బాబుకే కండీష‌న్ పెట్టేస్తున్న భూమా అఖిల‌?

Update: 2018-05-10 06:21 GMT
అధినేత అనేటోడు సౌమ్యంగా ఉండ‌టం ఎంత ముఖ్య‌మో లెక్క తేడా వ‌చ్చిన‌ప్పుడు అంత‌కు మించిన క‌ర‌కుద‌నాన్ని ప్ర‌ద‌ర్శించ‌టం చాలా అవ‌స‌రం. కీల‌క స‌మ‌యాల్లో నిర్ణయాలు తీసుకునే విష‌యంలో దాట‌వేత ధోర‌ణి క్ర‌మ‌శిక్ష‌ణ మిస్ అయ్యేలా చేయ‌ట‌మే కాదు.. కొత్త త‌ల‌నొప్పుల్ని తెచ్చి పెడుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇప్పుడు ఇలాంటి ఇబ్బందినే తాజాగా ఎదుర‌ర్కొంటున్నారు.

పార్టీ నేత‌ల మ‌ధ్య  ఉండే విభేదాలు.. పంచాయితీల్ని ప‌రిష్క‌రించే విష‌యంలో బాబు చేసే త‌ప్పులు అన్నిఇన్ని కావ‌ని చెబుతారు. తప్పు చేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌టానికి జంకే ధోర‌ణి విప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు అర్థం చేసుకోవ‌చ్చ‌ని.. అధికార‌ప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు ఇదే తీరును ప్ర‌ద‌ర్శించ‌టం ఏ మాత్రం మంచిది కాద‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది.

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో బాబు చేప‌ట్టిన కార్య‌క్ర‌మం పుణ్య‌మా అని.. అన్ని జిల్లాల్లోనూ పార్టీలో లుక‌లుక‌లు.. అసంతృప్తులు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్నాయి. ఇందుకు నిద‌ర్శ‌నంగా క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్ని చెప్పాలి. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ నేప‌థ్యంలో దివంగ‌త భూమా నాగిరెడ్డిని పార్టీలో వ‌చ్చేలా చేసిన బాబు కార‌ణంగా.. క‌ర్నూలు జిల్లాలో కొత్త ఇబ్బంది ఎదురైంది. అన్నింటికి మించి నాగిరెడ్డికి.. ఏవీ సుబ్బారెడ్డికి మ‌ధ్య‌నున్న స్నేహం నాగిరెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత  రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా మారింది.

ఒక‌ప్పుడు నాగిరెడ్డికి సన్నిహిత స్నేహితుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి.. ఇటీవ‌ల కాలంలో భూమా అఖిల‌తో ఏ మాత్రం పొస‌గ‌ని ప‌రిస్థితి. వీరిద్ద‌రి మ‌ధ్య వైరం నంద్యాల డివిజ‌న్ ప‌రిధిలో పార్టీలో విప‌రీత ప‌రిణామాల‌కు కార‌ణంగా మారుతోంది. త‌న తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత త‌మ‌ను రాజ‌కీయంగా అణ‌గ‌దొక్కేందుకు ఏవీ సుబ్బారెడ్డి ప్లాన్ చేస్తున్న‌ట్లు అఖిల‌ప్రియ ఆరోప‌ణ‌లు చేస్తుంటే.. భూమా ఫ్యామిలీకి తాను విధేయుడిగా ఉన్నా అఖిల ప్రియ త‌న‌ను దెబ్బ కొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య‌న ఏవీ సుబ్బారెడ్డి సైకిల్ యాత్ర సంద‌ర్భంగా రాళ్ల దాడి జ‌ర‌గ‌టం.. దీనికి భూమా వ‌ర్గ‌మే కార‌ణ‌మంటూ ఏవీ ఆరోపించటం తెలిసిందే. ఈ ఘ‌ట‌న అనంత‌రం ఇరు వ‌ర్గాల వారిని పిలిపించిన బాబు.. ఇద్ద‌రికి క్లాస్ పీకిన‌ట్లుగా చెబుతారు.ఇదిలా ఉంటే.. తాజాగా ఏవీ సుబ్బారెడ్డికి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌లో బాబు ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఒక‌వేళ‌.. ఏవీకి కానీ నామినేటెడ్ పోస్ట్ ఇస్తే తాను కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకోవాల్సి ఉంటుంద‌న్న విష‌యాన్ని భూమా అఖిల‌ప్రియ బాబుకు సంకేతాలు పంపిన‌ట్లుగా చెబుతున్నారు.ఈ ప‌రిణామం పార్టీకి చెందిన ప‌లువురు సీనియ‌ర్లు విస్మ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

అధినేతకే ఆర్డ‌ర్లు వేసే స్థాయికి అఖిల‌ప్రియ వెళ్లిందా? అంటూ కొంద‌రు తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తుంటే.. మ‌రికొంద‌రు అఖిల‌ప్రియ‌కు బాబు ప్ర‌యారిటీ ఇస్తున్న కొద్దీ ఆమె తీరు స‌రిగా లేద‌న్న అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.  ఎవ‌రికి ప‌ద‌వులు ఇవ్వాలి?  ఎవ‌రు ఇవ్వ‌కూడ‌ద‌న్న విష‌యంపై అఖిల‌ప్రియ బాబుకు సందేశాలు పంప‌టం ఏమిటంటూ ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

ఒక‌వేళ తాను కోరిన దానికి భిన్నంగా బాబు వ్య‌వ‌హ‌రించిన ప‌క్షంలో.. కీల‌క నిర్ణ‌యం తీసుకోవాల‌న్న మాట‌ను త‌న కేడ‌ర్ కు స‌మాచారాన్ని అందించ‌టంతో పాటు.. అందుకు త‌గిన‌ట్లుగా పావులు క‌దుపుతున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. భూమా మ‌ర‌ణం నేప‌థ్యంలో వారి కుటుంబానికి అండ‌గా ఉంటాన‌న్న బాబు.. అఖిల‌కు మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టార‌ని.. కానీ ఆమె ప‌ని తీరు ఏ మాత్రం సంతృప్తిక‌రంగా లేద‌న్న మాట‌ను టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ఇక‌.. అధినేత‌పై విప‌క్ష నేత‌లు విరుచుకుప‌డుతుంటే..వాటిపై ఘాటు స్పంద‌న‌లు కూడా ఉండ‌టం లేదంటున్నారు. ఇటీవ‌ల కాలంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డినా.. దానికి కౌంట‌ర్ గా మంత్రి అఖిల ప్రియ స్పందించ‌లేదంటున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచ‌ల‌నానికి తెర తీసిన దాచేప‌ల్లి ఇష్యూలోనూ బాబు స‌ర్కారుపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు మండిప‌డితే.. వారికి కౌంట‌ర్ ఇచ్చేందుకు మ‌హిళా మంత్రిగా అఖిల‌ప్రియ స్పందించాల్సి ఉన్నా.. ఆ విష‌యం త‌న‌కేమీ ప‌ట్ట‌లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించార‌ని మండిప‌డుతున్నారు. మ‌రి.. అఖిల‌పై బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారా?. లేక‌.. అఖిలే నిర్ణ‌యం తీసుకుంటారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారిందని చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News