చంద్రబాబు ఇప్పుడెందుకు ప్రయత్నించలేదు ?

Update: 2021-11-15 05:02 GMT
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిసేందుకు చంద్రబాబునాయుడు ఇప్పుడెందుకు ప్రయత్నించకూడదు ? ఆమధ్య ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రప్రభుత్వంపై ఫిర్యాదులు చేయటానికి రెండు రోజులు చంద్రబాబు వెయిట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. నరేంద్రమోడి, అమిత్ షా ను కలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఫిర్యాదులు చేయటానికి చంద్రబాబు ప్రయత్నించారు. రాష్ట్రంలో అర్జంటుగా రాష్ట్రపతి పాలన పెట్టాలనేది చంద్రబాబు ప్రధాన డిమాండ్. రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ ను కలిశారు కానీ మోడి, షా ను మాత్రం కలవలేకపోయారు.

ఎన్నిరోజులు ప్రయత్నించినా వీళ్ళిద్దరినీ కలవటం సాధ్యంకాదని  అర్ధమైపోవటంతో చంద్రబాబు హైదరాబాద్ కు వచ్చేశారు. సరే అదంతా గతమైపోయింది. సదరన్ స్టేట్స్ జోనల్ కమిటి సమావేశానికి స్వయంగా అమిత్ షా నే తిరుపతికి వచ్చారు. ఆది, సోమవారాల్లో తిరుపతిలోనే ఉంటారు. ఆదివారమంతా అధికారిక కార్యక్రమాల్లో షా బిజీగా ఉంటారని అనుకున్నా సోమవారం పూర్తిగా పార్టీ కార్యక్రమాలకే కేటాయించారు.

సోమవారం సాయంత్రం వరకు తిరుపతిలోనే ఉంటున్న షా అపాయిట్మెంట్ కోసం చంద్రబాబు ఎందుకు ప్రయత్నించకూడదు ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. అపాయిట్మెంట్ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తే షా అంగీకరించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చంద్రబాబుది కూడా చిత్తూరు జిల్లాలోని చంద్రగిరే అన్న విషయం షా కి తెలిసే ఉంటుంది. కాబట్టి చంద్రబాబు సొంతజిల్లాలో 48 గంటలపాటు ఉండే షా ఓ 5 నిముషాలు కేటాయించలేకపోతారా ?

ఢిల్లీలో అంటే ఏదో కారణాలు చెప్పి అపాయిట్మెంట్ నిరాకరించినా ఎవరు కాదనలేరు. కానీ తిరుపతిలో సోమవారం కేవలం పార్టీ నేతలతోనే సమావేశాలున్నాయి. అంటే దాదాపు ప్రైవేటు కార్యక్రమాలనే చెప్పాలి. మరిలాంటి సమయంలోనే చంద్రబాబుకు ఓ 5 నిముషాలు అపాయిట్మెంట్ ఇవ్వటానికి షా కు పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు. షా అపాయిట్మెంట్ కావాలని చంద్రబాబు అడిగినట్లు మీడియాలో ఎక్కడా కనబడలేదు.

ఇపుడు గనుక చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తే షా అపాయిట్మెంట్ కాదనే అవకాశాలు చాలా తక్కువనే అనిపిస్తోంది. మరింతటి బంగారం లాంటి అవకాశాన్ని చంద్రబాబు ఎందుకని వదులుకున్నట్లు ? రాష్ట్రపతి పాలన పెట్టించాలనే విషయంలో చంద్రబాబులో ఆవేశం చల్లారిపోయిందా ? అనే సందేహాలు పెరుగుతున్నాయి. లేదా తాను డిమాండ్ చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదని చంద్రబాబుకు అర్ధమైపోయిందా ?
Tags:    

Similar News