తెలంగాణ‌లో క‌మ‌లం కింగ్ మేక‌ర్ వ్యూహం!

Update: 2018-10-09 04:58 GMT
వంద సీట్లు.. వందంటే వంద కాదు.. మ‌రో ప‌ది క‌లుపుకొని నూట ప‌ది సీట్ల‌లో గెల‌వ‌నున్నామంటూ తెలంగాణ రాష్ట్ర ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అదే ప‌నిగా వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే. నూట ప‌ది త‌ర్వాత‌.. మొద‌ట చెప్పిన‌ట్లు వంద  సీట్లు గెలిసే సీన్ ఉందా? అన్న ప్ర‌శ్న మాత్ర‌మే కాదు.. ఇప్పుడైతే.. మెజార్టీ సీట్ల‌లో కారు దూసుకెళుతుందా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

కేసీఆర్ ప్లాన్ చేసుకున్నంత సింఫుల్ గా వంద స్థానాల్లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని అనుకోవ‌టం ఉత్త భ్ర‌మేన‌ని చెబుతున్నారు. కేసీఆర్ చెప్పినంత సింఫుల్ గా వంద స్థానాల్లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థులు విజ‌యం సాధించే అవ‌కాశం లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఇందుకు త‌గ్గ‌ట్లే ఈ ఎన్నిక‌ల ద్వారా తాము కీల‌క భూమిక పోషించాల‌ని బీజేపీ వ్యూహం ర‌చించింది.

తెలంగాణ‌లో అధికారం మీద క‌మ‌ల‌నాథుల‌కు పెద్ద ఆశ‌లు లేకున్నా.. కింగ్ మేక‌ర్ కావాల‌న్న ఆలోచ‌న‌లో ఆ పార్టీ ఉంది. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో కేసీఆర్ చెప్పినట్లుగా ఏక‌ప‌క్షంగా ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం లేద‌ని ఐబీ వ‌ర్గాలు కేంద్రానికి ఇచ్చే నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్న‌ట్లు స‌మాచారం.

తెలంగాణ‌లో రాజ‌కీయ బ‌లాబ‌లాలు ఎలా ఉన్నాయ‌న్న అంశంపై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం తెప్పించుకుంటున్న కేంద్రం.. తెలంగాణ‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 30 సీట్ల‌పై గురి పెట్టాల‌ని భావిస్తోంది. ఇందులో క‌చ్ఛితంగా 15 సీట్లు గెలిస్తే చాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో 5 సీట్ల‌లో గెలిసే అవ‌కాశం ఉన్న బీజేపీ.. మ‌రో ప‌ది సీట్ల‌ను అద‌నంగా గెలుచుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉంది.

అదే జ‌రిగితే.. తెలంగాణ‌లో బీజేపీది కింగ్ మేక‌ర్ పాత్ర అవుతుంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుత ఎన్నిక‌లు పోటాపోటీగా జ‌రిగే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో.. 119 స్థానాలున్న తెలంగాణ‌లో 15 సీట్లు గెలుచుకున్న పార్టీ కీల‌కం కానున్న‌ట్లు చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి.. తాము గెలిచే అవ‌కాశం ఉన్న ఐదు సీట్ల‌కు అద‌నంగా మ‌రో ప‌ది సీట్ల‌ను ఎలా సొంతం చేసుకుంటార‌న్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాన్ని క‌మ‌ల‌నాథులు చెబుతున్నారు.

తెలంగాణ‌లో బీజేపీ త‌ర‌ఫు ప్ర‌చారం చేయ‌టానికి వీలుగా.. భారీ స‌న్నాహాల్ని చేస్తోంది. టీఆర్ ఎస్ కు ఒక్క ముఖ్య‌మంత్రే ఉంటే.. బీజేపీ ఏకంగా 15 మంది ముఖ్య‌మంత్రుల్ని ప్ర‌చార రంగంలోకి దించాల‌ని భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇటీవ‌ల కొత్తూరులో జ‌రిగిన బీజేపీ అంత‌ర్గ‌త స‌మావేశంలో ఆ పార్టీ అధినేత అమిత్ షా మాట్లాడుతూ.. టీఆర్ ఎస్ తో పొత్తు ఉండ‌ద‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌టం తెలిసిందే.

అంతేకాదు.. బీజేపీ-టీఆర్ ఎస్ మిత్ర‌త్వంపై ఉన్న గంద‌ర‌గోళంపైనా ఘాటుగా రియాక్ట్ అవుతూ.. శివ‌సేన‌తో బీజేపీకి ఉన్న బంధం కంటే టీఆర్ ఎస్ తో బంధం? అని సూటిగా ప్ర‌శ్నించ‌ట‌మే కాదు.. మ‌హారాష్ట్రలోనే పొత్తు తుంచేసి ప‌వ‌ర్లోకి వ‌చ్చిన‌ప్పుడు.. తెలంగాణ‌లో ఎందుకు పొత్తు పెట్టుకుంటాం? అని ప్ర‌శ్నించ‌ట‌మే కాదు.. టీఆర్ ఎస్ కు ఉండే వ్యూహాలు టీఆర్ ఎస్ కు ఉంటే.. బీజేపీకి ఉండే ఆలోచ‌న‌లు ఉంటాయ‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.

తెలంగాణ‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి ప‌దిహేను మంది సీఎంలు.. వంద మంది వ‌ర‌కూ ఎంపీలు.. ఎమ్మెల్యే ల‌ను ప్ర‌చారం కోసం పంప‌నున్న‌ట్లు చెప్పారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సంఘ్ ప‌రివార్ బాధ్యుల్ని హైద‌రాబాద్‌ లోని మారియ‌ట్ హోట‌ల్లో ప్ర‌త్యేక శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఇందులో వారికి ఎన్నిక‌ల్లో నిర్వ‌హించాల్సిన ప్ర‌చారం గురించి ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. బీజేపీ నేత‌లు పైకి క‌నిపించినంత సింఫుల్ గా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్ని తీసుకోవ‌టం లేద‌న్న విష‌యం ఇట్టే అర్త‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News