గెలుపంటే ఇలా ఉండాలి బాబు

Update: 2016-01-13 05:40 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఆ రాష్ర్ట ప‌రిపాల‌నపై పెట్టిన ప్ర‌త్యేక శ్ర‌ద్ధ ఫలిస్తోంది. ఏపీని పెట్టుబ‌డుల వేదిక‌గా తీర్చిదిద్దే క్ర‌మంలో చంద్ర‌బాబు విశాఖలో మూడు రోజులపాటు సీఐఐ ఆధ్వర్యంలో భాగస్వామ్య సదస్సు నిర్వ‌హించారు. ఈ స‌ద‌స్సు ముగిసే లోగానే ఫ‌లితాలు ఆచ‌ర‌ణ రూపంలో క‌నిపించడం విశేషం.

మూడు రోజుల సదస్సులో 41 దేశాల నుంచి 1400 మంది ప్రతినిధులు, ఆయా దేశాల వాణిజ్యశాఖ మంత్రులు, పెద్ద ఎత్తున పారిశ్రామిక‌వేత్తలు పాల్గొన్నారు. మొత్తం నాలుగు లక్షల 78 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. ఆంధ్రను పారిశ్రామిక హబ్‌ గా రూపుదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర‌ - రాష్ర్ట ప్ర‌భుత్వాల త‌ర‌ఫున మంత్రులు - ఏపీ ముఖ్య‌మంత్రి తెలియచేయ‌డం పారిశ్రామిక‌వేత్త‌ల‌ను ఆక‌ట్టుకుంది. ఈ క్ర‌మంలో విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం సెజ్ (ప్రత్యేక ఆర్థికమండలి)లో చైనాకు చెందిన ట్రైనాసోలార్ ఇండియా లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్న సోలార్ ప్యానళ్ల తయారీ పరిశ్రమకు భూమిపూజ జరిగింది. సుమారు 95 ఎకరాల్లో 3వేల కోట్లతో ఏర్పాటు కానున్న ఈ కంపెనీలో ప్రత్యక్షంగా 3వేల ఐదువందల మందికి, పరోక్షంగా మరో మూడువేల ఐదువందల మందికి మొత్తం 7వేల మందికి ఉపాధి దొరుకుతుంది.

దేశంలోనే తొలి సోలార్ ప్యానళ్ల తయారీ పరిశ్రమ సెజ్‌ లో ఏర్పాటు కానుండటం ఇందులో మొద‌టి విశేషం కాగా.. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో చైనా కంపెనీ కుదుర్చుకున్న ఎంఓయు మేరకు 24 గంటల్లోనే కంపెనీ నిర్మాణానికి భూమిపూజ చేయ‌డం మ‌రో విశేషం. పెట్టుబ‌డుల ఒప్పందం కుదుర్చుకున్న మ‌రుస‌టి రోజే, అది కూడా ఏ స‌ద‌స్సు  కేంద్రంగా అయితే ఒప్పందం జ‌రిగిందో ఆ కార్య‌క్ర‌మం కూడా ముగియ‌క‌ముందే....క్షేత్ర‌స్థాయిలో 3వేల కోట్ల రూపాయ‌ల ప‌నులు ప్రారంభం కావ‌డం బాబు విజ‌యంగా పారిశ్రామిక‌వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. ఇదే దూకుడుతో ఏపీ కోసం మ‌రిన్ని ప్రణాళిక‌లు, ఆచ‌ర‌ణ‌లు సిద్ధం చేయాల‌ని ఆకాంక్షిస్తున్నాయి.
Tags:    

Similar News