కాగ్ లెక్క‌: అమ‌రావ‌తిలో క‌ట్ట‌డాల‌కు ఆ ఖ‌ర్చులేంది బాబు?

Update: 2019-05-12 05:40 GMT
ఏపీ రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలో తాత్కాలిక సచివాల‌యం పేరుతో చేసిన ఖ‌ర్చుకు సంబంధించిన విష‌యాల్ని కాగ్ తాజాగా బ‌య‌ట‌కు తెచ్చింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ ను ప్ర‌భుత్వానికి సమ‌ర్పించింది. నిర్మాణాల పేరుతో భారీగా దోపిడీ సాగిన‌ట్లుగా కాగ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. భారీ ఎత్తున క‌మీష‌న్లు దండుకున్నార‌న్న ఆరోప‌ణ‌ల వేళ‌.. త‌న ప‌ద‌వీకాలం పూర్తి కానున్న వేళ హ‌డావుడిగా శాశ్విత ప్ర‌భుత్వ భ‌వ‌నాల స‌ముదాయం నిర్మాణానికి హ‌డావుడిగా టెండ‌ర్ల‌ను ఆహ్వానించ‌టంపై అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఒక చ‌ద‌ర‌పు అడుక్కి రూ.2వేల‌కు మించి నిర్మాణ వ్య‌యం కాద‌ని నిపుణులు చెబుతుంటే.. అందుకు భిన్నంగా ప్ర‌భుత్వం మాత్రం ఒక్కో చ‌ద‌ర‌పు అడుగు నిర్మాణానికి రూ.19,707.24కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకోవ‌టంపై విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇంత భారీ ఖ‌ర్చు భ‌వ‌న నిర్మాణానికా? అని నోరు వెళ్ల‌బెడుతున్నారు.

రాజ‌ధానిలో తాత్కాలిక స‌చివాల‌య నిర్మాణ ప‌నుల టెండ‌ర్ల‌ను రూల్స్ కు వ్య‌తిరేకంగా అధిక ధ‌ర‌ల‌కు కాంట్రాక్ట‌ర్ల‌కు అప్ప‌గించిన వైనాన్ని కాగ్ వెల్ల‌డించింది.చిన్న‌పాటి వ‌ర్షానికే నీళ్లు కారే తాత్కాలిక స‌చివాల‌యాన్ని నిర్మించిన ఎల్ అండ్ టీ.. షాపూర్ జీ ప‌ల్లోంజీ కాంట్రాక్టు సంస్థ‌ల‌కే శాశ్వ‌త స‌చివాల‌యం.. వివిధ శాఖ‌ల హెడ్ ల భ‌వ‌నాల నిర్మాణ‌ల టెండ‌ర్ల‌ను అప్ప‌గించారు.

ఇందుకోసం ఐదు ట‌వ‌ర్ల నిర్మాణానికి 30 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల్లో నిర్మించాల‌ని తొలుత భావించినా.. టెండ‌ర్లు వ‌చ్చే నాటికి అది కాస్తా 69 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల‌కు పెరిగిపోవ‌టం విశేషం. ఇందుకోసం రూ.13,598 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని లెక్క తేల్చారు. అంటే.. చ‌ద‌ర‌పు అడుక్కి రూ.19,707 చొప్పున ఖ‌ర్చు కావ‌టం విస్మయానికి గురి చేస్తోంది. ఎంత ఇంటీరియ‌ర్ తో స‌హా ఖ‌ర్చు చేసినా.. ఇంత భారీగా ఖ‌ర్చు ఏంది? అన్న‌ది ప్ర‌శ్న‌.

మ‌రోవైపు భూమి ఉచితంగా.. కంక‌రు.. ఇసుక ఉచితంగా ఇస్తున్న‌ప్పుడు ఇంత భారీగా ఎందుకు ఖ‌ర్చు చేయాల‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భించ‌ని ప‌రిస్థితి. మ‌రో భారీ ఖ‌ర్చు లెక్క‌కు వ‌స్తే.. ఐదో ట‌వ‌ర్ నిర్మాణాన్ని సాధార‌ణ ప‌రిపాల‌న ఆశాఖ ఎన్ సీసీ కాంట్రాక్టు సంస్థ‌కు అప్ప‌జెప్పారు. మూడు నాలుగు ట‌వ‌ర్ల ప‌నులు ఎల్ అండ్ టీకి అప్ప‌గించ‌గా.. ఒక‌ట్రెండు ట‌వ‌ర్లు షాపూర్ జీ ప‌ల్లోంజీకి అప్ప‌జెబుతూ నిర్‌న‌యం తీసుకున్నారు. ఈ ఐదు ట‌వ‌ర్ల నిర్మాణాన్ని ప‌ర్య‌వేక్షించేందుకు ప్రాజెక్టు మేనేజ్ మెంట్ క‌న్స‌ల్టెంట్ ఫీజుతో పాటు.. జీఎస్టీని క‌లిపి ఏకంగా రూ.23.90 కోట్లు చెల్లించాల‌ని డిసైడ్ చేయ‌టం గ‌మ‌నార్హం. ప‌ప్పు బెల్లాల మాదిరి కోట్లు ఖ‌ర్చు పెట్టేయ‌టం చూస్తే షాకింగ్ క‌ల‌గ‌క మాన‌దు.
Tags:    

Similar News