కేంద్రానిదో మాట‌, బీజేపీది మ‌రో మాట‌?!

Update: 2021-09-04 03:04 GMT
కేంద్రంలో అధికారంలో ఉన్న‌ది బీజేపీనే, దేశంలో క‌రోనా ప‌రిస్థితుల దృష్ట్యా ఎలా మ‌నుగ‌డ సాగించాలి, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏం చేయాలి, ఏం చేయ‌కూడ‌ద‌నే స‌ల‌హాలు, ఆదేశాలు ఇచ్చేది కేంద్ర ప్ర‌భుత్వ‌మే! మ‌రి అవే ఆదేశాల‌ను, స‌ల‌హాల‌ను అమ‌లు చేస్తే మాత్రం బీజేపీ విమ‌ర్శిస్తుంది! నోటితో న‌వ్వుతూ, నొస‌టితో వెక్కిరించిన‌ట్టుగా ఉంది ఈ వ్య‌వ‌హారం. ఈ అంశాన్ని మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ గ‌ట్టినే ప్ర‌స్తావించారు. కేంద్రం ఏం చెబుతోందో.. కాస్త చ‌దువుకోండ‌య్యా బాబూ అంటూ మ‌హారాష్ట్ర బీజేపీ నేత‌లకు ఆయ‌న చుర‌క‌లు అంటించారు.

మ‌హారాష్ట్ర‌లో దేవాల‌యాల మూత‌ను బీజేపీ తీవ్రంగా త‌ప్పు ప‌డుతూ ఉంది. ఇప్పుడు కాదు.. సెకెండ్ వేవ్ కు ముందు నుంచి కూడా ఇదే వాద‌న‌. అప్ప‌ట్లో మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ కూడా అదే అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన‌ట్టుగా ఉన్నారు. ఆల‌యాల‌ను ఎన్నాళ్ల‌ని మూత వేస్తారంటూ గ‌వ‌ర్న‌ర్ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. అయితే కేంద్రం గైడ్ లైన్స్ ను తాము అనుస‌రిస్తున్న‌ట్టుగా ప్ర‌భుత్వం చెబుతూ ఉంది.

దేశంలో క‌రోనా కేసులు అత్య‌ధికం న‌మోదైన రాష్ట్రం మ‌హారాష్ట్ర‌నే అని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఫ‌స్ట్ వేవ్ లో ప‌తాక స్థాయి కేసులు న‌మోదైన రాష్ట్రం అదే. ఇక సెకెండ్ వేవ్ కు హాట్ స్పాట్ ఇదే. ఇప్ప‌టికీ మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసుల తీవ్ర‌త దేశంలోనే అత్య‌ధికంగా ఉంది. కేర‌ళ త‌ర్వాత మ‌హారాష్ట్ర నుంచినే ఎక్కువ కేసులు వ‌స్తున్నాయి. అంతేనా.. ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం కేసుల సంఖ్య చూస్తే మ‌హారాష్ట్ర వాటానే అత్య‌ధికం! క‌రోనా కార‌ణ మ‌రణాల విష‌యంలో కూడా మ‌హారాష్ట్ర ప్ర‌థ‌మ స్థానంలో ఉంటుంది. ఒక ర‌కంగా చెప్పాలంటే మిగ‌తా దేశ‌మంతా క‌రోనాతో ప‌డిన ఇబ్బందులు ఒక ఎత్తు అయితే మ‌హారాష్ట్ర సామాన్య ప్ర‌జానీకం క‌రోనాతో విల‌విల్లాడిపోవ‌డం మ‌రో ఎత్తు!

క‌ర్ణాట‌క‌, ఏపీ, త‌మిళ‌నాడు వంటి రాష్ట్రాల‌తో పోలిస్తే మ‌హారాష్ట్ర‌లో రెట్టింపు కేసులు  వ‌చ్చాయి. ఈ రాష్ట్రాల్లో అటు ఇటుగా ముప్పై ల‌క్ష‌ల స్థాయిలో ఇప్ప‌టి వ‌ర‌కూ కేసులు రాగా, మ‌హారాష్ట్ర‌లో వ‌చ్చిన కేసుల సంఖ్య ఇప్ప‌టి వ‌ర‌కూ 64 ల‌క్ష‌లు! ఏడాదిన్న‌ర వ్య‌వ‌ధిలో ముప్పై ల‌క్ష‌ల స్థాయి కేసుల‌ను చూసిన రాష్ట్రాల్లోనే ప‌రిస్థితి భయాన‌కం. అలాంటిది ఇదే వ్య‌వ‌ధిలో 64 ల‌క్ష‌ల కేసులంటే మ‌హారాష్ట్రంలో ఉండిన దుర్భర ప‌రిస్థితుల‌ను ఊహించుకుంటేనే భ‌య‌మేస్తోంది.

మ‌రి ఎక్కువ తీవ్ర‌త ఉన్న రాష్ట్రం మ‌రి కొన్నాళ్లు జాగ్ర‌త్త చ‌ర్య‌లు పాటించ‌డంలో త‌ప్పేమీ లేదు. అందులో భాగంగా కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ నే మ‌హా ప్ర‌భుత్వం ఫాలో అవుతున్న‌ట్టుగా ఉంది. ప‌బ్లిక్ గేద‌రింంగ్స్ వ‌ద్దు, మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు, స‌మూహాల‌ను ఏర్ప‌డ‌నీయ‌వ‌ద్దు.. అని కేంద్రం చెబుతోంది. అల‌యాల‌ను మూసి వేయ‌మ‌ని కేంద్రం డైరెక్టుగా చెప్ప‌డం లేదు. అయితే భ‌క్తి, మ‌తం పేరుతో స‌మూహాలు వ‌ద్దంటోంది. మ‌హారాష్ట్ర‌లో ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాలున్నాయి. వాటికి దేశం న‌లుమూల‌ల నుంచి ప్ర‌జ‌లు నిత్యం వెళతారు కూడా. మ‌రి ఇప్పుడు అంతా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తే.. కేసులు పెరిగేది కేవ‌లం మ‌హారాష్ట్ర‌లోనే కాదు, దేశ‌మంతా అల్లుకుపోతుంది కూడా. ఈ ఆందోళ‌న‌తోనే కేంద్రం ఆదేశాల‌ను ఇస్తోంది. అయితే బీజేపీ వాళ్లు మాత్రం ఆల‌యాల‌ను ఎందుకు తెర‌వ‌డం లేదు? అంటూ దీన్నో రాజ‌కీయ అంశంగా మార్చుకుంటున్నారు. వారికి తోడు ఎంఎన్ఎస్ కూడా జ‌త క‌లిసింది. ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్రం గైడ్ లైన్స్ ను చ‌దువుకోండి అంటూ అజిత్ ప‌వార్ ఆ ఆ పార్టీల‌కు సూచించారు. తామేమీ ఆల‌యాల‌ను తెర‌వ‌డానికి వ్య‌తిరేకులం కాద‌ని, అయితే కేంద్రం ఏం చెబుతోందో కాస్త చూసుకోవాల‌ని, ప‌రిస్థితిని అర్థం చేసుకోవాల‌ని ఆయ‌న అంటున్నారు. అయితే ప‌రిస్థితిని అర్థం చేసుకుంటే ప్ర‌తిప‌క్షానికి రాజ‌కీయ అవ‌కాశాలు ఏముంటాయి?
Tags:    

Similar News