కామ్ గా ఉండండి.. అదే పడిపోతుంది, కమలం హై కమాండ్ ఆదేశం!

Update: 2019-05-25 10:14 GMT
కర్ణాటకలో అతుకుల పొత్తు – గతుకుల ప్రభుత్వం అన్న చందంగా సాగుతున్న సంకీర్ణ ప్రభుత్వంపై ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయద్దని బీజేపీ అధిష్టానం హెచ్చరించింది. కాంగ్రెస్‌ – జేడీఎస్‌ మధ్య సమన్వయం కొరవడి ప్రభుత్వం పతనం అవుతుందని భావిస్తున్నారు. ఈక్రమంలో బీజేపీ నాయకులు ఎవరూ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్‌ – జేడీఎస్‌ ఎమ్మెల్యేలతో టచ్‌ లోకి వెళ్లవద్దని బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశారు.

అయితే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ ఘోర పరాభవం చెందడంతో కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందా? పతనం అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మే 23 తర్వాత కర్నాటక సంకీర్ణం కూలిపోవడం ఖాయమని ప్రచారం సాగింది. అదే తరహాలో ఫలితాలు కూడా బీజేపీకే వరించాయి.

కాంగ్రెస్‌ – జేడీఎస్‌ కూటమి నిలవాలంటే తప్పక గెలవాల్సిన మండ్య, తుమకూరు, మైసూరు, కోలార్, చిక్కబళ్లాపుర, చామరాజనగరలో భిన్న ఫలితాలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ మధ్య సమన్వయం కొనసాగడం కష్టమని భావిస్తున్నారు. అయితే హాసన్‌ నుంచి మాత్రమే జేడీఎస్‌ నుంచి గెలిచింది. ఇందులో తుమకూరు, మండ్యలో జేడీఎస్‌ అభ్యర్థులు ఓడిపోయారు. కాగా చామరాజనగర, మైసూరు, కోలార్, చిక్కబళ్లాపుర నుంచి కాంగ్రెస్‌ నాయకులు ఓటమి పాలయ్యారు. ఫలితంగా రెండు పార్టీల మధ్య సమన్వయం లేకనే ఓడిపోయినట్లు అంచనా వేస్తున్నారు.

కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నాయకుల మధ్య సమన్వయ లోపంతో వారే పతనానికి కారకులు అవుతారని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఫలితంగా కాంగ్రెస్‌ లోని అసంతృప్తులతో టచ్‌ లోకి వెళ్లవద్దని రాష్ట్ర బీజేపీ నాయకులకు పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 29వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్‌ యడ్డూరప్ప ఢిల్లీ వెళ్లనున్నారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేయొచ్చని తెలుస్తోంది.


Tags:    

Similar News