అఖిల‌కు!... మూడు కావాల‌ట‌!

Update: 2019-01-14 11:28 GMT
ఎన్నిక‌ల‌కు గ‌డువు స‌మీపిస్తున్న కొద్దీ ఏపీ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. మిగ‌తా జిల్లాల ప‌రిస్థితి ఎలా ఉన్నా రాయ‌ల‌సీమ‌... అందులోనూ ప్ర‌త్యేకించి క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాలు మ‌రింత ఆసక్తిక‌రంగా మారిపోయాయి. ఈ జిల్లాలోని ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యేగా ఉన్న భూమా అఖిల‌ప్రియ‌.. త‌ల్లి మ‌ర‌ణంతో ఎమ్మెల్యే గిరీ - తండ్రి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఏకంగా మంత్రి గిరీ ఆమె ప్ర‌మేయం లేకుండానే ఆమెకు ద‌క్కేశాయి. అయితే చేతికి చిక్కిన అధికార దండాన్ని వీల‌యినంత కాలం వదిలిపెట్ట‌రాద‌న్న భావ‌న‌తో చాలా తెలివిగా పావులు క‌దుపుతున్న అఖిల‌... వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న ఫ్యామిలీకి మ‌రింత ప్రాధాన్యం ద‌క్కాల్సిందేన‌ని భీష్మించుకున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మొన్న‌టికి మొన్న త‌న అనుచ‌రుల ఇళ్ల‌ల్లో పోలీసుల సోదాల పేరు చెప్పి అల‌క‌పాన్పు ఎక్కిన అఖిల‌... ఇప్ప‌టిదాకా శాంతించిన దాఖ‌లానే క‌నిపించ‌డం లేదు. అఖిల అల‌క‌పాన్పు, టీడీపీ అధిష్ఠానం మ‌ధ్య‌లో ఈ వివాదానికి ముందే చాలా పెద్ద త‌తంగ‌మే న‌డుస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

ప్ర‌స్తుతం ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యేగా అఖిల ఉండ‌గా, ఆమె సోద‌రుడు (క‌జిన్‌) భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న త‌మ‌కు వ‌చ్చే ఎన్నికల్లోనూ ఈ రెండు స్థానాల‌ను కేటాయించాల్సిందేన‌ని అఖిల చాలా కాలం నుంచి కూడా వాదిస్తూ వ‌స్తున్నారు. ఈ వాద‌న‌లో పెద్ద‌గా త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం కూడా ఏమీ లేద‌నే చెప్పాలి. అయితే రాజ‌కీయాల్లో ఇటు అఖిల‌తో పాటు అటు బ్ర‌హ్మానంద‌రెడ్డి కూడా చాలా జూనియ‌ర్లు. కుటుంబ పెద్ద‌ల అకాల మ‌ర‌ణంతో వీరు త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో రాజ‌కీయాల్లోకి రావాల్సి వచ్చింద‌. త‌ల్లిదండ్రులు బ‌తికున్నంత కాలం త‌మ ఫ్యామిలీని అంటిపెట్టుకుని ఉన్న అనుచ‌ర గ‌ణానికి బాస‌ట‌గా నిల‌వాల్సిన అవ‌స‌రం కూడా అఖిలపై ఉంద‌నే వాద‌న‌నూ త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌నే చెప్పాలి. అయితే ఈ మేర ద‌క్కిన ప్రాదాన్యం అఖిల డిమాండ్ల జాబితాను కూడా పెంచుకుంటూ పోతోంద‌ని చెప్పాలి. వ‌చ్చే ఎన్నికల్లో త‌న‌తో పాటు త‌న సోద‌రుడు బ్ర‌హ్మానంద‌రెడ్డికి ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల అసెంబ్లీ సీట్ల‌ను కేటాయించ‌డంతో పాటు నంద్యాల ఎంపీ సీటు కూడా త‌న కుటుంబానికే ఇవ్వాల‌ని ఆమె కొత్త‌గా ఓ ప్ర‌తిపాద‌న పెట్టార‌ట‌.

మరి నంద్యాల ఎంపీ సీటుకు పోటీ చేసే వ్య‌క్తి భూమా ఫ్యామిలీలో ఎవ‌రున్నార‌న్న విష‌యానికి వ‌స్తే.. ఇంకెవ‌రు ఇటీవ‌ల అఖిల‌ను పెళ్లి చేసుకున్న ఓ కుర్ర పారిశ్రామిక‌వేత్తేన‌ట‌. ఆళ్లగ‌డ్డ సీటు త‌న‌కు, నంద్యాల అసెంబ్లీ సీటు త‌న సోద‌రుడికి ఇవ్వ‌డంతో పాటు త‌న భ‌ర్త‌కు నంద్యాల ఎంపీ టికెట్ కూడా ఇవ్వాల్సిందేన‌ని అఖిల పార్టీ అదిష్ఠానం ముందు ప్ర‌తిపాద‌న పెట్టార‌ట‌. అయితే ఇందుకు స‌సేమిరా అన్న చంద్ర‌బాబు... వ‌చ్చే ఎన్నిక‌ల్లో అఖిల‌కు మాత్రం ఆళ్ల‌గ‌డ్డ సీటును ఇస్తూ... ఆమె జాబితాలోని మిగిలిన రెండు స్థానాల‌ను ఇత‌రుల‌కు కేటాయించ‌నున్న‌ట్లుగా ఫుల్ క్లారిటీ ఇచ్చార‌ట‌. దీంతో పార్టీ అధిష్ఠానంపై అఖిల కాస్తంత గుర్రుగానే ఉన్న‌ట్లుగా స‌మాచారం. అయితే పార్టీని వీడే ప్ర‌సక్తే లేద‌ని చెప్పిన అఖిల‌... మ‌రి డిమాండ్ల మేర‌కు మూడు సీట్లు ద‌క్క‌క‌పోతే... ఏ మేర‌కు స‌ర్దుకుపోతారో చూడాలి.
  


Tags:    

Similar News