ఓట్లు చీల్చే.. ప్ర‌య‌త్నం.. బీజేపీ విఫ‌ల‌మైందా?

Update: 2021-04-01 03:54 GMT
తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక నేప‌థ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ-జ‌న‌సేన కూట‌మి విజ‌యం సాధించ‌డం త‌థ్య‌మ‌ని.. అదే జ‌రిగితే.. సీఎం అయ్యేది ప‌వ‌న్ క‌ళ్యాణేన‌ని ప్ర‌క‌టించారు. నిజానికి కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌వ‌న్‌.. రాష్ట్ర ముఖ్య‌మంత్రి అవుతారంటే.. ఆ వ‌ర్గంలో సంపూర్ణంగా క‌ద‌లిక వ‌స్తుంద‌ని సోము భావించారు. తిరుప‌తిలో కాపు సామాజిక వ‌ర్గం ఓట్లు 10-12 శాతం ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీనిని బ‌ట్టి కాపు ఓట్ల‌కు సోము గేలం వేశార‌నే వాద‌న ఉంది.

అయితే.. సోము చేసిన ప్ర‌క‌ట‌న త‌ర్వాత.. నిజంగానే ఈ వ‌ర్గంలో క‌ద‌లిక వ‌చ్చిందా? అనేది ప్ర‌ధానంగా చ‌ర్చ కు వ‌స్తోంది. కానీ.. కాపు సామాజిక వ‌ర్గంలో సోము ప్ర‌క‌ట‌న ఎక్క‌డా దూకుడు పెంచ‌లేదు స‌రిక‌దా.. ఆ వ‌ర్గం అస‌లు సోమును ప‌ట్టించుకోవ‌డం లేదు. ``మా నాయ‌కుడు, మా సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు సీఎం అవుతున్నారు`` అనే సంతోషం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.  పైగా ఇత‌ర పార్టీలు మాత్రం సోముపై విరుచుకుప‌డ్డాయి.  ఈ నేప‌థ్యంలో సోము చేసిన వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్యం లేకుండా పోయింది.

అంటే.. దీనిని బ‌ట్టి.. త‌మ సొంత బ‌లం.. త‌మ సొంత వ్యూహంపై క‌న్నా.. బీజేపీ ఓట్లు చీల్చే కార్య‌క్ర‌మానికి తెర‌దీసింద‌నే వాద‌న వినిపిస్తోంది.ఇక‌, ఈ విష‌యంలో జ‌న‌సేన ప‌రిస్తితిని ప‌రిశీలిస్తే... ఆది నుంచి కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌న‌ను ఒక సామాజిక వ‌ర్గానికి ప‌రిమితం చేసుకోలేదు. గ‌త 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో  ఎక్క‌డా కూడా త‌న‌ను తాను కాపుల‌కు నేత‌గా కూడా ప‌వ‌న్ ప్ర‌క‌టించుకోలేదు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు సోము.. ప‌వ‌న్‌ను ఒక సామాజిక వ‌ర్గానికి ‌క‌ట్టేసి.. ఆ సామాజిక వ‌ర్గం ఓట్ల‌ను త‌మకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం విక‌టించేదే త‌ప్ప‌. స‌క్సెస్ అయ్యే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇంత‌క‌న్నా సోముకు మంచి ఐడియాలు వ‌స్తాయో.. రావో.. చూడాలి.
Tags:    

Similar News