చైనా మాటలతో పాక్ దిమ్మతిరిగిందా?

Update: 2016-09-26 15:19 GMT
కశ్మీర్‌ విషయంలో ఇప్పుడు - భవిష్యత్తులోనూ పాకిస్థాన్‌ కు అండగా ఉంటాం.. కశ్మీరీలపై అరాచకాలకు పాల్పడటం సరికాదు.. కశ్మీర్‌ సమస్యను అక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు పరిష్కరించాలి.. అని యు బోరెన్‌ పేర్కొన్నాడని పా‍కిస్థాన్‌​ పంజాబ్‌ ముఖ్యమంత్రి కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసిన చాలా సేపటివరకూ చైనా నుంచి దృవీకరణ ఏమీ రాలేదు కానీ.. తాజాగా ఈ సొంత డబ్బాలో - పాక్ మీడియా చేసిన హంగామాలో వాస్తవం లేదని, అదంతా కేవలం అవాస్తవ ప్రచారమే అని క్లారిటీ వచ్చేసింది!

తమకు ఆప్త మిత్రుడని - అన్నింట్లోనూ అండగా ఉంటాడని, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎవరిని చూసుకుని పాక్ భారత్ పై రెచ్చగొట్టే ప్రవర్తనకు - మాటలకు తెగించిందో ఆ మిత్రుడే తాజాగా పాక్ కు షాక్ ఇచ్చాడు. అది కూడా చిన్నా చితకా షాక్ కాదు.. ఒక భారీ షాకే. "భారత్‌ తో యుద్దం గనుక జరిగితే పాకిస్తాన్ కు సహకరిస్తామని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు" అని చైనా స్పష్టం చేసింది.

ఉరీ ఘటన నేపథ్యంలో భారత్ యుద్ధానికి దిగితే పాక్ కు చైనా అండగా ఉంటుందని చైనాకు చెందిన కాన్సుల్ జనరల్ యు బోరెన్ లాహోర్‌ లో చెప్పినట్లు పాక్ మీడియా ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. ఇదే సమయంలో పాక్‌ లోని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దాదాపు ఇలాంటి ప్రకటనే విడుదల చేసినట్లు డాన్ పత్రిక పేర్కొంది. అయితే తాజాగా ఈ విషయంపై చైనా క్లారిటీ ఇచ్చింది.
 
ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ... కశ్మీర్ అంశం భారత్ - పాక్‌ కు సంబంధించిన విషయమని.. ఇందులో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కేవలం ఆ రెండు దేశాలే ఈ మేరకు చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. పాకిస్థాన్‌ కు యుద్ధంలోనూ చైనా మద్దతిస్తుందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొంది.
Tags:    

Similar News