చట్టంలో ఉన్నవాటి సంగతేంటి?

Update: 2016-05-05 09:17 GMT
ఏపీ తెలుగు తమ్ముళ్లు వాయిస్ పెంచారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం ‘నో’ అన్న మాటను స్పష్టంగా తేల్చి చెప్పిన నేపథ్యంలో కేంద్రం తీరుపై తమ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేసే పనిలో పడ్డారు. నిన్నటికి నిన్న లోక్ సభలో పలువురు టీడీపీ ఎంపీలు హోదా విషయంలో కేంద్రమంత్రి సిన్హా చేసిన ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు సైతం గొంతు సవరించుకోవటమే కాదు.. పాయింట్ల వారీగా ప్రశ్నిస్తూ.. బీజేపీ చేస్తున్న మోసాన్ని ఏపీ ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నారు.

ఇందులో భాగంగా విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తన వాదనను వినిపించారు. ఏపీ ప్రజలు ఏం తప్పు చేశారంటూ ప్రశ్నిస్తున్న ఆయన.. ఎన్నికల సమయంలో ఏన్డీయే అధికారంలోకి వస్తే మోడీ అండ తమకు పుష్కలంగా ఉంటుందని ఏపీ ప్రజలు అనుకున్నారని.. కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి ఉందని ఆయన వాపోయారు. ప్రధానికి ఇచ్చిన హామీకే విలువ ఉండదా? అని ప్రశ్నించిన ఆయన.. ఏపీకి పరిశ్రమలు లేవని.. రెవెన్యూ లోటు మాత్రం ఉందన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో లేదని చెబుతున్న కేంద్రం.. చట్టంలో ఉన్న రెవెన్యూ లోటును ఎందుకు పూడ్చలేదని ప్రశ్నిస్తున్నారు. నీతి అయోగ్ గురించి మాట్లాడుతున్న కేంద్రం.. నీతి అయోగ్ ఛైర్మన్ మోడీనే కదా అని ఆయన గుర్తు చేసే ప్రయత్నం చేశారు. విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టాన్ని కేంద్రం పూడుస్తుందని.. ఏపీలోని ఐదు కోట్ల మంది ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని.. వారిని నిరాశకు గురి చేయొద్దన్నారు. ఏపీ లోటు బడ్జెట్ లో ఉందని.. ఏపీని ఆదుకోవాలని విన్నవించారు. కాస్త కోపం.. మరికాస్త ఆగ్రహం.. అన్నింటికి మించిన జాగ్రత్తగా వ్యవహరిస్తూ బొండా చేసిన కామెంట్లు ఆయన సహజ శైలికి భిన్నంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవరినైనా తిట్టే విషయంలో చెలరేగిపోయినట్లుగా వ్యవహరించే బొండా.. కేంద్రంపై విమర్శల్ని చేసే సమయంలో మాత్రం ఆచితూచి మాట్లాడినట్లుగా కనిపిస్తుంది.
Tags:    

Similar News