ఓటుకు నోటు.. 50 లక్షలిచ్చింది బాబేనా?

Update: 2019-03-08 05:52 GMT
తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు నోటు వ్యవహారంలో కొత్త వీడియో బయటకు వచ్చింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను  టీడీపీ అనుయాయులు రేవంత్ రెడ్డి - సెబాస్టియన్ లు కలిసి టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు కొనుగోలు చేసే ప్రయత్నం బయటపడడం సంచలనమైన సంగతి తెలిసిందే.. వీడియోల్లో అడ్డంగా బుక్కవడంతో తీవ్ర దుమారం రేపింది. ఈ ఓటుకు నోటు ప్రకంపనలు మళ్లీ తాజాగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా వీడియో బయటకు రావడంతో చంద్రబాబు మరోసారి ఇరుకునపడ్డారు.

*రూ.5 కోట్లకు బాబును ఒప్పించా..

11 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ప్రలోభ పెట్టేందుకు తీసుకొచ్చిన రూ.50లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాలను చెప్పారు. చంద్రబాబు మొదట ఈ డీల్ లో రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారని.. కానీ తాను చివరకు బాబును ఒప్పించి రూ.5 కోట్లకు ఒప్పించానని నిందితుడు సెబాస్టియన్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్య వీడియోలో రికార్డు అయ్యింది. రూ.50లక్షలు టేబుల్ మీద పెట్టి రేవంత్ వెళ్లిపోగా.. అనంతరం తనకు ఈ డీల్ లో రావాల్సిన వాటా గురించి స్టీఫెన్ సన్ తో సెబాస్టియన్ మంతనాలు జరిపారు.  తనకు పర్సంటేజీ ఇవ్వాలని స్టీఫెన్ సన్ ను కోరారు.  వీడియో నాలుగో నిమిషంలో ఓటుకు నోటు సూత్రధారి పేరు సెబాస్టియన్ వెల్లడించడం విశేషం.

*వీడియోలో బాబు పేరు..

ఈ 11 నిమిషాల వీడియోలో సెబాస్టియన్ - రేవంత్ రెడ్డి ఇద్దరూ ‘బాబు’ - బాస్ గురించే పదేపదే ప్రస్తావించారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ఓటు వేస్తే మధ్యవర్తుల ద్వారా స్టీఫెన్ సన్ కు ఇవ్వాల్సిన డబ్బును ‘బాబు’ సమకూర్చుతాడని ఆ ఇద్దరు స్పష్టంగా పేర్కొన్నారు.

* కీలక సాక్ష్యంగా తాజా వీడియో

ఈ ఓటుకు నోటు కేసు నమోదై నాలుగేళ్లు అవుతున్నా ఈ కేసు అతీగతీ తేలలేదు. స్టీఫెన్ సన్ కు ఇచ్చిన రూ.50లక్షలపై ఈడీ - ఐటీ - ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ఓటుకు నోటు కేసులో ఇప్పుడు అత్యంత కీలకమైన సాక్ష్యాధారాలతో తాజా వీడియో రిలీజ్ అయ్యింది. ఇప్పటివరకు వెలుగుచూడని.. అంతుచిక్కని వ్యవహారాలకు ఈ తాజా వీడియోలో ఆధారాలున్నాయి. స్టీఫెన్ సన్ కు ఇచ్చిన రూ.50లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాలున్నాయి. బాబు 3.5 కోట్లే అన్నారని.. తాను 5కోట్లకు పెంచానని.. 50 లక్షలు అడ్వాన్స్ గా తెచ్చానని సెబాస్టియన్ అనడం వీడియోలో రికార్డు అయ్యింది. ఈ వీడియో నాలుగో నిమిషంలో ‘ఓటుకు నోటు’ సూత్రధారి పేరును సెబాస్టియన్ పలకడం పోలీసులకు కీలక ఆధారంగా కనిపిస్తోంది.

*మరో ఫోన్ వీడియో సాక్ష్యమే కీలకం

ఓటుకు నోటు డీల్ ను తార్నకలోని మాల్కమ్ టేలర్ నివాసంలో రేవంత్ - సెబాస్టియన్ సెట్ చేశారు. స్టీఫెన్ సన్ కు అక్కడే 50 లక్షలు ఇచ్చారు. అయితే ఇక్కడ తెలంగాణ పోలీసులు వలపన్ని కెమెరాలు ఏర్పాటు చేశారు.  ఏసీబీ కెమెరాలు కదలకుండా రికార్డు చేయగా..ఒక వ్యక్తి జేబులోని ఫోన్ లో కీలక తతంగం అంతా రికార్డు అయ్యింది. అదే ఇప్పుడు తాజాగా రిలీజ్ అయ్యింది. కీలక సంభాషణలు - ఆధారాలు ఈ వీడియో ఉన్నాయి. డీల్ కుదరడం.. నగదు ఇవ్వడం.. ఎవరు వెనుకున్నారన్నది వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

*ఓటుకు నోటు నేపథ్యమిదీ..

2015 జూన్ లో తెలంగాణ శాసనమండలి ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యే కోటాకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ నుంచి వేం నరేందర్ రెడ్డి నిలబడ్డారు. ఆయన గెలుపు కోసం టీడీపీ.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను రూ.5 కోట్లకు ప్రలోభ పెట్టింది. దీన్ని పసిగట్టిన టీఆర్ ఎస్ సర్కారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీన్ని వీడియోల్లో చిత్రీకరించారు. ఇప్పుడు తాజాగా ఓ వ్యక్తి ఫోన్ లో రికార్డు చేసిన వీడియో బయటపడింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ అరెస్ట్ అయ్యి బెయిల్ పై విడుదలై విచారణ ఎదుర్కొంటున్నారు. వేం నరేందర్ రెడ్డి, అతని కుమారుడితోపాటు ఉదయసింహ కేసు విచారణను ఎదుర్కొంటున్నారు.  టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు., కీలకసాక్షిగా మాల్కం టేలర్  ఉన్నారు.


Full View

Tags:    

Similar News