మోడీ సర్కార్ మీద రేవంత్ గరం గరం

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వ సారధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గరం గరం అవుతున్నారు

Update: 2025-01-26 22:30 GMT

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వ సారధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గరం గరం అవుతున్నారు. గణ తంత్ర దినోత్సవ వేళ ఆయన ప్రసంగాలు హాట్ హాట్ గా సాగాయి. కేంద్రం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోంది అని ఆయన ఆరోపిస్తున్నారు ప్రతీ ఏటా గణతంత్ర వేడుకల సందర్భంగా కేంద్రం ప్రకటించే పౌర పురస్కారాల విషయంలో తెలంగాణాను అసలు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఏడు పద్మాలు వచ్చాయి. అందులో ఒకటి పద్మవిభూషణ్ అయితే మరొకటి పద్మ భూషణ్. అయిదు పద్మశ్రీలు. ఇక తెలంగాణాకు రెండు పద్మలౌ దక్కితే ఏపీకి అయిదు వచ్చాయి. దీని మీద ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఎంతో మంది ప్రతిభావంతులు పేర్లను సిఫార్సు చేస్తూ తమ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించిందని చెప్పారు. అయినా కేంద్రం పట్టించుకోలేదని అన్నారు. పొరుగున ఉన్న ఏపీకి అయిదు పద్మాలు ఇచ్చారు ఓకే. అందులో ఒకటి తగ్గించి నాలుగు అయినా తెలంగాణాకు ఇవ్వలేకపోయారా అని ప్రశ్నించారు. దీని మీద కేంద్ర ప్రభుత్వానికి త్వరలో లేఖ రాయనున్నట్లుగా ఆయన తెలిపారు.

ఇక చూస్తే మరో అంశం మీద కూడా ఆయన మోడీ ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారు. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకూ నియమించే ఉప కులపతులను ఇక మీదట రాష్ట్రాలతో నిమిత్తం లేకుండా కేంద్రమే నియమించాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. దీని వల్ల రాష్ట్రాల అధికారాలు కేంద్రం లాగేసుకుంటోందని ఆయన ఫైర్ అయ్యారు.

వర్శిటీల విషయంలో రాష్ట్రాల హక్కులను కేంద్రం ఎలా తీసుకుంటుందని ఆయన ద్వజమెత్తారు. యూజీసీల ద్వారా కేంద్రం పెత్తనం చేయడానికి చూడడం తగదని అన్నారు. ఈ మేరకు యూజీసీ రూపొందిస్తున్న కొత్త నిబంధనలు రాజ్యాంగం మీద దాడి చేయడం లాంటిదే అని అన్నారు.

విశ్వవిద్యాలయాలు చైతన్యానికి కేంద్రాలు అని అక్కడ ఉప కులపతులుగా ఎవరిని నియమించాలి అన్నది రాష్ట్రాలు ప్రాంతీయంగా ఆలోచించుకుని తీసుకునే నిర్ణయంగా ఉంటుందని ఆయన చెప్పారు. రాష్ట్రాలకు ఉన్న అధికారాలు తీసుకోవడం సబబేనా అని ఆయన ప్రశ్నించారు.

అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో అధికార విభజన అన్నది స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. ఒక్కోటిగా రాష్ట్రాలకు ఉన్న అధికారాలను కేంద్రం గుంజుకోవాలని చూస్తే ఎలా అని ఆయన నిలదీశారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే రాష్ట్రాలు నామమాత్రం అవుతాయని అన్నారు. దీని మీద సాటి సీఎంలతో కలసి పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తానికి రేవంత్ రెడ్డి కేంద్రం మీద మోడీ ప్రభుత్వం మీద గట్టిగానే గరం గరం అవుతున్నారు.

Tags:    

Similar News