అవును.. ఈ మాటలు అన్నది బ్రదర్ అనిల్ కుమారే బాస్

Update: 2022-12-16 05:30 GMT
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. ఆయన సోదరి షర్మిల కుటుంబానికి మధ్య గ్యాప్ ఉందన్న విషయం ఈ మధ్యన తరచూ వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఒకప్పుడు అన్న కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించటమే కాదు.. అవినీతి ఆరోపణల కేసులు.. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన కేసుల్లో జైలుకు వెళ్లిన వేళ.. అన్న పార్టీని కంటికి రెప్పలా చూసుకోవటమే కాదు.. పార్టీ ఇమేజ్ పెరిగేందుకు షర్మిల చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు.

తర్వాతి కాలంలో అన్న జగన్ తో విభేదాలు పెరిగిపోవటంతో తెలంగాణలో సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల.. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ అధికారపక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా షర్మిల భర్త.. జగన్ బావ అయిన పాస్టర్ బ్రదర్ అనిల్ కుమార్ నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

ఓవైపు తన బావమరిది ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల పేరుతో మోత మోగిపోతున్న వేళ.. ఆయన ఆ పథకాలపై కీలక వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ''తమ స్వార్థం కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాలపై ప్రజలు ఆధారపడొద్దు'' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆయన నోటి నుంచి ఆసక్తికరమైన మాట వచ్చింది. 'దేవుడి పథకాలు వేరుగా ఉంటాయి' అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

తాజాగా విశాఖ జిల్లా భీమిలి మండలంలో జరిగిన క్రిస్మస్ కార్యక్రమానికి హాజరైన ఆయన నోటి నుంచి కాస్త భిన్నమైన వ్యాఖ్యలు వచ్చాయి. ''ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుణ్ననే భావన ప్రజల్లో ఏర్పడింది'' అన్న సంచలన వ్యాఖ్య బ్రదర్ అనిల్ కుమార్ నోటి నుంచి వచ్చాయి.

అయితే.. ఎవరి పేరును ప్రస్తావించకుండా చేసిన ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత ఏడాది ఇదే చోటుకు వచ్చిన సందర్భంలోనూ ఆయన ఇదే తరహాలో సంచలన వ్యాఖ్యలు  చేశారు. ఏమైనా.. సీఎం జగన్ బావ నోటి నుంచి వచ్చిన మాటలు హాట్ టాపిక్ గా మారాయని చెప్పక తప్పదు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News