నీ పంత‌మే ఫైన‌ల్ కాదు.. జ‌గ‌న్ రెడ్డీ: చంద్ర‌బాబు ఫైర్‌

Update: 2022-08-30 12:38 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఫైర‌య్యారు. ``నీ పంత‌మే ఫైన‌ల్ కాదు.. జ‌గ‌న్‌రెడ్డీ!!`` అని వ్యాఖ్యానించారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పును  చంద్రబాబు స్వాగతించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన కొవ్వూరు అర్బన్ బ్యాంకు ఎన్నికలను రద్దు చేసి ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసిన జగన్ రెడ్డికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని విమర్శించారు.

తన పంతమే ఫైనల్ కాదని.. న్యాయ వ్యవస్థనేది ఉందనే విషయం జగన్ రెడ్డి గుర్తించాలని హితవు పలికారు.  వ్యక్తులు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన అధికార వ్యవస్థలను.. జగన్ భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. న్యాయబద్ధంగా జరిగిన ఏ ఎన్నిక ఫలితాన్ని అంగీకరించేందుకు సీఎం సిద్ధంగా లేరనే విషయం.. కొవ్వూరు అర్బన్ బ్యాంకు ఎన్నికతో రుజువైందన్నారు.

ఇప్పటికైనా చట్టాలు, నిబంధనలకు లోబడి పని చేయడం జగన్ నేర్చుకోవాలని సూచించారు. బ్యాంక్ పాలక వర్గం స్థానంలో ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ చట్ట విరుద్ధమని హైకోర్టు తన తీర్పు ద్వారా స్పష్టం చేసిందని చంద్రబాబు పేర్కొన్నారు.

ఏం జ‌రిగిందంటే..

కొవ్వూరు కో ఆప‌రేటివ్ అర్భ‌న్ బ్యాంకుకు పాల‌క మండ‌లిలోని 11 స్థానాల‌కు జూలై 25న ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ మ‌ద్దతు దారులు.. ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. వాస్త‌వానికి ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి తానేటి వ‌నిత ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. దీంతో ఆమెకు ఈ ప‌రిణామం తీవ్ర అవ‌మానంగా భావించిన‌ట్టు వైసీపీలో చ‌ర్చ జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే దీనిపై అధిష్టానం దృష్టి సారించింది. ఈ నెల 26న స‌ద‌రు ఎన్నికైన పాల‌క‌మండ‌లిని ర‌ద్దు చేసింది.

అంతేకాదు.. బ్యాంకు కార్య‌క‌లాపాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు ఇమ్మ‌ణ్ని వీర శంక‌రం, బ‌త్తి నాగ‌రాజు, గాడి విజ‌య రాజ్‌కుమాల‌తో త్రిస‌భ్య క‌మిటీని ఏర్పాటు చేస్తూ.. కొవ్వూరు డివిజ‌న‌ల్‌కో ఆప‌రేటివ్ అధికారి.. ఈ నెల 26న ఉత్త‌ర్వులు జారీ చేశారు. అయితే.. ఈ ఉత్త‌ర్వుల‌పై ప‌లువురు స‌భ్యులు హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో వారికి అనుకూలంగా తీర్పు వ‌చ్చింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News