బాబు స‌ర్కారు తాత్కాలిక దోపిడీ లెక్క చెప్పిన కాగ్‌!

Update: 2018-09-19 05:31 GMT
వెనుకా ముందు చూసుకోకుండా.. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ఖ‌ర్చు చేయ‌టంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు మించినోళ్లు మ‌రొక‌రు క‌నిపించ‌రు. విభ‌జ‌న కార‌ణంగా తీవ్ర‌మైన ఆర్థిక ఇబ్బందిని ఎదుర్కొంటున్న ఏపీ విష‌యంలో ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. అందుకు భిన్నంగా తాత్కాలిక నిర్మాణాల పేరుతో ఎంత భారీగా దోపిడీ సాగుతుంద‌న్న విష‌యంపై ఇప్ప‌టికే ప‌లు విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

తాజాగా ఈ అంశంపై రాజ్యాంగ‌బ‌ద్ధ సంస్థ కంట్రోలర్ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అలియాస్ కాగ్ తాజాగా షాకింగ్ నిజాల్ని బ‌య‌ట‌పెట్టింది. కాంట్రాక్ట‌ర్ల‌కు అంతులేని ప్ర‌యోజ‌నాల్ని క‌లిగించార‌ని.. దీని కార‌ణంగా రాష్ట్ర ఖ‌జానాకు తీవ్ర‌న‌ష్టం వాట్లిల్లేలా చేశార‌ని మండిప‌డింది.

తాత్కాలిక స‌చివాల‌యం పేరుతో ప్ర‌జాధ‌నాన్ని విచ్చ‌ల‌విడిగా దుబారా చేస్తుంద‌న్న ఆరోప‌ణ మొద‌ట్నించి వినిపిస్తున్నా.. కాంట్రాక్ట‌ర్ల‌కు భారీగా ప్ర‌యోజ‌నాల్ని క‌లిగించేలా టెండ‌ర్ రూల్స్ ను మార్చార‌ని వ్యాఖ్యానించింది. ఇంజ‌నీరింగ్ - ప్రొక్యూర్ మెంట్ - క‌న్ స్ట్ర‌క్ష‌న్ విధానానికి ప్ర‌భుత్వం తూట్లు పొడిచిన‌ట్లుగా వెల్ల‌డించింది. ఆరు భ‌వ‌నాల నిర్మాణాల‌కు టెండ‌ర్ల ఖ‌రారులో కేంద్ర విజిలెన్స్ మార్గ‌ద‌ర్శ‌కాల్ని రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో 94నుపూర్తిగా ఉల్లంఘించిన‌ట్లుగా కాగ్ పేర్కొన‌టం గ‌మ‌నార్హం.

ప్ర‌జాధ‌నాన్ని భారీగా వృధా చేసిన వైనంపై కాగ్ ఏమ‌ని వ్యాఖ్యానించిందంటే..

+ ప్రధానంగా తాత్కాలిక సచివాలయం పేరుతో 6 భవనాల నిర్మాణాల కోసం పిలిచిన టెండర్లలో చోటుచేసుకున్న అక్రమాలను - కాంట్రాక్టు సంస్థలకు ఆర్థిక ప్రయోజనం కల్పించిన తీరును ఆడిట్‌ నివేదికలో ‘కాగ్‌’ సోదాహరణంగా వివరించింది.

+ 6 భవనాల నిర్మాణాలకు టెండర్ల ఖరారులో కేంద్ర విజిలెన్స్‌ మార్గదర్శకాలను, రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో నెం 94ను ఉల్లంఘించారు. అధిక ధరలకు(ఎక్సెస్‌) టెండర్లను ఖరారు చేయడంపై ‘కాగ్‌’ అభ్యంతరం వ్యక్తం చేసింది.

+ ఈ–ప్రొక్యూర్‌ మెంట్‌ లో తొలుత అప్‌ లోడ్‌ చేసిన అంతర్గత అంచనా వ్యయాన్ని.. ఆ తరువాత పెంచేయడాన్ని తప్పుపట్టింది.

+ ఈపీసీ విధానంలో టెండర్లను 5 శాతం కంటే ఎక్సెస్‌కు ఖరారు చేయరాదని స్పష్టమైన నిబంధనలు ఉన్నా.. ప్ర‌భుత్వం ఉల్లంఘనలకు పాల్పడింది.

+ 5 శాతం ఎక్సెస్‌ కు టెండర్లు వస్తే వాటిని రద్దుచేసి రెండోసారి టెండర్లను ఆహ్వానించాలనే ఈపీసీ ప్రాథమిక నిబంధనలను ప‌ట్టించుకోలేదు. తాత్కాలిక సచివాలయం భవనాల నిర్మాణాల అంచనా వ్యయాలను కాంట్రాక్టర్లకు 14 శాతం మేర లాభం వచ్చేలా రూపొందించారు.

+ కేంద్ర విజిలెన్స్‌ మార్గదర్శకాలకు విరుద్ధంగా 5 శాతానికి మించి ఎక్సెస్‌కు టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టు సంస్థలతో సంప్రదింపులను జ‌రిపారు.  తాత్కాలిక సచివాలయంలోని 6 బ్లాకులను రెండేసి బ్లాకులుగా కలిపి 3 ప్యాకేజీలుగా టెండర్లను ఆహ్వానించారు. ఎల్‌అండ్‌టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు మాత్రమే టెండర్లు దాఖలు చేశాయి. ఈ రెండు సంస్థలు అంతర్గత అంచనా వ్యయంపై ఏకంగా 62 శాతం నుంచి 85 శాతం వరకు ఎక్సెస్‌కు టెండర్లను దాఖలు చేశాయి.

+ ఇలాంటి సంద‌ర్భంలో టెండర్లను రద్దు చేయాల్సింది పోయి ఆ రెండు సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపుల జరపట‌మా?

+ టెండ‌ర్ల ధ‌ర విష‌యంలో సంప్రదింపుల తరువాత కూడా ఈ రెండు సంస్థలకు 16.24 శాతం నుంచి 24.75 శాతం ఎక్సెస్‌కు టెండర్లను ఖరారు చేయడం ఏమిటి?  ఈ రెండు సంస్థలకు బిల్లుల చెల్లింపులోనూ నిబంధనల మేరకు ప్రభుత్వం వ్యవహరించలేదు.

+ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఆర్‌డీఏ కమిషనర్‌ కాంట్రాక్టర్లకు రూ.40.80 కోట్ల అదనపు ప్రయోజనం కలిగేలా టెండర్లను ఖరారు చేశారు.ఇది ఎంత‌మాత్రం స‌మ‌ర్థ‌నీయం కాదు. ప్ర‌జాధ‌నం భారీగా వృధా అయ్యింది.
Tags:    

Similar News