తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో బాబు కొత్త ఎత్తుగడ..

Update: 2021-04-10 04:06 GMT
టీడీపీ అధినేత.. ఏపీ విపక్ష నేత చంద్రబాబు ప్రచారం అన్నంతనే.. తన గురించి తాను గొప్పలు చెప్పుకోవటం. తన రాజకీయ ప్రత్యర్థి మీద విమర్శలు సంధించటం. స్థూలంగా చెబితే.. ఈ రెండు కోణాలే కనిపిస్తాయి. వాస్తవిక కోణంలో ఆయన మాటలు ఉండవన్న విమర్శ వినిపిస్తూ ఉంటుంది. వరుస ఎదురుదెబ్బల నేపథ్యంలో.. తనను తాను మార్చుకోవటంతో పాటు.. తనలోని లోపాల్ని అధిగమించేందుకు బాబు కసరత్తు చేస్తున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తాజాగా జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఆయన తాజాగా నెల్లూరుజిల్లా సర్వేపల్లిలో నియోజకవర్గంలోని పొదలకూరులో రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు.. ప్రస్తావించిన అంశాలు ఆసక్తికరంగానే కాదు.. బాబు కొత్త ఎత్తుగడను నమ్ముకున్నట్లుగా కనిపిస్తోంది. తాను ప్రచారానికి వచ్చింది వైసీపీకి ఎందుకు ఓటు వేయకూడదో చెప్పటానికే అన్న ఆయన.. తన గురించి తాను గొప్పలు చెప్పుకునే కన్నా.. వాస్తవికతను ప్రతిబింబించేలా ఆయన మాటలు ఉన్నాయని చెప్పాలి. తిరుపతి ఉప ఎన్నికల్లో తాము గెలిస్తే.. తానేమీ సీఎంను కానని.. పనబాక లక్ష్మీ గెలిస్తే టీడీపీ అధికారంలోకి రాదని స్పష్టం చేయటం గమనార్హం.

కాకుంటే తమకు ఉన్న ముగ్గురు ఎంపీలకు మరొకరు తోడవుతారని చెప్పారు. పాదయాత్రను చేసిన సందర్భంలో తాను రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని.. ప్రజలకు సంక్షేమ ఫలాల్ని అందిస్తానని పదే పదే చెప్పిన జగన్.. తాను గెలిచిన తర్వాత తాను ఇచ్చిన హామీల్ని మర్చిపోయారన్నారు. జగన్ ను ఓడిస్తే.. ఆయన నేల మీదకు వస్తారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు రౌడీల మాదిరి వ్యవహరిస్తున్నారని.. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారన్నారు.

ప్రజలు తమకు ఎందుకులే అని ఇంట్లో కూర్చుంటే కొంపలు మునుగుతాయని చెప్పారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసిందని.. తమను తప్పు పట్టిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోయారు. పార్టీలో నేతలు.. కార్యకర్తల త్యాగాల్ని చూస్తుంటే బాధ కలుగుతుందని.. వాళ్లందరికి న్యాయం చేయలేకపోయినందుకు బాధ పడుతున్నానని చెప్పారు. మొత్తంగా తన రోటీన్ ప్రసంగాలకు భిన్నంగా బాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. అందరికి ఆకర్షించేలా ఉన్నాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News