చంద్రబాబు ప్రచారం..యాంటీ సెంటిమెంట్ అయ్యిందా!

Update: 2019-04-16 04:27 GMT
కర్ణాటకలోని మండ్య నియోజకవర్గంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం చేయడంపై విమర్శలు తప్పడం లేదు. మాటెత్తితే తెలుగు వారు.. తెలుగు ఆడబిడ్డలు అనే పార్టీ తెలుగుదేశం. దాని పేరే తెలుగు దేశం. అంటే దేశంలో తెలుగు వారందరికీ బాసటగా నిలిచేది అనే అర్థం అనుకోవాలి. అలాంటి పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు ఒక తెలుగు ఇంటి ఆడపడుచును ఓడించడానికి కర్ణాటక వరకూ వెళ్లటం విడ్డూరంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

సోషల్ మీడియాలో ఈ విషయంలో చంద్రబాబు నాయుడు విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు. సుమలత తెలుగు ఇంటి ఆడపడుచు. ఆమె తన నటన ప్రతిభతో తెలుగులోనే కాకుండా.. పరాయి భాషల్లో కూడా పేరు తెచ్చుకుంది. తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది. ఇక కన్నడీగ ప్రముఖుడిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిలైంది.

అప్పటికీ సుమలత తెలుగు వాళ్లతో సన్నిహిత సంబంధాలే కలిగి ఉన్నారు. స్పష్టమైన తెలుగు మాట్లాడుతూ ఆకట్టుకుంటారామె. అలాంటి తెలుగు ఇంటి ఆడబిడ్డను ఓడించడానికి చంద్రబాబు నాయుడు మండ్యకు వెళ్లి ప్రచారం చేయడం సహజంగానే విమర్శలకు దారి తీస్తోంది.

చంద్రబాబు నాయుడు వెళ్లి మండ్యలో ప్రచారం చేస్తే అక్కడ నిఖిల్ కుమారస్వామికి ఏవో ఓట్లు గంపగుత్తగా పడే పరిస్థితి ఏమీ లేదు. కేవలం తమ ప్రచారానికి హైప్ తెచ్చుకోవడానికే కుమారస్వామి కుటుంబీకులు బాబును అక్కడకు తీసుకెళ్లారు.

ఒకవైపు సుమలత మీద సానుభూతి వెల్లువెత్తుతూ ఉంది. ఇలాంటి సమయంలో ఆమెకు వ్యతిరేకంగా వెళ్లి ప్రచారం చేయడం గురించి చంద్రబాబు నాయుడే పునరాలోచించుకోవాల్సిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందులోనూ అక్కడ సుమలత నెగ్గేలా ఉంది కూడా! ప్రచారానికి వెళ్లే ముందు బాబు ఈ విషయాలను ఆలోచించాల్సి ఉందంటున్నారు.

మరోవైపు చంద్రబాబు నాయుడు ప్రచారం పట్ల సుమలత స్పందిస్తూ.. బాబు ప్రచారం ప్రభావం ఏమీ ఉండదని వ్యాఖ్యానించేశారట. ఇలా తెలుగుదేశం అధినేతను ఆమె లైట్ తీసుకున్నారు. అదీ నిజమే. ఎందుకంటే.. మండ్య అంటే అది డీప్ కర్ణాటక. అక్కడ తెలుగు ప్రభావం పెద్దగా ఏమీ ఉండదు. తెలుగు వాళ్లు కూడా ఎవరూ ఉండరు. అలాంటి చోట బాబు ప్రచారంతో ఒరిగేది కూడా ఏమీ ఉండకపోవచ్చని పరిశీలకులు అంటున్నారు.

  


Tags:    

Similar News