టీడీపీలోకి బుట్టా రేణుక‌...ఎవ‌రు చెప్పారంటే.

Update: 2017-10-06 04:56 GMT
``అధికార తెలుగుదేశం పార్టీలోకి మళ్లీ భారీగా వలసలు మొదలయ్యే సూచనలు కలిపిస్తున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి మరో ఐదుగురు నేతలు త్వరలో అధికార పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో టీడీపీలోకి చేరే నాయకులలో అనంత మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌ రెడ్డి - కర్నూలు ఎంపీ బుట్టా రేణుకల పేర్లు వినిపిస్తున్నాయి. కర్నూలు నుంచి నలుగురు, అనంతపురం నుంచి ఒకరు చొప్పున ఐదుగురు టీడీపీలోకి వలస వెళుతున్నట్లు సమాచారం`` ఇది కొన్ని మీడియా సంస్థ‌ల్లో జ‌రుగుతున్న ప్ర‌చారం. అయితే ఇలాంటి ప్రచారం ఇదే మొద‌టిసారి కాదు...ఇదే చివ‌రి సారి కూడా కాబోద‌ని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.

తాజాగా కూడా తాను పార్టీ మారుతున్న‌ట్లు సాగిన ప్ర‌చారంపై కర్నూలు ఎంపీ బుట్టా రేణుక క్లారిటీ ఇచ్చారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరబోవడం లేదని - వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తాను వైఎస్ ఆర్‌ సిపి కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నానని, పార్టీ అధినేతతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆమె తేల్చి చెప్పారు.  ఎంపీ బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలో చేరతారని వస్తోన్న వార్తలన్నీ తనపై ఓ పథకం ప్రకారం ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని తెలిపారు. త‌న గురించి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి గురించి పార్టీ శ్రేణుల‌కు పూర్తి స్ప‌ష్ట‌త ఉంద‌న్నారు.

కాగా, నంద్యాల ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పార్టీ మారుతున్నార‌ని ప్ర‌చారం సాగిన సంగ‌తి తెలిసిందే. దీనికి ఆ స‌మ‌యంలో ఎంపీ స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఇచ్చేశారు. తన ప్రమే‍యం లేకుండా కొన్ని ఛానళ్లు తనని పార్టీ మార్చుతున్నాయని స‌ద‌రు ప్ర‌చారాన్ని  రేణుక ఎద్దేవా చేశారు. వైసీపీలో తనకు సముచిత స్థానం ఉందని ఆమె గుర్తు చేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా వైసీపీ తరపున కర్నూలు ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకోవ‌డంలో విఫ‌మ‌య్యార‌ని  రేణుక మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌కు మేలు చేయ‌ని పాల‌న కంటే వైఎస్సార్‌ సీపీ అధినేత - ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన కోసం జనం ఎదురు చూస్తున్నారని.. అలాంటి పార్టీని వదిలి టీడీపీలో చేరే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. తాజాగా అదే విష‌యాన్ని క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక పున‌రుద్ఘాటించారు.
Tags:    

Similar News