విశాఖ స‌మ్మిట్ ల‌క్ష్యం ఎంతంటే...!

Update: 2017-01-25 06:13 GMT
రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తీవ్ర ఆర్థిక లోటులో చిక్కుకున్న న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ కు విరివిగా పెట్టుబడులు రాబ‌ట్ట‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న‌ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు త‌న‌దైన మార్కు ప‌నితీరుతో జ‌నాన్ని అయోమ‌యంలోకి నెట్టేస్తున్నారు. గ‌తేడాది సాగ‌ర న‌గ‌రం విశాఖ కేంద్రంగా జ‌రిగిన సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు ద్వారా రూ.5 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు రాబ‌ట్టామ‌ని బాబు స‌ర్కారు గొప్ప‌లు చెప్పుకుంది. ఈ మేర‌కు ఆయా పారిశ్రామిక సంస్థ‌లతో ప‌క్కా ఒప్పందాలు కూడా చేసుకున్నామ‌ని కూడా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇక నిరుటి స‌మ్మిట్‌ లో కాళ్ల‌కు చ‌క్రాలు క‌ట్టుకున్న చందంగా... పెద్దా - చిన్నా అనే తేడా లేకుండా ప్ర‌తి ఒప్పందంలో తానుండాల‌న్న తాప‌త్ర‌యంతో చంద్ర‌బాబు చేసిన హ‌డావిడి అంతా ఇంతా కాదు. అయితే ఆ ఒప్పందాల్లో ఇప్ప‌టిదాకా ఎంత‌మేర కార్య‌రూపం దాల్చాయ‌న్న విష‌యంపై నోరు విప్పేందుకు మాత్రం చంద్ర‌బాబు స‌ర్కారు సాహ‌సం చేయ‌డం లేదు. ఈ విష‌యంపై జ‌నానికి వివ‌రాలు అందించ‌కున్నా... స‌ద‌స్సు మొత్తాన్ని ప‌ర్య‌వేక్షించే సీఐఐకి అయినా వివ‌రాలివ్వాలిగా.

అయితే ఇప్ప‌టిదాకా చంద్ర‌బాబు స‌ర్కారు నుంచి సీఐఐకి అలాంటి స‌మాచార‌మేదీ అంద‌లేద‌ట‌. ఈ విష‌యం ఏ విపక్ష‌మో చెబుతున్న మాట కాదు... సాక్షాత్తు సీఐఐ ఏపీ చైర్మ‌న్ శివ‌కుమార్ చెబుతున్న మాట‌. నిన్న ఓ తెలుగు దిన‌ప‌త్రిక‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. గ‌తేడాది జ‌రిగిన స‌మ్మిట్లో రూ.5 ల‌క్ష‌ల కోట్ల మేర పెట్టుబ‌డుల‌ను సాధించామ‌ని ప్ర‌భుత్వం చెబుతుంటే... శివ‌కుమార్ ఈ నెంబ‌రును రూ.4.65 ల‌క్ష‌ల కోట్లుగా చెప్పేశారు. అంతేకాకుండా ఈ ఒప్పందాల్లో కార్య‌రూపం దాల్చిన‌వెన్ని అన్న విష‌యంపై శివ‌కుమార్ చేసిన వ్యాఖ్య‌లు బాబు స‌ర్కారుకు పెద్ద దెబ్బేన‌ని చెప్పాలి. మొత్తం ఒప్పందాల్లో ఎంత మేర కార్య‌రూపం దాల్చాయో త‌న‌కు తెలియ‌ద‌ని, అయితే త‌న‌కు తెలిసినంత‌వ‌ర‌కు... కార్య‌రూపం దాల్చిన ఒప్పందాల శాతం 40కి లోపే ఉంటుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. మ‌రో రెండు రోజుల్లో నిరుటి త‌ర‌హాలోనే విశాఖ‌లోనే సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఏర్పాట్ల‌న్నీ పూర్తి అయిపోయాయి. ఈ నెల 27 - 28 తేదీల్లో జ‌రిగే ఈ స‌ద‌స్సు కోసం రేప‌టి నుంచి చంద్ర‌బాబు త‌న మ‌కాంను విశాఖ‌కు మార్చ‌నున్నారు. మూడు రోజుల పాటు ఆయ‌న అక్క‌డి నుంచి క‌ట్టుక‌ద‌ల‌రు.

ఇక ఈ స‌మ్మిట్ ల‌క్ష్యం విష‌యానికి వ‌స్తే... ఇప్ప‌టికే ఏపీ ప్ర‌భుత్వంలోని ప‌లు విభాగాలు అంచ‌నాల‌తో సిద్ధ‌మైపోయాయి. ఆయా శాఖలు కాస్తంత క్లారిటీగానే ముందుకు వెళుతున్నా... బాబు కేబినెట్‌ లోనే ఈ విష‌యంపై అంతగా స్ప‌ష్ట‌త లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ సద‌స్సు ద్వారా రూ.6 ల‌క్ష‌ల కోట్ల మేర పెట్టుబడులు రాబ‌ట్టాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లుగా నిన్న చంద్ర‌బాబు స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అయితే ఓ మూడు రోజుల క్రితం విశాఖ కేంద్రంగా మీడియాతో మాట్లాడిన మంత్రి గంటా శ్రీనివాస‌రావు మాత్రం ఈ ల‌క్ష్యాన్ని రూ.8 ల‌క్ష‌ల కోట్లుగా పేర్కొన్నారు. ఇక నిన్న‌టి ఇంట‌ర్వ్యూలో సీఐఐ ఏపీ చైర్మ‌న్ శివ‌కుమార్‌ ఈ ల‌క్ష్యం రూ.7 ల‌క్ష‌ల కోట్ల‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌భుత్వం అందించిన నివేదిక‌ల ఆధారంగానే శివ‌కుమార్ ఈ మాట చెప్పి ఉంటారు. అంటే... ఏపీ ప్ర‌భుత్వంలోని ప‌లు కీల‌క శాఖ‌లు అందించిన వివ‌రాల ఆధారంగానే శివ‌కుమార్ ఈ లెక్క చెప్పి ఉంటార‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి చంద్ర‌బాబు, గంటాలు ఏ లెక్క‌న రూ.6 ల‌క్ష‌ల కోట్లు, రూ.8 ల‌క్ష‌ల కోట్ల‌ని చెప్పుకొచ్చారో ఏ ఒక్కరికీ అంతుబ‌ట్ట‌డం లేదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News