కేసీఆర్‌పై ఏపీలో కేసుల వెల్లువ..!

Update: 2015-06-09 05:16 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసులు వెల్లువెత్తాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల తెలంగాణ సీఎం తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేసీఆర్‌పై కేసులు పెట్టారు. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఈ కేసులు నమోదు కావడం విశేషం.

    కర్నూలు జిల్లాలోని కర్నూలు, డోన్‌, పత్తికొండ పోలీస్‌ స్టేషన్‌లలో కేసీఆర్‌పై తెలుగుదేశం కార్యకర్తలు కేసులు నమోదు చేశారు. తిరుపతిలో కూడా ఒక కేసు నమోదు అయ్యింది. అనకాపల్లి, కాకినాడ, పిఠాపురం, బొబ్బిలి, పశ్చిమగోదావరి జిల్లా ఉండి, పాలకొల్లు తదితర పోలీస్‌ స్టేషన్‌లలో తెలంగాణ సీఎంపై కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నేతలు, ఆ పార్టీ సానుభూతి పరులు ఈ కేసులను నమోదు చేశారు.

    తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎంపై కుట్ర జరుగుతోందని.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఈ కుట్ర జరుగుతోందంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని పోలీసులు తెలంగాణ సీఎంపై కేసులు నమోదు చేశారు.

    తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కూడా ప్రయత్నించాడని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. మరి  ఈ ఫిర్యాదులపై కేసులు వరకూ నమోదయ్యాయి.. ఎలాంటి చర్యలుంటాయో వేచి చూడాలి!

    కేవలం ఫిర్యాదులు మాత్రమే కాదు... తెలంగాణ సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మల దహనాన్ని కూడా చేశారు తెలుగుదేశం నేతలు. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగానూ తెలుగుదేశం నేతలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విధంగా 'ఓటుకు నోటు' తదినంతర పరిణామాల పట్ల నిరసన తెలిపింది.


Tags:    

Similar News