బాబు ప్లాన్ బీ!... రాయ‌పాటికి ఇక ఎర్తే!

Update: 2017-12-14 05:56 GMT
ఏపీకి జీవ‌నాడిగా ప‌రిగ‌ణిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టుపై ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు చెబుతున్న‌ట్లుగా ఈ ప్రాజెక్టు వ‌చ్చే ఏడాది చివ‌రి నాటికి పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన త‌ర్వాతే 2019 ఎన్నిక‌ల్లో ఓట్లు అడిగేందుకు వ‌స్తామ‌ని కూడా చంద్ర‌బాబు అండ్ కో గ‌తంలో కాస్తంత ఘ‌నంగానే ప్ర‌క‌టించింది. అయితే ఈ ప్రాజెక్టు ప‌నులు చేప‌డుతున్న ట్రాన్స్‌ ట్రాయ్ కంపెనీ నిర్వాకం కార‌ణంగా... బాబు అండ్ కో హామీ దాదాపుగా సాకార‌మ‌య్యే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలో 2018 ఏడాదికి బ‌దులుగా ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేస్తామ‌ని టీడీపీ నేత‌లు కొత్త మాట అందుకోగా... అస‌లు చంద్ర‌బాబు నోట నుంచి మాత్రం ఈ ప్రాజెక్టును ఎప్ప‌టికి పూర్తి చేస్తామ‌న్న మాట మాత్ర వినిపించ‌డం లేదు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయ‌డం త‌న జీవితాశ‌యంగా పేర్కొంటున్న చంద్ర‌బాబు... ప్రాజెక్టు పూర్తి చేయ‌డం త‌న బాధ్య‌తేన‌ని ఒప్పుకుంటూనే... ప్రాజెక్టు నిర్మాణం నిర్దేశిత స‌మ‌యంలోగా పూర్తి కాక‌పోతే మాత్రం దానికి తాను బాధ్యుడిని కాద‌ని ఓ స‌రికొత్త వ్యూహానికి తెర తీశారు. వాస్త‌వానికి చంద్రబాబు స‌ర్కారు ప్రాజెక్టును యుద్ధప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని సంక‌ల్పిస్తున్నా... వేర్వేరు కార‌ణాలు అందుకు అడ్డం ప‌డుతున్న వైనం ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌లంద‌రికీ దాదాపుగా తెలిసిన‌ట్టేన‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఆ ప‌రిస్థితుల‌న్నింటినీ ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్న చంద్ర‌బాబు... త‌న ప్లాన్ బీ మంత్రాన్ని మాత్రం ప‌క్కాగా అమ‌లు చేస్తున్నార‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో బాబు అమ‌లు చేస్తున్న‌ ఈ ప్లాన్ బీ వ‌ర్క‌వుట్ అయితే... ఎక్క‌డ త‌మకు చెడ్డ పేరు వ‌స్తుందోన‌న్న భ‌యం కేంద్రంలో అధికారంలో ఉన్న న‌రేంద్ర మోదీ స‌ర్కారులో వ‌చ్చిన‌ట్లుగానే క‌నిపిస్తోంది.

ఈ క‌థాక‌మామీషు ఏమిట‌న్న విష‌యంలోకి వెళితే... పోల‌వ‌రం  ప‌నుల‌ను తామే చేస్తామ‌ని గ‌తంలో మోదీ స‌ర్కారుతో చంద్రబాబు పెద్ద ఎత్తునే లాబీయింగ్ చేశారు. మిత్ర‌ప‌క్ష పార్టీ అధినేత‌గా చంద్రబాబు ప్ర‌తిపాద‌న‌కు మోదీ స‌ర్కారు కూడా ఓకే చెప్పేయ‌డంతో ఆ ప‌నుల‌ను కాస్తా... టీడీపీ ఎంపీ - సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త అయిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కుటుంబం ఆధ్వ‌ర్యంలోని ట్రాన్స్‌ ట్రాయ్‌ కి అప్ప‌జెప్పేశారు. అయితే బాబు అనుకున్న రేంజిలో పోల‌వ‌రం ప‌నుల‌ను ప‌రుగులు పెట్టించ‌డంలో ట్రాన్స్‌ ట్రాయ్ చ‌తికిల‌బ‌డిపోయింది. ఈ నేప‌థ్యంలో ప్రాజెక్టు పూర్తి కాక‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్క‌డ త‌మ పుట్టి మునుగుతుందోన‌న్న భ‌యంతో చంద్ర‌బాబు స‌ర్కారు... ట్రాన్స్‌ ట్రాయ్‌ కు రాంరాం చెప్పేందుకు ప‌థ‌కం ప‌న్నింది. అయితే కేంద్ర స్థాయిలో మంచి ప‌లుకుబ‌డి ఉన్న రాయ‌పాటి... చంద్రబాబు స‌ర్కారు య‌త్నాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు నిర్వీర్యం చేస్తూ వ‌చ్చింది. అయితే రాయ‌పాటి మంత్రాంగానికి చెక్ పెడుతూ చంద్ర‌బాబు స‌ర్కారు ఓ పెద్ద సాహ‌సానికే తెర తీసింద‌ని చెప్పాలి. పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి కాకుంటే... ఆ నెపం త‌నది కాద‌ని - ఈ ప‌నుల్లో ఎప్ప‌టిక‌ప్పుడు వేలు పెడుతూ... నిధుల విడుద‌ల‌లో కూడా తీవ్ర జాప్యం చేస్తున్న మోదీ స‌ర్కారుదేన‌ని ఓ ప్ర‌చారానికి శ్రీ‌రాకం చుట్టింది. ఇందులో భాగంగా పోలవ‌రం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఎప్పెడెప్పుడు ఎంతెంత నిధులు విడుద‌ల‌య్యాయ‌న్న వివరాల‌న్నీ ప్ర‌జ‌ల‌కు తెలిసేలా ఆన్‌ లైన్‌ లో పెట్టాల‌ని బాబు కాస్తంత సంచ‌ల‌న నిర్ణ‌య‌మే తీసుకున్నారు. ఈ ప్లాన్ బాగానే ప‌నిచేసిన‌ట్టుంది. విష‌యం తెలుసుకున్న వెంట‌నే చాలా వేగంగా స్పందించిన కేంద్రం... సీనియ‌ర్ మంత్రి నితిన్ గడ్క‌రీని రంగంలోకి దించేసింది.

ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు నుంచి వెళ్లిన ఓ ఫోన్ కాల్‌ ను ఆస‌రా చేసుకుని స‌రికొత్త మంత్రాంగం నెర‌పిన గ‌డ్క‌రీ... త‌న‌ను క‌లిసేందుకు వేచి చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని - వీల‌యితే ఉన్న ప‌ళంగానే బ‌య‌లుదేరి రావాల‌ని బాబుకు క‌బురు పెట్టారు. ఈ క‌బురుతో కాస్తంత ఉత్సాహం వ‌చ్చేసిన చంద్ర‌బాబు నిన్న హుటాహుటీన ఢిల్లీ ఫ్లైటెక్కేశారు. రాత్రి 7.30 గంట‌ల‌కు గ‌డ్క‌రీతో మొద‌లైన బాబు భేటీ దాదాపు రాత్రి 11.30 గంట‌ల వ‌ర‌కు నాన్ స్టాప్‌ గా న‌డిచింది. ఈ భేటీలో చంద్ర‌బాబు త‌న‌దైన మంత్రాంగంతో కేంద్రాన్ని దారికి తెచ్చుకున్నార‌నే చెప్పాలి. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు చాలా నిదానంగా న‌డుస్తున్నాయ‌ని, ఇలా జ‌రిగితే నిర్దేశిత స‌మ‌యంలోగా ప‌నులు పూర్తి కావ‌డం సాధ్యం కాద‌ని చెప్పిన చంద్ర‌బాబు... కాంట్రాక్ట‌ర్‌ ను మారిస్తే త‌ప్పించి ఫ‌లితం ఉండ‌బోద‌ని తేల్చి చెప్పారు. దీనికి త‌లూపిన గ‌డ్క‌రీ.. ఓ నెల గ‌డువు పెడ‌దామ‌ని - అప్ప‌టికీ ప‌నుల్లో వేగం లేక‌పోతే ట్రాన్స్‌ ట్రాయ్‌ ని త‌ప్పిద్దామ‌ని చెప్పార‌ట‌. అంటే ప‌నుల్లో వేగం లేక‌పోతే... ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ పోల‌వ‌రం ప‌నుల నుంచి త‌ప్పుకోక త‌ప్ప‌ద‌న్న మాట‌. ప‌నుల నుంచి ఆ కంపెనీని పూర్తిగా త‌ప్పించ‌లేకున్నా... ముఖ్య‌మైన ప‌నుల‌ను ఇత‌ర కంపెనీల‌కు ఇచ్చే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇదే జ‌రిగితే... రాయ‌పాటి ఇప్ప‌టిదాకా నెర‌పిన‌ మంత్రాంగం మొత్తం బ‌ద్ధ‌లైపోయిన‌ట్టేన‌న్న వాద‌న వినిపిస్తోంది. కేంద్రం త‌న దారికి వ‌చ్చిన విష‌యాన్ని గుర్తించిన చంద్ర‌బాబు ప‌నిలో ప‌నిగా... పోల‌వ‌రం పెరిగిన అంచ‌నాల‌ను కూడా ప్ర‌స్తావించేసి... పెరిగిన అంచ‌నాల మేర‌కే నిధులు మంజూర‌య్యేలా సూత్ర‌ప్రాయ అంగీకార‌మైతే పొందార‌ట‌. అంటే... సింగిల్ ప్లాన్‌ తో బాబు... కేంద్రం వ‌ద్ద రెండు ప‌నుల‌ను ఒక్క భేటీలో ముగించేసుకున్నార‌న్న మాట‌.
Tags:    

Similar News