బీజేపీ బ్లెస్సింగ్స్...శశికళ పొలిటికల్ బెల్స్...?

Update: 2022-03-18 10:33 GMT
తమిళనాట రాజకీయాలు మారుతున్నాయి. అధికార డీఎంకే ఈ రోజుకు పటిష్టంగా  ఉంది. ముఖ్యమంత్రి స్టాలిన్ తనకు దక్కిన అవకాశాన్ని బాగానే వాడుకుంటున్నారు. అయితే ప్రతిపక్ష అన్నాడీఎంకే మాత్రం ఎటూ కాకుండా అయిపోయింది. జయలలిత 2016లో తెచ్చిపెట్టిన అధికారాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుని అయిదేళ్ల పాలన పూర్తి చేయడమే అన్నా డీఎంకే నేతలు చేసిన గొప్ప పని.

ముఖ్యమంత్రిగా మంచి మార్కులు తెచ్చుకున్న పళనిస్వామికి జనంలో ఓట్లు తెచ్చే ఇమేజ్ లేకపోవడం పెద్ద లోటు.  ఇక మరో మాజీ సీఎం పన్నీరు సెల్వం పార్టీని జాగ్రత్తగా చూసుకుంటున్నా ప్రజలలో పట్టుని సాధించలేకపోతున్నారు. ఈ ఇద్దరు నాయకులూ ఇపుడు విపక్ష నేతలుగా ఉన్నారు. దాంతో పార్టీలో బాధ్యతలను పంచుకుని అన్నా డీఎంకే రధాన్ని మెల్లగా నడిపిస్తున్నారు.

ఇక గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన  చేదు ఫలితాలు ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లోనూ కొనసాగాయి. చిత్రమేంటి అంటే చెన్నై లాంటి చోట్ల అన్నాడీఎంకే కంటే బీజేపీయే ఓట్లను ఎక్కువగా తెచ్చుకుంది. దాంతో అన్నాడీఎంకే పని అయిపోయింది అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది.

ఈ దశలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి ఒకనాడు అన్నాడీఎంకేలో చక్రం తిప్పిన శశికళ ఇపుడు  మళ్లీ నేనున్నాను అంటున్నారు. ఆమె రీసెంట్ గా తమిళనాడు దక్షిణ జిల్లాలో టూర్ చేసినపుడు మంచి స్పందన వచ్చింది. అంతే కాదు, పన్నీరు సెల్వం సోదరుడు రాజా వెల్ కమ్ శశికళ అంటూ అన్నాడీఎంకేలోకి ఆహ్వానం పలకడం చర్చనీయాంశం అయింది.

ఇక శశికళకు మళ్లీ రెండాకుల పార్టీలో రెడ్ కార్పెట్ పరచే దిశగా తెర వెనక తతంగం సాగుతోంది అంటున్నారు. జయలలిత నెచ్చెలిగా శశికళకు జనంలో ఎంతో కొంత ఇమేజ్ ఉంది. అలాగే ఆమెకు ఫేస్ వాల్యూ ఉంది. పైగా వ్యూహరచనలో కూడా దిట్ట. ఒక బలమైన సామాజికవర్గానికి చెందిన శశికళ కనుక అన్నాడీఎంకే పగ్గాలు అందుకుంటే మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అన్న ఆశలు అయితే ఆ పార్టీలో మెజారిటీ నాయకులకు ఉంది.

ఇక కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా శశికలను అన్నాడీఎంకేలో ఉంచేలా చూస్తున్నారు. ఆమె చేతికి పగ్గాలు అందించడం ద్వారా 2024 ఎన్నికల నాటికి తమిళనాట రెండాకుల పార్టీ బలంగా తయారు కావాలన్నది కాషాయం అజెండా. అలా అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఎక్కువ సీట్లను తెచ్చ్చుకుంటే ఢిల్లీలో తమ అధికారం మూడవసారి కూడా నిలుస్తుంది అని కమలనాధుల మాస్టర్ ప్లాన్.

దాంతో అన్నాడీఎంకేలో శశికళ పొడ గిట్టని నాయకులకు బీజేపీ నచ్చచెబుతోంది అంటున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ఆయన వర్గం మాత్రం శశికళ రాకను గట్టిగానే  వ్యతిరేకిస్తున్నాట్లుగా చెబుతున్నారు. వారంతా చిన్నమ్మ వద్దే వద్దు అంటున్నారుట. కానీ బీజేపీ పెద్దల రాయబేరాలతో వారు కూడా మెత్తబడతారు అంటున్నారు.

ఇక ఈ నెల 20న తన భర్త వర్ధంతి వేళ శశికళ తన రాజకీయ రీ ఎంట్రీ మీద కీలక‌ ప్రకటన చేస్తారని ప్రచారం సాగుతోంది. ఆమె ఏం చెబుతారు అన్నదే అందరిలో ఉన్న టెన్షన్. మరో వైపు అధికార డీఎంకే కూడా ఈ పరిణామాలను ఆసక్తిగా పరిశీలిస్తోంది. మొత్తానికి శశికళ కనుక అన్నాడీఎంకేలోకి వస్తే రెండాకుల పార్టీ కొత్త చిగుళ్ళు వేయడం ఖాయమే అని అంటున్నారు. చూడాలి మరి ఈ పరిణామాలు ఏ మలుపు తీసుకుంటాయో.
Tags:    

Similar News