మాట‌ల‌తో మైండ్ గేమ్ మొద‌లెట్టిన డ్రాగ‌న్‌

Update: 2017-07-25 08:46 GMT
బ‌ల‌వంతుడికి ఏమాత్రం ఉండ‌కూడ‌నిది బ‌లుపు. అది ఎక్కువ అవుతున్న కొద్దీ విచ‌క్ష‌ణ మ‌ర్చిపోవ‌టం ఖాయం.  తాజాగా చైనా తీరు చూస్తే ఇలాంటి ప‌రిస్థితే క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా సిక్కిం స‌రిహ‌ద్దుల్లోని డోక్లాం ప్రాంతంలో చైనాకు దిమ్మ తిర‌గే షాకిచ్చిన భార‌త్ వైనం గురించి తెలిసిందే.

ప‌క్కోడి స‌రిహ‌ద్దుల మీద నిత్యం క‌న్నేస్తూ.. వారి ప్రాంతాన్ని చేజిక్కించుకోవటం ద్వారా అంత‌కంత‌కూ బ‌లోపేతం కావాల‌న్న‌దురాశ‌తో వ్య‌వ‌హ‌రించే చైనాకు ఏ మాత్రం మింగుడుప‌డ‌ని రీతిలో భార‌త్ వ్య‌వ‌హ‌రించ‌టం స‌హించ‌లేక‌పోతోంది.

భూటాన్ స‌రిహ‌ద్దు ప్రాంతంలో.. ఆ బుజ్జి దేశానికి సాయంగా నిలిచేందుకు భార‌త సైనికులు ప్ర‌ద‌ర్శిస్తున్న తెగువ.. చైనాకు ఇరిటేష‌న్‌ ను తీసుకొస్తోంది. న‌యానా.. భ‌యానా మాట‌ల‌తో దారికి తెచ్చుకోవాల‌ని ప్ర‌య‌త్నించిన చైనాకు అలాంటి ప‌ప్పులేమీ ఉడ‌క‌పోవ‌టంతో ఇప్పుడు మాట‌ల‌తో రెచ్చ‌గొట్టే కార్య‌క్ర‌మానికి తెర తీస్తోంది.

స‌రిహ‌ద్దుల్లో చైనా సైనికుల చేష్ట‌ల‌కు త‌గ్గ‌ట్లే.. చైనా మీడియా ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. మాట‌ల యుద్ధం మొద‌ల‌య్యేలా రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌ల‌తో వ్యాసాలు ప్ర‌చురిస్తోంది.

చైనా అధికారిక మీడియాగా చెప్పే గ్లోబ‌ల్ టైమ్స్ లో గ‌డిచిన కొద్దిరోజులుగా  భార‌త్ మీద త‌న‌కున్న అక్క‌సు మొత్తాన్ని తీర్చుకునేలా వ‌రుస క‌థ‌నాల్ని అచ్చేస్తోంది. అయితే.. ఇలాంటి మైండ్ గేమ్ కు లొంగ‌ని భార‌త్ ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇరుదేశాల మ‌ధ్య న‌డుస్తున్న పంచాయితీని శాంతియుత మార్గంలో ప‌రిష్క‌రించుకునేందుకు తాను సిద్ధ‌మ‌న్న సంకేతాన్ని భార‌త్ పంపుతున్నా.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

డోక్లాం ఇష్యూపై భార‌త్ మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. చైనా మాత్రం నిత్యం ఏదో పేరిట కెలుకుతూ.. భార‌త్ ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. చైనాలో ఈ నెల 26.. 27ల‌లో జ‌రిగే బ్రిక్స్ స‌మావేశానికి భార‌త ర‌క్ష‌ణ స‌ల‌హాదారు దోవ‌ల్ వెళ్ల‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప‌ర్య‌ట‌న ఇరు దేశాల మ‌ధ్య స‌మ‌స్య ప‌రిష్కారానికి అవ‌కాశం ఉందంటూ కొన్ని విదేశీ మీడియా సంస్థ‌ల్లో వ‌స్తున్న క‌థ‌నాల‌కు కౌంట‌ర్ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది గ్లోబ‌ల్ టైమ్స్‌.

దోవ‌ల్ త‌మ దేశానికి వ‌చ్చినంత మాత్రాన ఇరు దేశాల మ‌ధ్య ఉన్న స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని భార‌త్ భావించొద్దని పేర్కొంది. ఈ త‌ర‌హా ఊహాగానాల‌కు పుల్ స్టాప్ పెట్టాల‌ని చెప్ప‌టం ద్వారా.. భార‌త్ ను మ‌రోసారి రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇలాంటి మైండ్ గేమ్ ల‌కు ప‌డిపోయే ప్ర‌భుత్వం భార‌త్ లో లేద‌న్న విష‌యాన్ని చైనా గుర్తించ‌న‌ట్లుంది.
Tags:    

Similar News