మూడేళ్ల‌యినా ముడిప‌డ‌లేదు.. ఏపీ రాజ‌ధాని ఏదంటే ఏం చెప్పాలి?

Update: 2022-12-18 11:32 GMT
ఏపీ రాజ‌ధాని విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి అంద‌రికీ తెలిసిందే. అమ‌రావ‌తిని కాద‌ని.. మూడు రాజ‌ధానుల‌ను భుజాన వేసుకున్న వైసీపీ, మూడు ప్రాంతాల‌ను అభివృద్ది చేసేందుకే ఇలా నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ప‌దే ప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే, అభివృద్ధి మాట ఎలా ఉన్నా.. అదికారంలోకి వ‌చ్చి మూడున్న‌రేళ్లు గ‌డిచిపోయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేస్తాం.. రాష్ట్రాల్లోని మూడు ప్రాంతాల‌ను కూడా అభివృద్ధి చేస్తాం.. అని సీఎం జ‌గ‌న్ అసెంబ్లీలో ప్ర‌క‌టించి మూడు సంవ‌త్స‌రాలు గడిచిపోయాయి. ఇప్ప‌టి వ‌రకు మూడింటిలో ఒక్క‌టి కూడా ఆయ‌న ప్రారంభించ‌లేక పోయారు. పోనీ.. ఇత‌ర వాటికి  న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ఉన్నా యని.. ఒప్పుకుందాం. ఉన్న అమ‌రావ‌తినైనా అభివృద్ధి చేయాల్సిన అవ‌స‌రం ఉందిక‌దా?  దానిని మూడురాజ‌ధానుల్లో ఒక‌టిగా గుర్తించారు క‌దా!

కానీ ఇప్ప‌టి వ‌ర‌కు దానిని కూడా వ‌దిలేశారు.  ఇక‌, మిగిలిన హైకోర్టు, విశాఖ‌లో పాల‌న రాజ‌ధాని వంటివి సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. ఇక్క‌డ రెండు విధాలుగా వ్య‌తిరేక‌త వ‌స్తోంది. ఒక‌టి ప్ర‌జ‌ల నుంచి మూడుపై ఎలాంటి స్పంద‌నా క‌నిపించ‌డం లేదు. వారిలో నిజంగానే దూకుడు ఉండి ఉంటే.. ఇప్ప‌టికే.. ప్ర‌జ‌లు ఉద్య‌మాల రూపంలో క‌దిలి వ‌చ్చేవారు. కానీ, అలాంటిదేమీ క‌నిపించ‌డం లేదు.

ఇక‌, న్యాయ‌ప‌రంగానూ  చిక్కులు ఇప్ప‌ట్లో తొలిగేలా క‌నిపించ‌డం లేదు. సో.. మొత్తంగా చూస్తే.. ఏపీ ప్ర‌జ‌ల కు వైసీపీ అధికారంలో ఉన్న ఈ మూడున్న‌రేళ్ల‌లో రాజ‌ధాని`ఇదీ` అని చెప్పుకొనేందుకు ఒక ఆస్కారం.. అవ‌కాశం కూడా లేకుండా పోయింద‌నే టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీలో మూడు రాజ‌ధానులు ప్ర‌క‌ట‌న చేసి మూడేళ్లు గ‌డిచిన నేప‌థ్యంలో నిజానికి ఇది స‌క్సెస్ అయి ఉంటే.. లేక‌, ప్ర‌జ‌ల్లో దీనికి సంబంధించిన ఫాలోయింగ్ ఉంటే ఖ‌చ్చితంగా.. వైసీపీ సంబ‌రాలు చేసుకునేది. కానీ, ఆఊసు, ధ్యాస కూడా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.
Tags:    

Similar News