జగన్ ఓ బచ్చా.. రాజకీయాలు తెలియవు: చంద్రబాబు గండ్ర నిప్పులు!

Update: 2022-06-16 12:30 GMT
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కాయి. ఇటీవల రెండు రోజులపాటు నిర్వహించిన మహానాడు సక్సెస్ తో టీడీపీలో జోష్ నెలకొంది. మహానాడుకు లక్షల్లో జనం రావడంతో ఆ పార్టీ ఉత్సాహంతో ఉరకలేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మినీ మహానాడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా చోడవరంలో నిర్వహించిన మినీ మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక బచ్చా అని.. రాజకీయాలు ఏమాత్రం తెలియవని నిప్పులు చెరిగారు. ఈ చెత్త ప్రభుత్వం, పనికిమాలిన ప్రభుత్వం మహానాడు జరగకుండా అడ్డుపడేందుకు ప్రయత్నించిందని మండిపడ్డారు. అయినా సరే రెచ్చిపోయి సత్తా చూపించింది తెలుగుదేశం పార్టీ అని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిందనీ.. అయితే రాష్ట్రం మాత్రం ముప్ఫై ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని తీవ్ర విమర్శలు గుప్పించారు.


చరిత్రలో మొట్టమొదటిసారిగా మహానాడు అయిన తర్వాత జిల్లాల్లో మినీ మహానాడుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ ఏడాది మూడు విధాలుగా చాలా ముఖ్యమైనదని.. చోడవరం నుంచి ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు ప్రారంభిస్తున్నామన్నారు. టీడీపీకి 40 సంవత్సరాలు వయసొచ్చిందనీ.. నలబై ఏళ్లంటే యువతరం అని వ్యాఖ్యానించారు. చోడవరం మినీ మహానాడుతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. మూడేళ్లలో యువతకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదని చంద్రబాబు నాయుడు విమర్శించారు.


మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై కేసులు పెడితే.. ఏం పీక్కుంటారో పీక్కోండని వదిలేశామన్నారు. మమ్మల్ని బెదిరించడం.. మీ వల్ల కాదుకదా.. దేవుడి వల్ల కూడా కాదన్నారు. టీడీపీ అయిపోయిందని కలలుకన్నవారి పని అయిపోయిందనీ.. పార్టీ మాత్రం శాశ్వతమన్నారు. జగన్ ప్రభుత్వం కేసులు పెడితే పార్టీ నేతలకు తోడుగా ఉంటాననీ.. ఎవర్ని ఇబ్బందిపెట్టినా.. వైఎస్సార్‌సీపీ దొంగల గుండెల్లో నిద్రపోతానని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ప్రతి 15 రోజులకోసారి చొప్పున 26 మహానాడులు నిర్వహిస్తామన్నారు. రెండు ఏజెన్సీ జిల్లాల్లో రెండు మహానాడులు నిర్వహిస్తామని తెలిపారు.


బీసీలకు రాజకీయాల్లో గుర్తింపు తీసుకొస్తూ సామాజిక న్యాయం తీసుకొచ్చింది ఎన్టీఆర్‌ అనీ.. వైఎస్సార్‌సీపీ నేతలకు సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. విశాఖని రాజధాని చేస్తానని ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పారన్నారు. రోడ్ల గుంతలకు మట్టి వెయ్యలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతారంటే ప్రజలెవ్వరూ విశ్వసించడం లేదన్నారు. ఒక కిలో మీటరుకు 150 గుంతలున్నాయని వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచేశారని విమర్శించారు.


రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఆనందంగా లేరనీ.. క్రాప్‌ హాలిడే ప్రకటించడం దౌర్భాగ్యమన్నారు. కడపలో కూడా క్రాప్‌ హాలిడే ప్రకటించడం చూసిన తర్వాత.. సీఎం జగన్‌ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ఉత్తుత్తి బటన్‌ నొక్కడం కాదు.. నిజమైన బటన్‌ నొక్కి ప్రజలకు ఫలాలందించకుండా.. తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సాక్షికి ఎప్పటికప్పుడు అడ్వర్టైజ్‌మెంట్లను ఎవడబ్బ సొమ్మని ఇస్తున్నారో చెప్పాలనీ నిలదీశారు. ప్రజల కష్టార్జితాన్ని జగన్‌కి చెందిన పేపర్, టీవీకి కట్టబెట్టేస్తున్నారని విమర్శించారు.


25 వేల మందికి టీచర్ల నియామకాలు చేపట్టకుండా దొడ్డిదారులు వెతుకుతున్నారన్నారు. టీచర్లని బ్రాందీ షాపుల వద్ద క్యూలైన్లలో పెట్టినప్పుడే విద్యావ్యవస్థ పతనమైందని విమర్శించారు. విద్యావ్యవస్థని జగన్‌ నాశనం చేశారని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ రాష్ట్రానికి అరిష్టంగా తయారయ్యారనీ.. ఈయన సీఎంగా ఉన్నంతవరకూ పిల్లలకు ఉద్యోగాలు రావనీ.. ఎవ్వరూ పెట్టుబడులు పెట్టేందుకు రారని ఆరోపించారు. టీడీపీ హయాంలో ఐటీ ఉద్యోగాలిస్తే.. వైఎస్‌ జగన్‌ మాత్రం వలంటీర్‌ ఉద్యోగాలిచ్చారని ఎద్దేవా చేశారు.

 ఇంటికొకరు చొప్పున యువత బయటికి వచ్చి రెండేళ్ల పాటు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయాల నుంచి శాశ్వతంగా బయటకి పంపించేందుకు క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ నినాదంతో ముందుకు పోదామన్నారు.


మద్యంలోనూ జే బ్రాండ్‌ తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్యుఫ్యాక్చరింగ్‌తో పాటు దుకాణాలు కూడా జగన్‌వేననీ.. ప్రతి మద్యం బాటిల్‌లోనూ జగన్‌కు నేరుగా వాటాలు వెళ్లిపోతున్నాయన్నారు.

 జగన్‌కు ప్రజలంటే గౌరవం లేదనీ.. బాధ్యత లేదనీ.. ఒక ఐరన్‌ లెగ్‌గా మారారని వ్యాఖ్యానించారు. ప్రజల్ని బాధపెడితే.. ఆ పాపాలన్నీ తగిలి ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి త్వరలోనే వస్తుందన్నారు. బాదుడే బాదుడు చేస్తున్న ముఖ్యమంత్రిని అందరూ కలిసి బాదుడు కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బాబాయి వివేకాది గుండెపోటు కాదనీ.. గొడ్డలి పోటన్న విషయాన్ని ఇప్పటికైనా జగన్‌ ఒప్పుకోవాలన్నారు. బాబాయిని చంపినవాడు.. నిన్ను, నన్ను వదిలిపెట్టరని వ్యాఖ్యానించారు. సాక్షుల్ని బతకనివ్వకుండా చేస్తారనీ.. సీబీఐ కారు డ్రైవర్‌పై కూడా బాంబులు వేస్తామని బెదిరిస్తారని ఆరోపించారు.

 ఒక దళితుడ్ని హత్య చేసిన ఎమ్మెల్సీకి పాలాభిషేకం చేస్తున్నారనీ.. వారికి ఏ గతి పడుతుందో త్వరలోనే తెలుస్తుందని హెచ్చరించారు. ఈ ఘటనతో రేపు తమని కూడా చంపేసి పోలీసులు నాటకమాడుతారేమోనని ప్రతి దళితుడు భయపడుతున్నారన్నారు. కోనసీమ అల్లర్లు ప్రతిపక్షాలు చేశాయని తప్పుడు కేసులు పెడితే సహించేది లేదన్నారు. పోలీసులు అతిగా ప్రవర్తిస్తే.. రివర్స్‌ పాలనలో రివర్స్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.
Tags:    

Similar News