మరిన్ని ఉపఎన్నికలు తప్పవా ?

Update: 2022-08-07 07:17 GMT
బీజేపీ ఊపుచూస్తుంటే తెలంగాణాలో మరిన్ని ఉపఎన్నికలు తప్పేట్లులేదు. కేసీయార్ ను ఎలాగైనా ఇబ్బంది పెట్టేందుకు కమలనాదులు డిసైడ్ అయిపోయారు. ఒకవైపు కేసీయార్ పాలనపై ప్రతిరోజు  రచ్చరచ్చ చేస్తునే మరోవైపు టీఆర్ఎస్ లోని నేతలను లాగేసుకోవాలన్నది బీజేపీ నేతల ఆలోచన. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ నుండి మాత్రమే కాకుండా కాంగ్రెస్ నేతలపైన కూడా దృష్టిపెట్టింది. సింపుల్ గా నేతలను మాత్రమే లాక్కుంటే ఉపయోగముండదు కాబట్టే ప్రజాప్రతినిధులను ఆకర్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టింది.

మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామా ఇందులో భాగమే. సరే రాజగోపాల్ విషయం తేలిపోయింది కాబట్టి మరికొందరిపైన కూడా దృష్టిసారించింది. విషయం ఏమిటంటే ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించటం ఉపఎన్నికలు తెప్పించటం అందులో గెలుపుకోసం నానా గోలచేయటమే బీజేపీ ప్లాన్. వచ్చిన ప్రతి ఉపఎన్నికలోను బీజేపీ గెలుస్తుందనే గ్యారెంటీ ఏమీలేదు. కానీ ఉపఎన్నికంటు వస్తే అందులో టీఆర్ఎస్ పాల్గొనటం కచ్చితమే. ఆ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలవకుండా చూడటమే బీజేపీ లక్ష్యం.

కేసీయార్ ను డైరెక్టుగా టార్గెట్ చేయటంద్వారా మానసికంగా ఇబ్బందులు పెట్టాలన్నది కమలనాదుల లక్ష్యంగా కనిపిస్తోంది. కేసీయార్  జనాల్లో విశ్వసనీయత కోల్పోయారని, కేసీయార్ పాలనపై జనాలంతా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని నిరూపించటమే లక్ష్యంగా పావులు కదుతుపోతోంది. ఇందుకు ఉపఎన్నికలు తెప్పించటమే మార్గంగా ప్లాన్ చేసింది. షెడ్యూల్ ఉఫఎన్నికల్లోగా మరో నాలుగు ఉపఎన్నికలు వచ్చేలా ప్రయత్నాలు ప్రారంభించింది. అంటే టీఆర్ఎస్+కాంగ్రెస్ కు చెందిన మరో నాలుగైదుగురు ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించేపనిలో ఉన్నారు బీజేపీ నేతలు.

అందుకనే తమపార్టీలో చేరి రాజీనామాలు చేయటానికి సిద్ధంగా ఉన్న ప్రజాప్రతినిధులకు బాగా గాలమేస్తున్నారు. పార్టీలోచేరినా రాజీనామా చేయటానికి సిద్దంగా లేని ఎంఎల్ఏలతో బీజేపీకి పెద్దగా ఉపయోగంలేదు. బీజేపీకి కావాల్సింది ఎంఎల్ఏ మాత్రమే కాదు. రాజీనామాకు సిద్ధపడే ఎంఎల్ఏ మాత్రమే.  ఎందుకంటే ఉపఎన్నిక రావాలంటే సదరుఎంఎల్ఏ రాజీనామా చేయాల్సిందే.
Tags:    

Similar News