మనోడి చలువతోనే కెనడా ప్రధానికి మళ్లీ పదవి..

Update: 2019-10-23 04:59 GMT
ప్రజా వ్యతిరేకత మూటకట్టుకున్నప్పటికీ కొన్నిసార్లు ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. అలాంటి కోవలోకే వస్తుంది తాజా ఉదంతం. ఎన్నికల ప్రచారం కోసం తీవ్ర ఇబ్బందులకు గురి కావటమే కాదు.. బుల్లెట్ ఫ్రూప్ జాకెట్ వేసుకొని మరీ ప్రచారానికి వెళ్లాల్సి వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అతి కష్టమ్మీదా తన పదవిని నిలుపుకునే అవకాశం ఉంది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. జస్టిన్ పవర్ ను నిలబెట్టుకోవటంలో మనోడు కీలకభూమిక పోషిస్తుండటం గమనార్హం. ప్రవాస భారతీయుడు కమ్ కెనడియన్ అయిన జగీ్మత్ సింగ్ పుణ్యమా అని మరోసారి ప్రధాని పదవిని చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా జరిగిన సాధారణ ఎన్నికల్లో జస్టిన్ నేతృత్వం వహిస్తున్న లిబరల్ పార్టీ మొత్తం 338 ఎలక్టోరల్ డిస్ట్రిక్ట్ కు 157 డిస్ట్రిక్స్ లో విజయం సాధించింది.

ప్రతి పక్ష పార్టీ 121 స్థానాలకే పరిమితమైంది. దీంతో.. తనకు అవసరమైన మద్దతును ఇతర పార్టీలతో కలిసి పంచుకోనున్నారు. ఈ సమయంలో మనోడు ఇండియన్ కెనడియన్ అయిన జగీ్ మత్ సింగ్ కీలకం కానున్నారు. ఆయన నేతృత్వం వహిస్తున్న న్యూ డెమొక్రటిక్ పార్టీ 24 సీట్లలో విజయం సాధించింది. దీంతో.. ఇప్పుడాయన కింగ్ మేకర్ పాత్రను పోషించనున్నారు.
అధికారంలోకి వచ్చేందుకు జస్టిన్ కు మనోడు కీలకంగా మారినప్పటికీ.. గత ఎన్నికలతో పోలిస్తే.. మనోడి పార్టీకి సీట్ల సంఖ్య తగ్గిన విషయం స్పష్టమవుతుంది. 2015లో జరిగిన ఎన్నికల్లో జగీ్ మత్ సింగ్ పార్టీ 44 స్థానాల్లో విజయాన్ని నమోదు చేస్తే.. ఈసారి 24 సీట్లకే పరిమితం కావటం గమనార్హం.

పార్లమెంటులో తాము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని.. కెనడియన్ల హక్కుల కోసం పోరాడతామని ఎన్నికల ఫలితాల అనంతరం జగీ్ మత్ సింగ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఎక్కువ స్థానాలు చేతిలో ఉన్న బ్లాక్ క్యూబెకాయిస్.. గ్రీన్ పార్టీ ట్రూడో పార్టీలు తాము ప్రభుత్వంలో భాగస్వామ్యం కామని స్పష్టం చేశాయి. దీంతో.. మనోడి మద్దతు ప్రభుత్వ ఏర్పాటుకు కీలకం కానుంది. ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేలా మనోడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.

అదే జరిగితే.. కెనడాలో ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా మారిన తొలి శ్వేతజాతీయేతర నేతగా నలబై ఏళ్ల మనోడే అవుతాడు. అంతేకాదు.. ఆ దేశంలో ఒక రాజకీయ పార్టీకి అధినేతగా వ్యవహరిస్తున్న ఏకైక వ్యక్తి ఆయనే. గతంలో ఆయన క్రిమినల్ డిఫెన్స్ లాయర్ గా పని చేశారు. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం విశ్వాస పరీక్షను  జస్టిన్ ట్రూడో ఎదుర్కోనున్నారు. మనోడి అండగా బలపరీక్షను సులువుగా అధిగమించే అవకాశాలే ఎక్కువ.
Tags:    

Similar News