ల‌క్ష్మ‌ణ్ తొంద‌ర‌పాటుపై బీజేపీ పెద్ద‌ల‌ క‌న్నెర్ర‌!

Update: 2018-12-10 08:32 GMT
తెలంగాణ‌లో ప్ర‌భుత్వ ఏర్పాటులో టీఆర్ ఎస్‌ కు మద్ద‌తిస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు డాక్ట‌ర్ కె.ల‌క్ష్మ‌ణ్ చేసిన వ్యాఖ్య‌లు ఆ పార్టీ కేంద్ర పెద్ద‌ల‌కు ఏమాత్రం రుచించ‌డం లేదు. ఇంత తొంద‌ర‌పాటు ఎందుకంటూ ల‌క్ష్మ‌ణ్ పై వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఫ‌లితాలు వెలువ‌డే వ‌ర‌కైనా ఆగ‌లేరా అంటూ పెద‌వి విరుస్తున్నారు.

తెలంగాణ‌లో ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇంకా వెలువ‌డ‌లేదు. ఎవ‌రు గెలుస్తారో తేల‌నేలేదు. టీఆర్ ఎస్ సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు! కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర‌జా కూట‌మే మ్యాజిక్ ఫిగ‌ర్ ను అందుకోవ‌చ్చు!! కింగ్ మేక‌ర్ గా మారేందుకు అవ‌స‌ర‌మైన సీట్ల‌ను బీజేపీ ద‌క్కించుకోవ‌చ్చు!!! ఏదైనా జ‌ర‌గొచ్చు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో ల‌క్ష్మ‌ణ్ తొంద‌ర‌పడాల్సిన అవ‌స‌ర‌మేమొచ్చింద‌న్న‌ది బీజేపీ కేంద్ర పెద్ద‌ల ఆగ్ర‌హం. ప్ర‌భుత్వ ఏర్పాటుకు స‌హ‌క‌రిస్తామంటూ టీఆర్ ఎస్‌ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం ద్వారా ఆయ‌న త‌ప్పు చేశార‌ని హైక‌మాండ్ భావిస్తోంది. ల‌క్ష్మ‌ణ్ మాట‌ల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని త‌మ పార్టీ మ‌హిళా నేత ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి వంత‌పాడటంపైనా బీజేపీ పెద్ద‌లు ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ల‌క్ష్మ‌ణ్ వ్యాఖ్య‌ల‌కు రాష్ట్ర బీజేపీలోని అంత‌ర్గ‌త ప‌రిస్థితులే కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. టీఆర్ ఎస్ తో చేతులు క‌లిపి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారం అనుభ‌వించాల‌ని బీజేపీలోని ఓ వ‌ర్గం భావిస్తోందట‌. ఆ వ‌ర్గానికి ల‌క్ష్మ‌ణే నేతృత్వం వ‌హిస్తున్నార‌ట‌. ల‌క్ష్మ‌ణ్ వైఖ‌రిని చూసి ఈ విష‌యాన్ని అర్థం చేసుకోవ‌చ్చున‌ని కూడా విశ్లేష‌కులు సూచిస్తున్నారు. ఆయ‌న ఎప్పుడూ టీఆర్ ఎస్ నేత‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌లేదని.. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ - ఆయ‌న త‌నయుడు కేటీఆర్ ల‌తో నిరంత‌రం స‌న్నిహితంగా ఉంటార‌ని గుర్తుచేస్తున్నారు. అందుకే టీఆర్ ఎస్ తో జ‌త క‌ట్టాల‌న్న త‌న మ‌న‌సులోని భావ‌న‌ను ఆయ‌న వెలిబుచ్చార‌ని సూచిస్తున్నారు. మ‌రోవైపు - బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముర‌ళీధ‌ర్ రావు మాత్రం ల‌క్ష్మ‌ణ్ వ్యాఖ్య‌ల‌కు భిన్నంగా స్పందించారు. ఫ‌లితాలు వ‌చ్చేంత‌వ‌ర‌కు ఎదురుచూద్దామ‌ని - ఇప్పుడే తొంద‌ర‌ప‌డొద్ద‌ని సూచించారు.


Tags:    

Similar News