మోడీతో బాబు అలా బేరం ఆడతారా?

Update: 2016-05-13 07:01 GMT
‘‘మీరు మాకు ఆ పదవులు ఇస్తే.. మేం మీకు ఈ పదవులు ఇస్తాం’’ అన్న విషయాన్ని మోడీతో బాబు చెబుతారా? లేక.. బాబుకే మోడీ చెబుతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా 57 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్ననేపథ్యంలో వాటి భర్తీ కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీకి నాలుగు రాజ్యసభ సీట్లు రానున్నాయి. ఇందులో మూడు రాజ్యసభ సభ్యుల్ని ఏపీ అధికారపక్షం సొంతం చేసుకోవటం ఖాయం. నాలుగో సీటును సొంతం చేసుకోవాలంటూ భారీ వ్యూహమే అవసరం అవుతుంది. తమది కాని ఒక్కసీటును చంద్రబాబు వదిలేస్తారా? లేక.. దాన్ని ఏదో విధంగా చేజిక్కించుకోవాలని చూస్తారా? అన్నది ఒక ప్రశ్న అయితే.. తమకు పక్కాగా వచ్చే మూడు రాజ్యసభ సీట్లలోఎవరికి కేటాయిస్తారన్న దానిపై పెద్ద చర్చే జరుగుతుంది.

మూడింటిలో రెండింటి విషయంలో చంద్రబాబు స్పష్టతతో ఉన్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి సుజనా చౌదరికి మరోసారి రాజ్యసభ సభ్యత్వాన్నికట్టబెడతారని.. అందుకు చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. పదేళ్లు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుజనా చేసిన సాయాన్ని బాబు మర్చిపోలేరని.. కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన.. ఏపీకి నిధులు తీసుకురావటంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయన్ను కొనసాగిస్తారే తప్పించి ఆపే అవకాశం లేదని చెబుతున్నారు. ఇక.. మరో సీటును మిత్రపక్షం బీజేపీకి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు టీడీపీ తన కోటాలో ఆమెకు రాజ్యసభ సభ్యత్వాన్ని కొనసాగేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో సంబంధాలు అంత సరిగా లేని సమయంలో సీతారామన్ కు సీటు కేటాయించకుండా నిర్ణయం తీసుకుంటే.. స్నేహానికి కటీఫ్ చెప్పినట్లుగా అవుతుందన్న విషయం తెలిసిందే.

ఇప్పటికిప్పుడు మోడీతో తెగతెంపులు చేసుకోవటానికి చంద్రబాబు సిద్ధంగా లేరన్న సంగతి ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిత్రుడి అవసరాన్ని గుర్తించి చంద్రబాబే స్వయంగా ఆఫర్ చేస్తారా? లేక.. తాము ఇస్తున్న  రాజ్యసభ సభ్యత్వానికి బదులుగా గవర్నర్ పోస్టులను తమ పార్టీ నేతలకు ఇవ్వాలని కోరతారా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. వాస్తవానికి ఎన్డీయేలో భాగస్వామ్యం అయ్యాక కేంద్రం తమకు రెండు గవర్నర్ పదవుల్ని ఇస్తుందని చంద్రబాబు అంచనా వేశారని.. కానీ.. మోడీ అందుకు అవకాశం ఇవ్వలేదన్న మాట వినిపిస్తోంది.

తాజాగా బీజేపీ నేతలకు అవసరమైన నేపథ్యంలో తాము ఇస్తున్న రాజ్యసభ సభ్యత్వానికి బదులుగా గవర్నర్ పోస్టులు అడిగే అవకాశం ఉంది. అదే జరిగితే.. నిర్మల సీతారామన్ ఏపీ అధికారపక్ష కోటాలో రాజ్యసభకు మరోసారి వెళ్లనున్నారు. ఇక.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విషయానికి వస్తే ఆయన్ను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపే అవకాశం ఉందని తెలుస్తోంది.

మూడు రాజ్యసభ సభ్యత్వాలకు సుజనా.. నిర్మలను తీసేస్తే మిగిలిన ఒక స్థానాన్ని ఎవరికి కట్టబెడతారన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. ఉన్న ఒక్క సీటు కోసం భారీ క్యూనే నడుస్తోంది. మాజీలు కొందరు.. సీనియర్లు మరికొందరు.. పదవుల్లో అప్ గ్రేడ్ అయ్యేందుకు ఇంకొందరు ఎవరికి వారు తమకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలన్న కోరికను బాబు ముందు పెట్టినట్లుగా చెబుతున్నారు. రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్న వారి జాబితా చూస్తే.. మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్.. మాజీ ఎమ్మెల్యే హేమలత.. టీజీ వెంకటేశ్.. శిల్పా మోహన్ రెడ్డి..సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (ఎంపీని చేస్తే ఎమ్మెల్సీ పదవికి  రాజీనామా చేస్తానన్నది ఆయన లోగుట్టు మాట)తో పాటు తెలంగాణ తెలుగుదేశం నేతలు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరి.. మూడో సీటును చంద్రబాబు ఎవరికి కేటాయిస్తారన్నది ఒక ఆసక్తికర అంశమైతే.. బీజేపీకి ఒక రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన దానికి బదులుగా గవర్నర్ గిరి తీసుకుంటారా? లేదా? అన్నది మరో ప్రశ్న. వీటికి కాలమే సమాధానం చెప్పాలి.
Tags:    

Similar News