బీజేపీకి క‌ర్ణాట‌క‌పై ఇంకా ఆశ చావ‌లేదు

Update: 2018-05-21 04:22 GMT
కర్ణాటకలో బలపరీక్ష సందర్భంగా అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టుకోవడంలో విఫలం కావడంతో సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు నిచ్చారని భావించినందునే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకెళ్లామని కమలనాథులు అంటున్నారు. అదే స‌మ‌యంలో కర్ణాటకలో పరిణామాలు ప్రణాళికకు అనుగుణంగా జరుగకున్నా తిరిగి అధికారంలోకి రాగలమని బీజేపీ విశ్వసిస్తోంది. కాంగ్రెస్‌ - జేడీఎస్‌ మధ్య గల సహజ వైరుధ్యాలే తమకు సహకరిస్తాయని భావిస్తోంది. లింగాయత్‌ లతోపాటు కొన్ని సెక్షన్ల ఓటర్లను సంఘటిత పర్చుకోవడంతో 2019 లోక్‌ సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించగలమని బీజేపీ నేతలు చెప్తున్నారు. ‘మేం పోరాటంలో ఓడిపోవచ్చు. కానీ యుద్ధంలో అంతిమ విజయం మాదే’ అని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు.

బీజేపీని దెబ్బ‌కొట్టి అధికారం చేజిక్కుంచుకున్న అనంత‌రం పదవుల పంపకంపై కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలు దృష్టి సారించాయి. జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌ డీ కుమారస్వామి సీఎం పదవి చేపట్టేందుకు కాంగ్రెస్ ఒప్పుకోవడంతో.. డిప్యూటీ సీఎం ఏ పార్టీ వారికి అప్పగించాలన్నది సమస్యగా మారింది.ఉప ముఖ్యమంత్రి - హోం మంత్రి పదవికి కాంగ్రెస్‌ కు ఇవ్వాలని ఆ పార్టీ మెలిక పెట్టినట్లు తెలుస్తుంది. అయితే మొత్తానికి డిప్యూటీ సీఎం పదవి కాంగ్రెస్‌ కే ఇచ్చేందుకు జేడీఎస్ సుముఖత చూపినట్లు సమాచారం.  ఇలా వివాదం చెల‌రేగిన నేప‌థ్యంలో బీజేపీ ఆశ‌ప‌డింది. కాంగ్రెస్‌ - జేడీఎస్‌ కూటమిలోనే సహజ వైరుధ్యాలు ఇమిడి ఉన్నాయని తెలిపారు. జేడీఎస్‌ ఎమ్మెల్యేల్లో అత్యధికం కాంగ్రెస్‌ పై గెలుపొందిన వారేనని గుర్తు చేశారు. వక్కలిగలకు పట్టు గల ఓల్డ్‌ మైసూర్‌ ప్రాంతంలో బీజేపీ పట్టు చాలా పరిమితం అని, జేడీఎస్‌ కు గట్టి మద్దతు ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జేడీఎస్‌ - కాంగ్రెస్‌ మధ్య విభేదాలను ఆసరాగా చేసుకుని ఈ ప్రాంతంలో మున్ముందు తాము పట్టు సాధించేందుకు వీలవుతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు.
 
మ‌రోవైపు కర్ణాటలో అధికారంలో ఉండటం వల్ల దక్షిణ భారతంలోని ఇతర రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసుకోవడానికి వీలవుతుందని కమలనాథులు అంచనా వేశారు. యడ్యూరప్ప బల పరీక్ష సందర్భంగా తమ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రయత్నించిందన్న విపక్షాల ఆరోపణలను బీజేపీ నిరాకరిస్తోంది. కాంగ్రెస్‌ - జేడీఎస్‌ రాజకీయ ప్రత్యర్థులని బీజేపీ నేతలు అంటున్నాన్నారు. ఆ పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో పరస్పర పోటీ ప్రయోజనాలు ఉన్నాయని, కనుక ఆ పార్టీల మధ్య కూటమి విఫలం అవుతుందని స‌ద‌రు నేత‌లు ధీమాగా ఉన్నారు. తమను అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకునేందుకే ఆ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని చెప్తున్నారు.
Tags:    

Similar News