భారీ దెబ్బః బీరు త‌యారీనే ఆపేశారుగా!

Update: 2021-06-07 02:30 GMT
కన్నీళ్లు బాధ‌తో ఉబికినా.. ఆనందంతో ఉప్పొంగినా.. పొంగాల్సింది మాత్రం బీరే! మ‌ధ్య వ‌య‌స్కుల విష‌యంలో లెక్క‌లు మారినా.. యూత్ విష‌యంలో మాత్రం బీర్ బాటిలే ఫైన‌ల్‌. అలాంటి బీరుకు స‌మ్మ‌ర్ లో ఎలాంటి డిమాండ్‌ ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ల‌క్ష‌ల కేసులు తాగేస్తుంటారు రాష్ట్రంలోని మందుబాబులు. అయితే.. ఈ ఏడాది మాత్రం లెక్క మారిపోయింది. బీర్ల అమ్మ‌కాలు త‌గ్గిపోవ‌డంతో.. ప‌లు కంపెనీలు మూసుకోవాల్సిన‌ వ‌చ్చిందంటే.. ప‌రిస్థితి తీవ్ర‌త ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు!

దీనంత‌టికీ కార‌ణం ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదుగా? ఆ మ‌హ‌మ్మారి వ‌ల్ల‌నే ఈ ప‌రిస్థితి వ‌చ్చింది. అదేంటీ.. మద్యం అమ్మ‌కాలు భారీగానే సాగుతున్నాయిగా అనొచ్చు. అది మిగ‌తా మందు విష‌యంలోనే. బీరు విష‌యంలో మాత్రం బిజినెస్ పూర్తిగా డ‌ల్ అయిపోయింది.

క‌రోనా చ‌లిలో ఎక్కువ కాలం బ‌తికి ఉంటుంద‌ని భావించ‌డం. జ‌లుబు ద‌గ్గు ఏమైనా వ‌స్తే.. క‌రోనా అనుకొని భ‌య‌ప‌డాల్సి రావ‌డం.. బీర్ కార‌ణంగా ముక్కుకార‌డానికి అవకాశం ఉంద‌ని ఫీల‌వ‌డం.. వంటి కార‌ణాల‌తోపాటు క‌రోనా వేళ స్వేచ్ఛ‌గా బ‌య‌ట‌కు వెళ్ల‌లేక‌పోవ‌డం వంటివ‌న్నీ క‌లిసి బీర్ల అమ్మ‌కాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపించాయి.

ఇదేదో మాట వ‌ర‌స‌కు చెప్ప‌డం కాదు.. లెక్క‌లు చెబుతున్నాయి. తెలంగాణ‌లో గ‌తేడాది మేలో 23.33 ల‌క్ష‌ల కేసుల బీర్ అమ్ముడు కాగా.. ఈ ఏడాది మే నెల‌లో 20 ల‌క్ష‌ల కేసులు మాత్ర‌మే అమ్ముడు పోయాయి. కేవ‌లం రాష్ట్రంలోనే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి ఉన్న‌ట్టు స‌మాచారం. దీంతో.. హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లోని బీర్ కంపెనీలు ఉత్ప‌త్తిని త‌గ్గించేసుకుంటున్నాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 6 బీరు కంపెనీలు ఉండ‌గా.. ఇప్పుడు నాలుగు మాత్ర‌మే ఉత్ప‌త్తి కొన‌సాగిస్తున్నాయి. అది కూడా ప్రొడ‌క్ట్ త‌గ్గించేశాయి. మిగిలిన రెండు మాత్రం మూత‌వేసేయ‌డం గ‌మ‌నార్హం.

క‌రోనా లేన‌ప్పుడు నెల‌కు 20 ల‌క్ష‌ల కేసులు ఉత్ప‌త్తి చేసిన కంపెనీలు ఇప్పుడు.. నాలుగైదు ల‌క్ష‌లు మాత్ర‌మే ఉత్ప‌త్తి చేస్తుండ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. చాలా కంపెనీలు మే నెల ముగిసిన త‌ర్వాత ఉత్ప‌త్తి ఆపేసి.. ఉన్న ప్రొడ‌క్ట్ ను సేల్ చేసుకునే ప‌నిలో ప‌డ్డాయ‌ట‌. మొత్తానికి.. ఇటు మందుబాబుల గొంతు ఎండ‌బెట్టిన క‌రోనా.. అటు కంపెనీల‌కూ దెబ్బేసింది. కంపెనీలు ఉత్ప‌త్తి ఆపేయ‌డంతో.. చాలా మంది ఉపాధి కోల్పోయిన‌ట్టు స‌మాచారం.


Tags:    

Similar News