బాబూ... ఆస్తుల విష‌యం మ‌రిచావా?

Update: 2017-12-05 10:33 GMT
తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌హా ఆయ‌న త‌న‌యుడైన మంత్రి నారా లోకేష్ అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా చేసే ప్ర‌క్ర‌ట‌న‌...`దేశంలోనే మా కుటుంబం ఆద‌ర్శం. రాజ‌కీయాల్లో ఉన్న కుటుంబంగా ప్ర‌తి ఏటా మేం ఆస్తులను వెల్ల‌డిస్తాం` అని చెప్ప‌డం. ప్ర‌తి ఏటా దాదాపుగా సెప్టెంబ‌ర్ మాసంలో జ‌రిగే ఈ ఆస్తుల వెల్ల‌డి ప్ర‌క్రియ ఈ ఏడాది అలాంటి హడావుడి ఏదీ లేకుండానే ఉంది. సెప్టెంబ‌ర్ కాదు క‌దా..అక్టోబ‌ర్‌ - నవంబ‌ర్ ముగిసిపోయి...డిసెంబ‌ర్ మొద‌టివారం గ‌డుస్తున్న‌ప్ప‌టికీ ఇటు బాబు కానీ అటు చిన‌బాబు కానీ...ఆస్తుల వెల్ల‌డించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు.

ఇటీవ‌లి కాలంలో సీఎం చంద్ర‌బాబు ఒకింత రాజ‌కీయ‌ప‌ర‌మైన ఒత్తిడిలో ప‌డిపోయిన సంగ‌తి తెలిసిందే. ఏపీ ప్రతిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌ - పోల‌వ‌రం విష‌యంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వ‌రుస షాక్‌ ల నేప‌థ్యంలో బాబు బాగా బిజీ అయిపోయారు. అయితే ఎంత బిజీలో ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న త‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా చెప్పుకొనే ఆస్తుల ప్ర‌క‌ట‌న‌ను ఎందుకు పెండింగ్లో పెట్టార‌నేది అర్థం కావ‌డం లేదంటున్నారు. సాధార‌ణంగా ఆస్తుల మ‌ధింపు, ఏం చెప్పాలి...ఏం చెప్ప‌కూడ‌దు వంటి ప్ర‌క్రియ‌ల‌న్నీ ఆడిటర్లు చూసుకుంటార‌ని, సంబంధిత ఆస్తుల వివ‌రాలు వాటి య‌జ‌మానులు వాటిని వెల్ల‌డిస్తార‌నేది అంద‌రికీ తెలిసిందే. అయితే ఎందుకు ఇప్ప‌టికీ ఇటు నారా లోకేష్ కానీ..అటు చంద్ర‌బాబు కానీ త‌మ వివ‌రాలు వెల్ల‌డించ‌డం లేద‌ని పలువురు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రోవైపు ఈ ఆస్తుల వెల్ల‌డిపై కొత్త చ‌ర్చ తెర‌మీద‌కు వస్తోంది. గ‌త ఏడాది నారా లోకేష్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌క‌టించిన ఆస్తుల వెల్ల‌డి వివాదంగా మారిన సంగ‌తి తెలిసిందే. లోకేష్ త‌న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నామినేష‌న్ ప‌త్రాల్లో త‌న ఆస్తుల మొత్తం విలువ రూ.330 కోట్లని తెలిపారు. లోకేష్‌ ఆస్తులు కేవ‌లం ఐదు నెల‌ల్లో 23 రెట్లు పెర‌గ‌డం గురించి జాతీయ మీడియాలో ప్ర‌ముఖ‌మైన వాటిలో ఒక‌టైన‌ హిందుస్తాన్ టైమ్స్ ప్ర‌త్యేక క‌థ‌నం రాసింది. ఇంత త‌క్కువ స‌మ‌యంలో 23 రెట్లు పెరగ‌డం మైండ్ బ్లోయింగ్ అని అభివ‌ర్ణించింది. లోకేష్ మొత్తం ఆస్తుల్లో రూ.273.84 కోట్ల విలువైన హెరిటేజ్ షేర్లు కూడా ఉన్నాయి. ఇక స్థిరాస్తులు రూ.18 కోట్లు అని, వార‌స‌త్వంగా వ‌చ్చిన‌వి రూ.38.52 కోట్ల‌ని లోకేష్ చెప్పారు. ఇక త‌న పేరిట రూ.6.27 కోట్ల అప్పులు ఉన్న‌ట్లు వెల్లడించారు. అయితే 2015 అక్టోబ‌ర్‌లో ఆయ‌న వెల్ల‌డించిన ఆస్తుల‌కు, 2016లో ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఇచ్చిన వాటికి అస‌లు పొంత‌న లేద‌ని ఆ క‌థ‌నం పేర్కొంది. 2016లో జ‌రిగిన ఈ వివాదం నేప‌థ్యంలో మార్కెట్ విలువ ప్ర‌కారం ఆస్తులు వెల్ల‌డించాలా లేక‌పోతే...బుక్ వాల్యూ ప్ర‌కారం తెలియ‌జేయాలా అనే విష‌యంలో క్లారిటీ రాక‌పోవ‌డంతోనే..ఈ జాప్యం జ‌రుగుతోంద‌ని అంటున్నారు.

కాగా, 2015 అక్టోబ‌ర్ 19న లోకేష్ తన ఆస్తుల‌ వివ‌రాల‌ను మీడియాకు వివ‌రించారు. అప్ప‌ట్లో త‌న పేరిట ఉన్న ఆస్తుల విలువ‌ను కేవ‌లం రూ.14.5 కోట్లుగా ఆయ‌న చూపించారు. అందులో హెరిటేజ్ షేర్ల విలువ కేవ‌లం రూ.2.52 కోట్లు మాత్ర‌మేన‌ని లోకేష్ చెప్పారు. రూ.1.64 కోట్ల విలువైన ఇత‌ర కంపెనీల షేర్లు, రూ.93 ల‌క్ష‌ల విలువైన కారు, రూ.6.35 కోట్ల అప్పు ఉంద‌ని అప్ప‌ట్లో లోకేష్ తెలిపారు. అనంత‌రం ఎమ్మెల్సీగా ఈసీకి స‌మ‌ర్పించిన ప‌త్రాల్లో ఆస్తులు పెరిగిపోవ‌డంతో వివాదం నెల‌కొంది.
Tags:    

Similar News