ఏపీ లోటు కాగ్ చెప్పేసింది.. ఇవ్వటమే మిగిలింది

Update: 2015-08-21 04:58 GMT
ఏపీకి చాలానే ఇస్తున్నట్లుగా కేంద్రం చెబుతోంది. నిజానికి కేంద్రం ఇచ్చే చిల్లర ఏ మూలకు సరిపోవదన్న విషయం తెలిసిందే. అడ్డగోలుగా విభజించిన కారణంగా.. ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీ ఆర్థిక లోటును కేంద్రం సర్దుబాటు చేయాల్సి ఉన్నా.. చేసిందేమీ లేదు. విభజన తర్వాత నవ్యాంధ్ర రెవెన్యూ లోటును రూ.15,800కోట్లుగా గవర్నర్ పాలన సమయంలో తేల్చారు.

ఆ లెక్కను కేంద్రానికి పంపితే.. ఏపీకి అంత లోటు ఉండే అవకాశం లేదంటూ.. లెక్కలు తేల్చాలంటూ కాగ్ కు విషయాన్ని అప్పగించారు. ఏపీ ఆర్థిక లోటు గురించి తోతుగా లెక్కలేసిన కాగ్.. విభజన కారణంగా ఏపీకి మొదటి ఏడాది ఆర్థిక లోటు రూ.14,409కోట్లుగా తేల్చారు. దీంతో.. ఈ మొత్తం కేంద్రం నుంచి రావాల్సి ఉంది.

అయితే.. ఆర్థిక లోటు సర్దుబాటులో భాగంగా ఇప్పటివరకూ కేంద్రం.. రాష్ట్రానికి ఇచ్చిన మొత్తం రూ.2,300కోట్లు మాత్రమే. అంతే దాదాపు రూ.12,100కోట్ల వరకూ నిధులు రావాల్సి ఉంది.

ఏపీకి ప్రత్యేకహోదా.. ప్రత్యేక ప్యాకేజీ రెండింటి గురించి ప్రధాని మోడీ దగ్గర బలమైన వాదనను వినిపించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్న సమయంలోనే.. కాగ్ లెక్కలు బయటకు రావటం ఏపీ సర్కారు చేసే వాదనకు మరింత బలం దొరికినట్లుగా చెబుతున్నారు. కాగ్ లెక్కల నేపథ్యంలో అయినా.. ఏపీకి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇచ్చేస్తారా? లేక.. పీనాసితనాన్ని ప్రదర్శించే మోడీ సర్కారు తన పాత తీరును కొనసాగిస్తుందా అన్నది చూడాలి.
Tags:    

Similar News