'నోబెల్ ' పై కోరలు చాచిన చైనా...ఆ దేశానికి ఇవ్వొద్దని హెచ్చరికలు

Update: 2020-08-31 02:30 GMT
చైనా వ్యవహారం ప్రతీది వివాదాస్పదమవుతోంది. కరోనా పుట్టుకకు చైనానే కారణమని ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇంత జరుగుతున్నా చైనా వైఖరిలో ఎలాంటి మార్పు రావడం లేదు. అమెరికాతో పూర్తిగా సంబంధాలు తెగిపోవడం, భారత్ తో సరిహద్దు వివాదం, హాంగ్ కాంగ్ ను తన కంట్రోల్ లో పెట్టుకునేందుకు ప్రయత్నించడం..ఇలా చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పుడు చైనా నోబెల్ బహుమతుల వ్యవహారంలో చేతులు పెట్టి వివాదం సృష్టిస్తోంది. చైనా తీసుకువచ్చే ఏకపక్ష చట్టాలకు వ్యతిరేకంగా హాంగ్ కాంగ్ వాసులు పోరాటం చేస్తున్నారు. ఈ సారి నోబెల్ అవార్డు రేసులో హాంగ్ కాంగ్ పోరాట యోధులే ముందున్నారు. హాంగ్ కాంగ్ వాసులకు నోబెల్ శాంతి పురస్కారం దక్కడమంటే అది తమకు వ్యతిరేకంగా వ్యవహరించడమేనని చైనా భావిస్తోంది.

ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ నార్వే వెళ్లి హాంగ్ కాంగ్ వాసులకు నోబెల్ అవార్డు ఇవ్వొద్దంటూ హెచ్చరించారు. నార్వే విదేశాంగ మంత్రితో చర్చల అనంతరం వాంగ్ మాట్లాడుతూ నోబెల్ కోసం తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. చైనా అసమ్మతి నేత లియూకు నోబెల్ శాంతి అవార్డు అందజేసినప్పుడు చైనా నార్వేతో సంబంధాలు తెంపేసింది. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు నోబెల్ ప్రకటించిన సమయంలో కూడా చైనా ఇలాగే ప్రవర్తించింది. 15ఏళ్లుగా నార్వే గడప తొక్కని చైనా ప్రతినిధులు ఈ సారి హాంగ్ కాంగ్ వ్యక్తికి నోబెల్ వచ్చే అవకాశం ఉందని తెలిసి అక్కడి విదేశాంగ మంత్రిని కలసి హాంగ్ కాంగ్ కు నోబెల్ ఇవ్వొదంటూ హెచ్చరికలు ఇవ్వడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


Tags:    

Similar News