ఏపీ ఎంత అప్పుల‌పాలైందో చెప్పేసిన కాగ్‌

Update: 2018-04-07 04:56 GMT
అనుభ‌వం ఉన్న నాయ‌కుడు ముఖ్య‌మంత్రిగా వ‌స్తే రాష్ట్రానికి మేలు జ‌రుగుతుంద‌ని తాను ఆశించిన‌ట్లుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ర‌చూ చెబుతుంటారు. అయితే.. ఒక నేత అనుభ‌వ‌రాహిత్యంతో చేసే ఆలోచ‌న‌లు రాష్ట్రానికి ఎంత న‌ష్టం చేస్తాయో తాజాగా కాగ్ విడుద‌ల చేసిన రిపోర్ట్ చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. బాబు అనుభ‌వాన్ని న‌మ్మి తాను త‌ప్పు చేసిన‌ట్లుగా ప‌వ‌న్ ఈ మ‌ధ్య‌న చెబుతున్నారు.

చేయాల్సిన త‌ప్పు చేసేసి.. ఇప్పుడు ఎన్ని చెంప‌లు వేసుకున్నా జ‌రిగిపోయిన న‌ష్టం పూడ్చుకోవ‌టం అంత తేలికైన విష‌యం కాదు. ఏపీ స‌ర్కారు చేస్తున్న అప్పులు.. ఆర్థిక అంశాల్లో అనుస‌రిస్తున్న వైఖ‌రిపై కాగ్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తింది. ఏపీ ఆర్థిక నిర్వ‌హ‌ణ అస్త‌వ్య‌స్తంగా మారింద‌ని.. చేసిన అప్పుల‌ను ఆస్తుల క‌ల్ప‌న‌కు కాకుండా రోజువారీ ఖ‌ర్చుల‌తో పాటు రెవెన్యూ రంగాల‌కు ఖ‌ర్చు చేయ‌టంపై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

మ‌రికాస్త అర్థం కావాలంటే.. ఏదైనా ఆస్తి కొనుగోలుకు మీ చేతిలో డ‌బ్బులు లేవ‌నుకోండి. మీకున్న ప‌ర‌ప‌తితో బ్యాంక్ ద‌గ్గ‌ర రుణం తీసుకోవ‌టం.. దాంతో మ‌రింత సంప‌ద‌న‌ను సృష్టించ‌టం ఒక ప‌ద్ద‌తి. అలా కాకుండా ఆస్తులు కొనుగోలు కాకుండా రోజువారీ ఖ‌ర్చుల కోసం అప్పు చేయ‌టం దేనికి సంకేతం?  ప్ర‌స్తుతం ఏపీ ఆర్థిక ప‌రిస్థితి ఇదే తీరులో ఉంద‌న్న విష‌యం కాగ్ రిపోర్ట్ స్ప‌ష్టం చేసింది.

2016-17 ఆర్థిక సంవ‌త్స‌రంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగ‌తుల‌పై కాగ్ నివేదిక‌ను రాష్ట్ర స‌ర్కారు అసెంబ్లీకి స‌మ‌ర్పించింది. దీని ప్ర‌కారం రూ.17,231 కోట్లు అప్పులు చేసి రెవెన్యూ వ్య‌యానికి ఖ‌ర్చు చేసిన‌ట్లుగా రిపోర్ట్ తేల్చింది. ఇందులో పేర్కొన్న కీల‌క అంశాలు చూస్తే..

= 2016-17 ఆర్థిక సంవ‌త్స‌రం బ‌డ్జెట్  అంచ‌నాల్లో రెవెన్యూ వ్య‌యం రూ.1,14,168 కోట్లుగా చెప్ప‌గా.. వాస్త‌వంగా రెవెన్యూ వ్య‌యం అంచ‌నాల‌కు మించి రూ.1,16,215 కోట్ల‌కు చేరింది.

= రెవెన్యూ వ్య‌యంలో 85.17 వాతం రెవెన్యూ రాబ‌డుల నుంచి ఖ‌ర్చు చేస్తే.. మిగిలిన ఖ‌ర్చును రుణాల ద్వారా సేక‌రించిన నిధుల ద్వారా ఖ‌ర్చు చేశారు.

= 2016-17లో రెవెన్యూ ఖ‌ర్చు అంత‌కు ముందు ఆర్థిక సంవ‌త్స‌రం కంటే రూ.20,265 కోట్ల‌కు పెరిగింద‌ని.. రుణాల ద్వారా స‌మ‌కూర్చున్న నిధులు రెవెన్యూ ఖ‌ర్చుల కోసం వినియోగిస్తున్నారు. రానున్న సంవ‌త్స‌రాల్లో తీర్చాల్సిన రుణ‌భారం అంత‌కంత‌కూ పెర‌గ‌టం ఖాయం.

= 2016–17 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న రుణ బాధ్యతల విలువ రూ.2,01,314 కోట్లు.   రెవెన్యూ రాబడులకు ఇది 2.03 రెట్లు.. జీఎస్‌ డీపీలో 28.79 శాతంగా ఉంది.

= బ‌డ్జెట్ లో వెల్ల‌డించ‌ని రుణాల్ని.. గ్యారెంటీ ఇచ్చిన రుణ బ‌కాయిల్ని క‌లుపుకొని చూస్తే.. ఏపీ రాష్ట్ర రుణ చెల్లింపుల బాధ్య‌త రూ.2,22,845 కోట్లు. సొంత రెవెన్యూ వ‌న‌రుల కంటే రుణాల రాబ‌డుల మీదే ప్ర‌భుత్వం ఎక్కువ‌గా ఆధార‌ప‌డిన‌ట్లుగా సూచీలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

=  2016–17లో కేపిటల్‌ వ్యయం 11.48 శాతం. ఇది సాధారణ వర్గం రాష్ట్రాల సమష్టి సగటు 19.70 శాతం కన్నా చాలా తక్కువ. రానున్న ఏడు సంవత్సరాల్లో 50 శాతానికి మించి రూ.76,888 కోట్ల రుణాలను తీర్చాల్సి ఉంది. దీంతో ఆయా సంవ‌త్స‌రాల్లో బడ్జెట్‌పై భారం మోపనుంది.
Tags:    

Similar News