కాలం కలిసి వస్తే తెల్లోళ్ల రాజ్యానికి ప్రధాని అయ్యే మనోడి బ్యాక్ గ్రౌండ్ ఇదే

Update: 2022-07-08 02:35 GMT
అనుకుంటాం కానీ.. తరచి చూస్తే ప్రకృతి కూడా చేయలేని పనుల్ని కాలం చేయగలదు. ఇప్పుడు అలాంటి సన్నివేశమే ఒకటి జరిగే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. వందల ఏళ్లు భారతదేశాన్ని పాలించిన తెల్లోళ్ల రాజ్యానికి మనోడు ఒకడు ప్రధానమంత్రి అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్న సంగతి తెలిసిందే. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం.. ఒకప్పుడు ప్రపంచాన్ని ఎంతలా ఏలిందన్న విషయం తెలియనిది కాదు. అలాంటి దేశానికి ప్రధానమంత్రి కావటానికి మించిన గొప్ప విషయం మరేం ఉంటుంది? అయితే.. ఆ అవకాశం చాలా ఎక్కువగా ఉందన్న అంచనాలు వినిపిస్తున్న పేరు రిషి సునాక్.

ప్రస్తుతం బ్రిటన్ ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్నఆయన.. తాజాగా ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేయనున్న నేపథ్యంలో తదుపరి ప్రధాని ఎవరన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రిషి పేరు బలంగా వినిపిస్తోంది. భారత సంతతికి చెందిన ఇతగాడికి బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇంతకీ ఇతను ఎవరన్న విషయంలోకి వెళితే.. ఇన్ఫోసిన్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె భర్త.. అంటే.. అల్లుడన్న మాట.

ఇంతకీ రిషి సునాక్ ఎవరు? ఆయన పూర్వీకుల బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. బోలెడన్ని ఆసక్తికర అంశాలు వెల్లడవుతాయి. దానికి ముందు రిషి విషయానికి వస్తే.. ఆయన 1980 మే 12న ఇంగ్లండ్ లోని సౌథాంఫ్టన్ లో పుట్టారు. ఆయన పూర్వీకులు పంజాబ్ కు చెందిన వారు. వారు తొలుత తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లి.. తర్వాత పిల్లలతో సహా యూకేకు వచ్చి స్థిరపడ్డారు. సునాక్ తండ్రి యశ్ వీర్ కెన్యాలో.. తల్లి ఉష టాంజానియాలో పుట్టారు. వీరి కుటుంబాలు బ్రిటన్ కు వెళ్లిన తర్వాత వారు పెళ్లి చేసుకున్నారు.

రిషి విషయానికి వస్తే.. స్టాన్ ఫోర్డ్ వర్సిటీ నుంచి ఎంబీఏ చేశారు. పలు సంస్థల్లో ఉద్యోగం చేశారు. ఇదిలా ఉంటే కాలేజీలో చదువుకునే రోజుల్లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో కీలకమైన నారాయణమూర్తి కుమార్తె అక్షతాతో ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారటం.. పెద్దలు వారి ప్రేమకు ఓకే చెప్పటంతో వారు పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కాలేజీలో చదువుకునే రోజసుల్లోనే ఆయన రాజకీయాల మీద మోజు పుట్టింది.

దీనికి కారణం చదువులో భాగంగా చేపట్టిన ఇంటర్నషిప్ గా చెప్పాలి. అప్పట్లో ఆయన కన్జర్వేటివ్ పార్టీలో కొంతకాలం ఇంటర్న్ షిప్ చేశారు. అనంతరం 2014లో రాజకీయాల్లోకి అడుగు పెట్టి.. తర్వాతి ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో రిచ్ మాండ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. ఇదిలా ఉంటే.. 2019లో జరిగిన కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో బోరీస్ జాన్సన్ కు రిషి మద్దతు ఇవ్వటం.. ఆయన ప్రధాని కావటంతో దేశ ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం లభించింది.

బోరీస్ జాన్సన్ కు అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తిగా రిషికి పేరుంది. అతని పని తీరు మెచ్చి రెండేళ్ల క్రితం (2020) ఛాన్సలర్ గా పదోన్నతి కల్పించారు. కేబినెట్ లో పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా ఆయన వ్యవహరించే వీలు దక్కింది. హిందువు అయిన రిషి.. పార్లమెంటులో తన పదవీ ప్రమాణ స్వీకారం వేళ భగవద్గీత మీద ప్రమాణం చేశారు. కరోనా వేళ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే బిలియన్ పౌండ్ల విలువ చేసే అత్యవసర పథకాలను ప్రకటించారు. తన పనితీరుతో అటు పార్టీలోనూ.. ఇటు ప్రజల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న వేళలో.. బోరిస్ జాన్సన్ ఒక పార్టీ నిర్వహించటంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. ఆ సందర్భంగా ఆయన తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపించింది. ఈ సందర్భంగా బోరిస్ దిగిపోవాల్సి వస్తే.. తదుపరి ప్రధాని ఎవరన్న చర్చ జరిగినప్పుడు.. రిషి పేరు పెద్ద ఎత్తున వినిపించటం మొదలైంది. అప్పటి నుంచి దేశ ప్రధానమంత్రి బాధ్యతల్ని చేపట్టే సత్తా ఉన్న వారి లిస్టులో రిషి పేరు చేరిందని చెప్పాలి. విమర్శల విషయానికి వస్తే.. కరోనా వేళ చేపట్టిన పథకాలకు అవసరమైన నిధుల సమీకరణ కోసం కొంతమందిపై పెంచిన పన్నుపోటుపై విమర్శలు ఉన్నాయి. అంతేకాదు.. ధరల పెరుగుదలతోనూ రిషిపై విమర్శలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. మన మూలాలు ఉన్న వ్యక్తి బ్రిటన్ కు ప్రధానమంత్రి అయితే.. అదంతా కాల మహిమగా మాత్రమే చూడాలి.
Tags:    

Similar News