బాబును తిప్పలుపెడుతున్న బోండా !

Update: 2022-12-12 05:34 GMT
టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఉదాశీన‌త అనాలో.. లేక భ‌య‌ప‌డుతున్నార‌నే పెద్ద ప‌దం వాడాలో తెలియ‌దు కానీ, రాష్ట్రంలో చాలా మంది నాయ‌కుల్లో చ‌ల‌నం క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా కీల‌క‌మైన విజ‌య‌వాడ‌లో సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంమాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు వ్య‌వ‌హారం పార్టీలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఆయ‌న ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌డం లేదు. పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేదు. పోనీ.. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు అయినా.. అందుబాటులో ఉన్నారా? అది కూడా లేదు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న కుమారుడి వివాహం అంటూ పార్టీకి దూరంగా ఉన్నారు.

ఇక, ఇప్పుడు ఒంట్లో బాగోలేద‌ని చెబుతూ.. కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని ప‌ట్టించుకునే నాయ‌కుడు కూడా క‌నిపించ‌డంలేదు. క‌నీసం.. 2014కు ముందు కొంద‌రు చోటా నాయ‌కులు ఇక్క‌డ జెండాలు క‌ట్టేవారు.

ఇప్పుడు వారుకూడా లేరు. వారంతా కూడా వైసీపీ పంచ‌న చేరిపోయారు. ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు.. వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు స‌మ‌యం సంద‌ర్భం కూడా లేకుండా పార్టీలో చేర్చుకుంటున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు.

దీంతో ఇప్పుడు సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న పేరు త‌ప్ప బొండా పేరు, ఆయ‌న ఊసు వినిపించే నాయ‌కులు ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. ఈ విష‌యాన్ని తెలిసినా చంద్ర‌బాబు గ‌ట్టిగా అడ‌గ‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌నే గుస‌గుస వినిపిస్తోంది.

కాదంటే..  బొండా ఇండిపెండెంట్‌గా అయినా.. పోటీకి సిద్ధ‌మ‌నే సంకేతాలు ఇస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రోవైపు.. బ‌ల‌మైన గ‌ళం, సామాజిక వ‌ర్గం రెండు కూడా చంద్ర‌బాబుకు ఎటూ నిర్ణ‌యం తీసుకోకుండా చేస్తున్నాయ‌ని అంటున్నారు.

పైగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపుతో పాటు మంత్రి ప‌ద‌వి కూడా ఇవ్వాల‌ని బొండా ఇప్ప‌టి నుంచే డిమాండ్లు చేస్తోన్న ప‌రిస్థితి. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నార‌ని .. సీనియ‌ర్లు చెబుతున్నారు. కానీ, చంద్ర‌బాబు ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News