రజాగళాన్ని వినిపిస్తారన్న బండి మాట సభకు వచ్చిన వారిలో హుషారు పెంచేలా చేసింది. ఉప ఎన్నికల వేడి ఇప్పుడిప్పుడే రాజుకుంటున్న వేళ.. తెలంగాణ అసెంబ్లీలో 'ఆర్ఆర్ఆర్' నినాదం బీజేపీకి ఎంతమేర లాభం చేస్తుందో చూడాలి.
Tags:    

Similar News