కేంద్రం రాష్ట్రాల మీద‌.. రాష్ట్రాలు కేంద్రం మీద విమ‌ర్శ‌లు: ప్ర‌జ‌ల‌కు అన్యాయం కాదా?

Update: 2021-05-31 12:30 GMT
ప్ర‌స్తుతం దేశాన్ని కుదిపేస్తున్న క‌రోనా సెకండ్ వేవ్ రాజ‌కీయ దుమారానికి దారితీసింది. క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు వ్యాక్సిన్ పంపిణీనే కీల‌క‌మ‌ని కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు ప‌దే ప‌దే చెబుతున్నాయి. దీంతో వ్యాక్సిన్ కేంద్రాల వ‌ద్ద‌కు కుప్ప‌లు తెప్ప‌లుగా ప్ర‌జ‌లు చేరుకుంటున్నారు. కానీ, వ్యాక్సిన్ కొర‌త కార‌ణంగా ఇప్ప‌టికీ ఫ‌స్ట్ డోస్ ఇచ్చిన వారికి సెకండ్ డోస్ ఇవ్వ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ప్ర‌జ‌లంతా కూడా కేంద్రంపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.

ఈ ప‌రిస్థితిని హైజాక్ చేసేందుకు బీజేపీ నేత‌లు వ్యూహాత్మ‌కంగా ఎదురు దాడి చేస్తుండ‌డం మ‌రింత వివా దంగా మారుతోంది. ``వ్యాక్సిన్ విష‌యంలో మాకెంత బాధ్య‌త ఉందో రాష్ట్రాల‌కూ అంతే బాధ్య‌త ఉంది!` అని కేంద్రంలో బీజేపీ పెద్ద‌లు చెబుతున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. మాత్రం దీనికి భిన్నంగా ఉన్న‌ద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అంటే.. వ్యాక్సిన్ త‌యారీ నుంచి పంపిణీ వ‌ర‌కు అన్నింటినీ కేంద్రంలోని బీజేపీ పాల‌కులే త‌మ చెప్పు చేత‌ల్లో పెట్టుకున్నారు.

ఈ విష‌యాన్ని ఏపీ ప్ర‌భుత్వం స్ప‌ష్టంగా చెబుతోంది. ఇదే విష‌యాన్ని తెలంగాణ అప్ప‌టి ఆరోగ్య మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కూడా నొక్కి చెప్పారు. వ్యాక్సిన్ ఉత్ప‌త్తి చేసే విష‌యంలో కేంద్రం అన్ని తానై వ్య‌వ‌హ‌రి స్తోంది. అదేవిధంగా.. ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలో కూడా కేంద్ర‌మే నిర్ణ‌యిస్తోంది. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి చేయి దాటే స‌రికి మాత్రం రాష్ట్రాల‌ను ఈ వివాదంలోకి లాగి.. తాము త‌ప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంద‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో కానీ, సామాజిక మాధ్య‌మాల‌లో కానీ.. ఇదే విష‌యాన్ని నెటిజ‌న్లు ఎత్తి చూపు తున్నారు. ``వ్యాక్సిన్ బాధ్య‌త‌ను ఆది నుంచి కేంద్ర‌మే చూస్తున్న‌ప్పుడు.. ఇప్పుడు ఇలా ప్లేట్ ఫిరాయిం చి.. రాష్ట్రాల‌కు కూడా బాధ్య‌త ఉంద‌ని అన‌డం అన్యాయం కాదా?`` అని నిల‌దీస్తున్నారు. వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా నుంచి అన్ని విష‌యాల‌ను కేంద్రం త‌న చేతుల్లో పెట్టుకుని రాష్ట్రాల‌పై నెపం నెట్టేందుకు ప్ర‌య‌త్నించ‌డం స‌బ‌బుగా లేద‌ని అనేవారి సంఖ్య పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

నిజానికి వ్యాక్సిన్ విష‌యంలో రాష్ట్రాల‌కు పంపిణీ బాధ్య‌త మాత్ర‌మే ఉంది. వ్యాక్సిన్ ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రా వంటి కీల‌క బాధ్య‌త అంతా కూడా కేంద్రం చేతిలోనే ఉంద‌నే విష‌యాన్ని నెటిజ‌న్లు ఎత్తి చూపుతున్నారు. కేవ‌లం వ్యాక్సిన్ విష‌యాన్ని రాజ‌కీయం చేయ‌డం త‌ప్ప‌.. మ‌రేమీ లేద‌ని.. దీనివ‌ల్ల ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని వారు పేర్కొంటున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా బీజేపీ పెద్ద‌లు బాధ్య‌త‌గా వ్య‌వ‌హరిస్తారో లేదో చూడాలి.
Tags:    

Similar News