సీమ ఆగ్ర‌హాన్ని చ‌ల్లార్చేందుకు బాబు కొత్త స్కెచ్

Update: 2019-02-17 09:45 GMT
ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అద్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు త‌మ ద‌గ్గ‌రున్న అస్త్రాల‌న్నింటినీ వ‌దులుతున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఓ వైపు వ‌రాల వాన కురిపిస్తూనే...మ‌రోవైపు కీల‌క నిర్ణ‌యాలు సైతం ప్ర‌క‌టిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ర‌గులుతున్న‌ రాయ‌ల‌సీమ సెంటిమెంట్‌ ను స‌ద్దుమ‌ణిగించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. రాయలసీమ చిరకాల వాంఛ హైకోర్టు బెంచ్‌ మంజూరు కానుంది. కర్నూలు పట్టణంలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తూ అధికారికంగా ప్రభుత్వం తొందరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో హైదరాబాద్‌ కేంద్రంగా హైకోర్టు కార్యకలాపాలు నడుస్తున్న సమయంలోనే రాయలసీమ ప్రాంత ప్రజలు బెంచ్‌ కోసం ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. అప్పట్లో రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల నుంచి ప్రజల ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వాలు కూడా వెనుకడుగు వేయాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిలో హైకోర్టును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో బెంచ్‌ కోసం అక్కడి న్యాయవాదులు, ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆందోళన చేస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో ఇది తారాస్థాయికి చేరింది.అయితే, కొద్దికాలం క్రితం వ‌ర‌కు ఈ ఆకాంక్ష‌పై పెద్ద‌గా స్పందించ‌ని ప్ర‌భుత్వం తాజాగా అదికారిక నిర్ణ‌యం తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం.

రాయ‌ల‌సీమ వాసుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం హైకోర్టు బెంచ్‌ ని కర్నూలు పట్టణంలో ఏర్పాటుకు నిర్ణయించుకొని విధి విధానాలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. తొందరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. కాగా, ఎన్నిక‌ల స‌మ‌యంలో సాగుతున్న ఈ క‌స‌ర‌త్తు ప్ర‌స్తుతం వ్య‌క్త‌మ‌వుతున్న ఆగ్ర‌హ‌జ్వాల‌ను స‌ద్దుమ‌ణిగించేందుకేన‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News