గవర్నర్ కు చంద్రబాబు చురక

Update: 2015-10-06 11:30 GMT
ఉమ్మడి రాష్ట్ర గవర్నరు నరసింహన్ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గతంలో ఏపీలో మంత్రులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.... ఆ తరువాత చంద్రబాబు జోక్యంతో మంత్రులెవరూ ఆయన ఊసెత్తలేదు. కానీ, ఏపీ ప్రభుత్వం - గవర్నరు మధ్య సంబంధాలు మాత్రం అంతంత మాత్రంగా మారాయి. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల వరుసగా గవర్నరులో భేటీ అవుతున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీలో అనుకోకుండా గవర్నరును కలిశారు... ఆ తరువాత ఢిల్లీలోనే ఆయన గవర్నరుకు చిన్నపాటి కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగపరంగా ఉన్నతస్థానంలో ఉన్న గవర్నరుపై చంద్రబాబు కౌంటర్ వేయడం చాలామందికి ఆశ్చర్యంగా ఉన్నా... చంద్రబాబు అలా చేయడానికి అవకాశం లేదని అనుకున్నా కూడా అది నిజం... అయితే... అందుకు గవర్నరు తీరే కారణమని.. అంతకుముందు గవర్నరు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే చంద్రబాబు చురకేశారని తెలుస్తోంది.

ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రాజధాని శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు. అదే సమయంలో, ఏపీ భవన్‌లో బస చేసిన గవర్నర్ నరసింహన్‌ ను కూడా చంద్రబాబు కలిశారు. ఆ తరువాత ఆయన విలేకరులతో మాట్లాడినప్పుడు... గవర్నరు ప్రస్తావన వచ్చింది. దీంతో చంద్రబాబు గవర్నరును కూడా ఆహ్వానించామని... ఆయన లేకుండా శంకుస్థాపన ఎలా జరుగుతుందని అన్నారు. అయితే... ఆ మాట అన్నప్పుడు ఆయన టోన్ లో చిన్నపాటి వ్యంగ్యం కనిపించిందని ఢిల్లీ మీడియా వర్గాలు చెబుతున్నాయి. దానికి కారణం కూడా వారే విశ్లేషిస్తున్నారు... అంతకుముందు గవర్నర్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానిస్తే రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తానని అన్నారు. ఆయన అంత పుల్లవిరుపుగా అనడం వల్లే చంద్రబాబుకు కోపమొచ్చిందని... అందుకే ఆయన పరోక్షంగా గవర్నరుకు చురక వేశారని తెలుస్తోంది.
Tags:    

Similar News