నారా భువనేశ్వరి ఊరికి దశ తిరుగుతోంది

Update: 2016-01-24 06:15 GMT
 కృష్ణా జిల్లాలోని రెండు గ్రామాల అభివృద్ధికి గ్రామీణాభివృద్ధి నిధి (ఆర్‌ డిఎఫ్‌) నుంచి రూ.7.74కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. వీటితో పాటు అనంతపురం జిల్లా హిందూపురం - చిత్తూరు జిల్లా సత్యవేడులకు కూడా ఆర్‌ డిఎఫ్‌ నుంచి రూ.5.90 కోట్లను మంజూరు చేశారు. హిందూపురం - మరో మూడు గ్రామాలకు ఇంతపెద్ద ఎత్తున మొత్తం రూ.13.64 కోట్లు మంజూరు కావడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే... అందుకు కారణమేంటనేది కూడా వెంటనే అందరికీ అర్థమైపోయింది. అవి ముఖ్యమంత్రి కుటుంబీకులు దత్తత తీసుకున్న గ్రామాలు కావడంతో అడిగిందే తడవుగా నిధుల వర్షం కురిపించారు. కారణమేదైనా కానీ గ్రామాలకు పెద్ద మొత్తంలో నిధులు దక్కి అభివృద్ధి చెందడం మంచి పరిణామమే.

ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య భువనేశ్వరి తన అమ్మమ్మ స్వగ్రామమైన పామర్రు మండలంలోని కొమరవోలును, కుమారుడు లోకేష్‌ తన తాత ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరును ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.  భువనేశ్వరి దత్తత గ్రామం కొమరవోలులో రూ.6.94 కోట్లతో, లోకేష్‌ దత్తత గ్రామం నిమ్మకూరు లో రూ.80 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టాలని పంచాయతీ రాజ్‌ ఉన్నతాధికా రులను ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. కొమరవోలులో అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూ.2.08కోట్లు, రెండు వైపులా డ్రెయిన్లకు రూ.3.13 కోట్లు, డొంక రోడ్డు అభివృద్ధికి రూ.45.50 లక్షలు కేటాయించింది. నిమ్మకూరులో వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి మహిళా మండలి కమ్యూనిటీ హాల్‌ వరకు భూగర్భ డ్రెయినేజి ఏర్పాటుకు రూ.20 లక్షలు, అంతర్గత రోడ్లకు రూ.25 లక్షలు, నిమ్మకూరు-భానుపూడి రోడ్డు అభివృద్ధికి రూ.35 లక్షలను కేటాయించారు.

కాగా ప్రభుత్వం ఇలా గ్రామాలకు కోట్లాది రూపాయలు మంజూరు చేస్తే, గ్రామాల దత్తతకు జోరుగా ముందుకొచ్చేవారుంటారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సినీ హీరో - చంద్రబాబు వియ్యంకులు బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం హిందూపురానికి రూ.4.45 కోట్లను, సిఎం సొంత జిల్లా చిత్తూరు పరిధిలోని సత్యవేడు నియోజకవర్గంలోని రోడ్లకు రూ.1.45ను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రముఖులు దత్తత తీసుకుని లాబీయింగ్ చేయడం వల్లనైనా గ్రామాలకు నిధులొచ్చి అభివృద్ధి చెందితే మంచిదే మరి.
Tags:    

Similar News